ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ రోవర్‌ ఏమైంది?

ABN, Publish Date - Jul 12 , 2025 | 12:11 AM

రాజాం మున్సిపాలిటీ పరిధిలోని భూములు, చెరువులు ఇతరత్రా స్థలాలను రీసర్వే చేసేందుకు రెండేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రాజాం మున్సిపాలిటీకి రోవర్‌ పరికరాన్ని అందజేసింది.

రాజాం మున్సిపల్‌ కార్యాలయం

- నాలుగు నెలలుగా కనిపించని భూసర్వే పరికరం

- నెల్లిమర్లలో ఉన్నట్లు గతంలో చెప్పిన రాజాం మున్సిపల్‌ అధికారులు

- అక్కడ కూడా లేని వైనం

- 11 మందికి షోకాజ్‌ నోటీసులు

రాజాంరూరల్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాజాం మున్సిపాలిటీ పరిధిలోని భూములు, చెరువులు ఇతరత్రా స్థలాలను రీసర్వే చేసేందుకు రెండేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రాజాం మున్సిపాలిటీకి రోవర్‌ పరికరాన్ని అందజేసింది. రూ.10లక్షల విలువ చేసే ఈ రోవర్‌ గత నాలుగు నెలలుగా కనిపించడం లేదు. చివరిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో మున్సిపాలిటీ పరిధిలోని కొత్తవలస, కొండంపేట, సారథి, పొనుగుటివలస గ్రామాల్లో అప్పటి సర్వేయర్‌తో పాటు టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, తొమ్మిది మంది సచివాలయ ఉద్యోగులతో కూడిన బృందం రోవర్‌తో రీసర్వే నిర్వహించింది. ఆ తరువాత దాని జాడలేదు. రోవర్‌ను బిగించే స్టాండ్‌ మాత్రమే మున్సిపల్‌ కార్యాలయంలో దర్శనమిస్తోంది. ఈ విషయం బయటకు పొక్కనీయకుండా మున్సిపల్‌ ఉద్యోగులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇలా బయటపడింది..

రాజాం మున్సిపాల్టీ పరిధిలో నమోదైన 22ఏ భూములకు సంబంధించి వెంటనే రీసర్వే చేయాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో కోరారు. దీంతో ఆ భూములను రీసర్వే చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదే సమయంలో పట్టణంలోని రంగప్ప చెరువులో ఆక్రమణలను తొలగించాల్సి రావడంతో సర్వేకు రోవర్‌ అసరమైంది. దీంతో మున్సిపాలిటీ సిబ్బంది రోవర్‌ కోసం వెతుకులాట ప్రారంభించారు. అప్పటికే రోవర్‌ మాయమైన విషయం తెలిసిన కొందరు సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌ 24న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. దీంతో అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. నెల్లిమర్ల నగర పంచాయతీకి రోవర్‌ ఇచ్చామని, త్వరలో దాన్ని తెప్పిస్తామని అప్పట్లో అధికారులు చెప్పారు. కానీ, ఇంతవరకు రోవర్‌ను తీసుకురాలేదు. నెల్లిమర్లలో కూడా రోవర్‌ లేదని, అక్కడి నుంచి సాలూరు మున్సిపాలిటీకి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రూ.10లక్షల విలువచేసే రోవర్‌ ఏమైందో, ఎక్కడుందో, ఎవరు ఎవరికిచ్చారో, ఇచ్చిన విషయం రికార్డుల్లో ఎందుకు నమోదు చేయలేదో.. ఇచ్చినవారు తిరిగి రోవర్‌ తెచ్చేందుకు ఎందుకు ప్రయత్నం చేయలేదో.. ఇప్పుడా రోవర్‌ ఎక్కడుందో.. అసలుందో లేదో.. అనేవి జవాబుల్లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. దీనివెనుక గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారితో పాటు 9 మంది సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం, జవాబుదారీ లేనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోవర్‌ గల్లంతైన విషయంపై ప్రస్తుత మున్సిపల్‌ కమిషనర్‌ రామఅప్పలనాయుడు మున్సిపల్‌ ఉన్నతాధికారులకు (విజయవాడ) నివేదించారు. అలాగే, దీనికి కారణమైన 11 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఎక్కడుందో తెలియడం లేదు

రోవర్‌ ఎక్కడుందో తెలియడం లేదు. దీనిపై మున్సిపల్‌ ఉన్నతాధికారులకు నివేదించాను. తొలుత నెల్లిమర్లలో ఉందని తెలిసింది. అక్కడ కూడా లేదని తాజాగా నిర్ధారణ అయ్యింది. రోవర్‌ మిస్‌ అయిననాటికి విధుల్లో ఉన్న అప్పటి కమిషనర్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారి, తొమ్మిది మంది సచివాలయ ఉద్యోగుల వివరణ కోరుతూ ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీచేశాను. రోవర్‌ ట్రేస్‌అవుట్‌ కాకపోతే వారే బాధ్యులు అవుతారు.

-రామఅప్పలనాయుడు, కమిషనర్‌, రాజాం మున్సిపాలిటీ.

Updated Date - Jul 12 , 2025 | 12:11 AM