‘Belt’ Be Removed? ‘ బెల్టు’ తీసేదెప్పుడు?
ABN, Publish Date - Jul 17 , 2025 | 12:09 AM
When Will the ‘Belt’ Be Removed? మద్యం దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు జరగాలి, ఎక్కడైనా బెల్టు షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తాం.’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడే బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి తమ దందా కొనసాగిస్తున్నారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా విక్రయాలు
సిండికేట్లుగా మారుతున్న కొందరు మద్యం వ్యాపారులు
సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరిక బేఖాతర్
కొన్ని గ్రామాల్లో షాపుల నిర్వహణకు వేలం పాటలు
భామిని టు బత్తిలి, గంగాడ టు వంగరకు సరఫరా
ఇష్టారాజ్యంగా దందా సాగిస్తున్న వైనం
తూతూమంత్రంగానే దాడులు
పార్వతీపురం, జూలై16(ఆంధ్రజ్యోతి): ‘మద్యం దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు జరగాలి, ఎక్కడైనా బెల్టు షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తాం.’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడే బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి తమ దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికను సైతం పట్టించుకోవడం లేదు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తూ.. అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కాగా పట్టణాల్లో పోలిస్తే గ్రామాల్లో బెల్టు దుకాణాల ద్వారానే మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే కొన్నిచోట్ల పోటాపోటీగా ఆ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం వేలం పాటలు కూడా నిర్వహిస్తున్నారు. బలిజిపేట మండలం చిల కలపల్లిలో రూ.3 లోక్షలకు ఒకరు బెల్ట్ దుకాణాన్ని దక్కించుకున్నారు. అదే మండలంలో శివరాంపురం, పనుకువలస, సుభద్ర, పెద్దింపేట తదితర గ్రామాల్లోనూ బెల్ట్ షాపుల నిర్వహణకు బహిరంగంగానే వేలం పాట నిర్వహించారని తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి..
నియోజకవర్గ కేంద్రాలతో పాటు ప్రధాన గ్రామాల్లో ఎక్కడికక్కడే బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. సిండికేట్‌లు ఒక్కో బాటిల్‌పై రూ.ఐదు నుంచి రూ.పది అదనంగా ఇచ్చి మద్యం కొనుగోలు చేసుకుంటున్నారు. అయితే గ్రామాల్లో డిమాండ్‌ను బట్టి వారు ఒక బాటిల్‌పై అదనంగా రూ.20 నుంచి రూ.30 పెంచి అమ్మకాలు చేపడుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గంగాడ టు వంగర ..
బెల్టు దుకాణాలకు మద్యం షాపుల నుంచే మద్యం సరఫరా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ మేరకు బలిజిపేట మండలం గంగాడ నుంచి విజయనగరం జిల్లా వంగర మండలానికి మద్యం తరలిస్తున్నారు. వంగర మండలంలో పలు గ్రామాలు గంగాడకు దగ్గరగా ఉన్నాయి. దీంతో కొందరు గంగాడ నుంచి మద్యం కొనుగోలు చేసి ఆయా గ్రామాల్లోని బెల్ట్‌షాపుల ద్వారా విక్రయాలు చేపడుతున్నారు.
భామిని నుంచి బత్తిలి
భామిని మండలం బత్తిలి గ్రామంలో మద్యం దుకాణం లేదు. ఇక్కడున్న గీత కార్మికులకు దుకాణాన్ని కేటాయించాల్సి ఉంది. అయితే అదునుగా కొందరు బత్తిలిలో బెల్ట్ దుకాణాలు తెరిచారు. భామిని నుంచి మద్యం బాటిళ్లు తీసుకొచ్చి ఈ గ్రామంలో విక్రయిస్తున్నారు.
కేవలం బెల్ట్ దుకాణాలకే సరఫరా...
జిల్లాలోని ఒక మండలంలో ఐదు మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే అందులో ఒక దుకాణం నుంచి కేవలం బెల్ట్ షాపులకే మద్యం సరఫరా అవుతుంది. మిగిలిన నాలుగు దుకా ణాల నుంచి రిటైల్ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.
తూతూ మంత్రంగా దాడులు..
కొన్ని ప్రాంతాల్లోని బెల్ట్ దుకాణాలపై ఎక్సైజ్ సిబ్బంది తూతూమంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారనే వ్యాఖ్యలు లేకపోలేదు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మొత్తంగా 292 కేసులు నమోదు చేశారు. 292 మందిని అరెస్ట్ చేసి.. 508.2 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బెల్ట్‌షాపుల కట్టడికి చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తాం. బెల్ట్‌షాప్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవు.
- రామచంద్రరావు, ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్, ఎక్సైజ్ శాఖ
Updated Date - Jul 17 , 2025 | 12:09 AM