We will complete Tarakarama Tirthasagar తారకరామ తీర్థసాగర్‌ను పూర్తి చేస్తాం
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:00 AM
We will complete Tarakarama Tirthasagar తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అందుకోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
తారకరామ తీర్థసాగర్‌ను పూర్తి చేస్తాం
వైసీపీ హయాంలో పైసా కూడా ఖర్చు చేయలేదు
తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు కీలకం
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
ఆనందపురం వద్ద బ్యారేజ్ పనుల పరిశీలన
గుర్ల, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అందుకోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గుర్ల మండలం ఆనందపురం వద్ద నిర్మాణంలో ఉన్న బ్యారేజ్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ప్రాజెక్టు ఇంజనీర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బ్యారేజ్‌ను పరిశీలించారు. ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గేట్లకు రంగులు కూడా వేయలేదన్నారు. ప్రాజెక్టును పూర్తిచేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విజయనగరం పట్టణానికి తాగునీరు, భోగాపురం విమానాశ్రయానికి నీటి అవసరాలను తీర్చడమే కాకుండా సుమారు 20వేల ఎకరాలకుపైగా సాగునీరు అందించే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఎంతో అవసరమని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే బ్యారేజ్ పనులు 90 శాతం పూర్తయినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్వహణ సైతం చూడకపోవడంతో గేట్లు, ఇతర నిర్మాణాలు తుప్పుపట్టాయని తెలిపారు. ప్రాజెక్టు డైవర్షన్ కెనాల్ 60 శాతం, సొరంగం పనులు 20శాతం పూర్తయ్యాయని చెప్పారు. సుమారు 2.7 టీఎంసీల నీరు నిల్వ ఉండగా రిజర్వాయర్ మట్టిగట్టు నిర్మాణ పనులు 60 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే ఆర్‌అండ్ ఆర్ కింద దాదాపు రూ.175 కోట్ల పెండింగ్ ఉందని, దానినీ చెల్లిస్తామన్నారు.
- ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పరిశీలించి వాటిని పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్ ఉండేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును పూర్తిచేయడానికి సుమారు రూ.807కోట్లు అవసరమని అంచనా వేశామని, ఆలస్యం అయితే ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు చేసిన కృషిని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ఆయన వెంట నెల్లిమర్ల, రాజాం ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, కోండ్రు మురళీమోహన్, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, టీడీపీ చీపురుపల్లి యువనేత కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, తారకరామ తీర్థసాగర్ ఎస్‌ఈ స్వర్ణకుమార్, ఆర్‌డీవోలు సత్యవాణి, డి.కీర్తి తదితరులు ఉన్నారు.
కలెక్టరేట్‌లో సమీక్ష
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి నిమ్మల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ తోటపల్లి బాలెన్స్ పనులు 2014-19కి శతశాతం పూర్తి చేసి ఇస్తే ఐదేళ్లలో జీరో చేశారని ఆరోపించారు. తారకరామ తీర్థసాగర్‌ను పూర్తి చేసి విజయనగరం, భోగాపురం ఎయిర్‌పోర్టుకు నీరు అందిస్తామన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ కుమిలి, సారిపల్లిలో ఆర్‌ఆండ్‌ఆర్ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ప్రస్తావించగా భూసేకరణ, పరిహారం అంశాలను రెండు నెలల్లో పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో తోటపల్లి కాలువ ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, 20 వేల ఎకరాలకే అందుతోందన్నారు. నీటి వినియోగం సక్రమంగా లేదని, లష్కర్లు నియమించాలని కోరారు. తోటపల్లి కాలువ పనులు ఏయే దశల్లో ఉన్నాయని అధికారులను మంత్రి ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు పని చేయకపోతే నోటీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
- జంఝూవతి ప్రాజెక్టు విషయంలో ఉన్న అంతర్ రాష్ర్టీయ సమస్యను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్, జేసీ సేతుమాధవన్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు, కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, నార్త్ కోస్టు చీఫ్ ఇంజనీరు గోపాల్, ఎస్‌ఈ స్వర్ణ కుమార్, ప్రాజెక్టు ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Updated Date - Apr 23 , 2025 | 12:00 AM