ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఆడలి’ని చూసేందుకు వెళ్లి.. విగతజీవిగా మారి

ABN, Publish Date - May 21 , 2025 | 12:06 AM

సీతంపేటలోని ఆడలి వ్యూపాయింట్‌ అందాలను చూసి ఇంటికి తిరిగి వస్తున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ అమ్మనరావు

- లోయలో పడిన బైక్‌

- యువకుడి మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు

- వెల్లంగూడ వద్ద ఘటన

సీతంపేటరూరల్‌, మే 20(ఆంధ్రజ్యోతి): సీతంపేటలోని ఆడలి వ్యూపాయింట్‌ అందాలను చూసి ఇంటికి తిరిగి వస్తున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బైక్‌ లోయలో పడిపోవడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వెల్లంగూడ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. సీతంపేట గ్రామానికి చెందిన గిరిజాల వేణుమాధవ్‌(23), గిరిజాల మనోజ్‌, గిరిజాల తనుష్‌, అంపోలు సాయిచరణ్‌, వినోద్‌ రెండు ద్విచక్ర వాహనాలపై మంగళవారం ఉదయం 10 గంటలకు ఆడలి వ్యూపాయింట్‌ను చూసేందుకు వెళ్లారు. అక్కడ కాసేపు సరదాగా గడిపారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ఇంటికి బైక్‌లపై బయలుదేరారు. వెల్లంగూడ మలుపు వద్దకు వచ్చే సరికి వేణుమాధవ్‌, మనోజ్‌, తనుష్‌ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం బోల్తా కొట్టింది. దీంతో బైక్‌తో పాటు ముగ్గురు కూడా చిన్నపాటి లోయలోకి జారిపడ్డారు. వేణుమాధవ్‌ తలకు బలమైన గాయం కాగా, మనోజ్‌, తనుష్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఐటీడీఏ అంబులెన్స్‌లో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వేణుమాధవ్‌ మృతి చెందాడు. వేణుమాధవ్‌, మనోజ్‌, తనుష్‌ ఒకే కుటుంబానికి చెందిన వారు. వేణుమాధవ్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. ఆయనకు తండ్రి శంకర్రావు, తల్లి గంగాభవానీ, ఓ సోదరి ఉన్నారు. తండ్రి శంకర్రావు ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుడు అకాల మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై.అమ్మనరావు తెలిపారు.

వేణుమాధవ్‌ (ఫైల్‌)


వరుస ప్రమాదాలు..

ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలోని వెల్లంగూడ మలుపు వద్ద ఇటీవల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటికి నలుగురు మృత్యువాతపడ్డారు. ఎంతో మంది క్షతగాత్రులుగా మారారు. ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మలుపుల వద్ద రక్షణ గోడల నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకంలో నిధులు కేటాయించారు. ఈ పనులు ఇంకా జరుగుతున్నాయి.

Updated Date - May 21 , 2025 | 12:06 AM