When Will They Come? ఎప్పుడొస్తాయో?
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:41 PM
When Will They Come? జిల్లాలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా మంజూరు కాలేదు. దీంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది. నిధుల్లేక పనులేవీ ముందుకు సాగడం లేదు.
గ్రామాల్లో ముందుకు సాగని అభివృద్ధి పనులు
పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్ల నిర్వహణకు అవస్థలు
జిల్లాకు రూ. 23 కోట్ల వరకు బకాయిలు
ఆశగా ఎదురుచూస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు
పార్వతీపురం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా మంజూరు కాలేదు. దీంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది. నిధుల్లేక పనులేవీ ముందుకు సాగడం లేదు. గత ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు సుమారు రూ.10 కోట్లును విడుదల చేసింది. ఆ తర్వాత నిధులేమీ మంజూరు కాకపోవడంతో పంచాయతీల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోంది. విద్యుత్‌శాఖతో పాటు మిగిలిన శాఖలకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. పారిశుధ్య పనులు, వీధిలైట్ల నిర్వహణ, బోర్లు మరమ్మతులకు ఇబ్బందులు తప్పడం లేదు. చెత్త సేకరణ కార్మికులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తున్నందున ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాల్సి ఉంది. లేకుంటే ప్రజలు రోగాలు బారిన పడే అవకాశం ఉంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల నిర్వహణ కూడా కష్టతరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్నిచోట్ల సర్పంచ్‌లు, సచివాలయ కార్యదర్శులు సొంత డబ్బులతో పంచాయతీల్లో అత్యవసర పనులు చేపట్టి తమ గౌరవాన్ని కాపాడుకుం టున్నారు. మరికొందరు అప్పులు చేసి పనులు చేపడుతున్నారు.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో 451 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత ఏడాది జూలై నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడం లేదు. మొత్తంగా రూ.23 కోట్ల మేర బకాయిలున్నట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో మేజర్ పంచాయతీల విషయానికొస్తే.. వాటికి ఇంటిపన్నులు లేదా ఇతర ఆదాయ వనరులు కాస్తోకూస్తో ఉంటాయి. దీంతో ఏదో ఒక విధంగా ప్రజలకు అవసరమైన అత్యవసర పనులు చేపట్టే వెసులుబాటు ఉంటుంది. మైనర్ పంచాయతీల్లో మాత్రం పరిస్థితి వేరు. వాటి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో ఏదో ఒకటి రెండు పంచాయతీలు మినహా మిగిలిన గిరిజన గ్రామాలకైతే ఎటువంటి ఆదాయం ఉండదు. ఈ క్రమంలో ఆయా పంచాయతీలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి.
త్వరలో నిధులు మంజూరు
పంచాయతీలకు త్వరలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. ప్రస్తుతం పంచాయతీల్లో ఉన్న నిధులతో ప్రజలకు అవసరమైన పనులు చేపట్టొచ్చు.
- కొండలరావు, డీపీవో, పార్వతీపురం మన్యం
Updated Date - Jun 30 , 2025 | 11:41 PM