Found Dead! విశాఖ వెళ్తానని.. విగతజీవిగా మారి!
ABN, Publish Date - Mar 28 , 2025 | 11:58 PM
Went to Visakhapatnam… Found Dead! విశాఖపట్నం వెళ్తానన్న ఓ గిరిజన యువతి విగజీవిగా మారింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
సాలూరు రూరల్,మార్చి 28 (ఆంధ్రజ్యోతి ): విశాఖపట్నం వెళ్తానన్న ఓ గిరిజన యువతి విగజీవిగా మారింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సాలూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రివానివలసకు చెందిన వాకాటి ఐశ్వర్య ( 20 ) మామిడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది. అనంతరం విశాఖపట్నంలోని ఓ దుస్తుల షాపులో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. వీలైనప్పుడు స్వగ్రామం మర్రివానివలస వచ్చి తల్లిదండ్రులను కలుసుకుని తిరిగి వెళ్లేది. ఇటీవల కూడా అదేవిధంగా ఆ యువతి ఇంటికి వచ్చింది. అయితే రెండు రోజుల కిందట విశాఖ వెళ్తున్నాని చెప్పి బయల్దేరింది. అయితే ఏమైందో ఏమో కానీ.. మామిడిపల్లి సమీపంలో ఉన్న చీపురువలస జీడితోటలో చెట్టుకు ఉరేసుకుని.. శవమై కనిపించింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు, సోదరుడు కన్నీరుమున్నీ రయ్యారు. ఒక్కగానొక్క కుమార్తె ఇలా మరణించడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సాలూరు రూరల్ ఎస్‌ఐ నరసింహమూర్తి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆమె మృతిపై ఆరా తీస్తున్నారు. ఐశ్వర్య దత్తివలసకు చెందిన ఒక యువకునితో సన్నిహితంగా ఉన్నట్టు గుర్తించారు. తండ్రి ధర్మారావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.
Updated Date - Mar 28 , 2025 | 11:58 PM