What is our situation? మా పరిస్థితి ఏంటి?
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:40 PM
What is our situation? విధుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, బదిలీలపై మండల ప్రజా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ అధికారుల ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తున్నారు.
మా పరిస్థితి ఏంటి?
ఏ కేటగిరిలో ఉన్నాయో తెలియదు
ఎలా సర్దుబాటు చేస్తారో అర్థం కాదు
ముందుగా స్పష్టత ఇవ్వాలని వినతి
సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక మొర
పదోన్నతి, ఉద్యోగుల సర్దుబాటు తరువాతే బదిలీలు చేపట్టాలి. తామంతా ఏ కేటగిరి కిందకు వస్తున్నామే స్పష్టత ఇవ్వాలి. రెండు సంవత్సరాల ప్రొబేషన్ కాలానికి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఒకే సమయంలో రెండు, మూడు శాఖల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏ పని చేయాలో తెలియడం లేదు. ప్రతి ఉద్యోగి ఒకే శాఖకు (మాతృశాఖ) బాధ్యత వహించినట్లు చర్యలు తీసుకోవాలి. సర్వీస్ రూల్స్‌ను ఫ్రేమ్ చేయాలి. బదిలీల్లో సొంత మండలం, మున్సిపాల్టీ, కార్పొరేషన్‌లో పనిచేసేలా చూడండి.
- ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పెట్టుకుంటున్న మొరిది.
శృంగవరపుకోట, జూన్ 25 (ఆంధ్రజ్యోతి):
విధుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, బదిలీలపై మండల ప్రజా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ అధికారుల ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తున్నారు. రేషనలైజేషన్, బదిలీలపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగుల సర్దుబాటు చేయకుండా బదిలీలు చేస్తే ఇబ్బందులు పడతామని విన్నవించారు. చాలాచోట్ల బుధవారం అధికారులను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2019లో నూతనంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తెచ్చింది. రెండు వేల జనాభా నుంచి నాలుగు వేల జనాభా వరకు ఒక సచివాలయంగా ఏర్పాటు చేశారు. దీంతో ఒకటి నుంచి మూడు, నాలుగు గ్రామాలను కలుపుకొని సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. వీటిల్లో దాదాపు 10 నుంచి 12 శాఖలకు చెందిన ఉద్యోగులను నియమించారు. ఇంతవరకు బాగున్నప్పటికీ ఎవరు ఏ బాధ్యత నిర్వర్తించాలో స్పష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వలేదు. పంచాయతీరాజ్ శాఖకు చెందిన కార్యదర్శులకు ఉద్యోగుల జీతాలను పెట్టే డీడీవో అధికారం ఇచ్చారు.
విధులు ఇలా..
మాతృశాఖ విధులతో పాటు మండల ప్రజా పరిషత్ అధికారులు ఇతర పనులను అప్పగిస్తున్నారు. ఒక్కోసారి రెండు మూడు శాఖలకు చెందిన పనులను ఒకే సమయంలో చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో కొన్ని శాఖల ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగులకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. ఈ శాఖ ఉద్యోగులు మరేశాఖ ఉద్యోగులకు చెందిన ఏ పనైనా చక్కబెట్టగలుగుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ విషయానికి వచ్చేసరికి ఇతర శాఖల ఉద్యోగులు చేసే అవకాశం లేకపోవడంతో మిగిలిన శాఖల సహకారం వీరికి అందడం లేదు. ఈ విధంగానే వ్యవసాయ శాఖ, వెటర్నరీ, ఎనర్జీ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్‌ల పరిస్థితి ఉంది. వీరంతా సొంత శాఖ పనితోపాటు ఇతర శాఖల పనిని ఒకే సమయంలో చేయించడాన్ని గత వైసీపీ ప్రభుత్వం నుంచీ వ్యతిరేకిస్తున్నారు.
- సచివాలయ ఉద్యోగుల నియామక సమయంలో రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని చెప్పారు. ఈ కాలం మొత్తం నెలకు రూ.15వేల జీతం చెల్లించారు. ప్రొబేషన్ కాలం ముగిసిన తరువాత తొమ్మిది నెలల వరకు క్రమబద్ధీకరించలేదు. ఈ కాలానికి దాదాపు ఒక్కో ఉద్యోగి రూ.1.35 లక్షల వరకు నష్టపోయారు. దీనికి సంబంధించిన ఎరియర్స్ అడిగినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని భావించారు. ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు వీరి సంక్షేమం పట్టించుకోలేదు.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరానికి మంచి ఉద్యోగులు ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. అయితే మిగులు ఉద్యోగులకు ఏ పని అప్పగించనున్నారు? ఏశాఖలో విలీనం చేస్తారన్న విషయాలను ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా బదిలీ ప్రక్రయకు దిగింది. సొంత మండలంలో పనిచేయకూడదన్న నిబంధనను తెరపైకి తీసుకొచ్చింది.
- గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపకుండా ఇతర మండలాలకు బదిలీలను చేపట్టడం వీరికి రుచించలేదు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దిన తరువాతే బదిలీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.
Updated Date - Jun 25 , 2025 | 11:40 PM