We gave our word.. we kept it మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం
ABN, Publish Date - Apr 26 , 2025 | 11:58 PM
We gave our word.. we kept it కూటమి ప్రభుత్వ పాలనలో మత్స్యకారుల దశ మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే ఆర్థికసాయం రెట్టింపు చేశాం. దీనివల్ల రాష్ట్రంలో 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల మేర లబ్ధి చేకూరింది’ అని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. గత పాలకుల మాదిరి బటన్ నొక్కకుండా.. ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని వెల్లడించారు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.
మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం
వేట నిషేధ సమయంలో రూ.20వేల సాయం విడుదల
1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో ‘మత్స్యకారుల సేవలో’ ప్రారంభం
శ్రీకాకుళం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వ పాలనలో మత్స్యకారుల దశ మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే ఆర్థికసాయం రెట్టింపు చేశాం. దీనివల్ల రాష్ట్రంలో 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల మేర లబ్ధి చేకూరింది’ అని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. గత పాలకుల మాదిరి బటన్ నొక్కకుండా.. ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని వెల్లడించారు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో ‘మత్స్యకార సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మత్స్యకారులు తూరాడ అప్పన్న, అలుపల్లి తవితాయి కుటుంబాలకు చెరో రూ.20వేల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘మత్స్యకారుల కష్టాలు నాకు తెలుసు. ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లడం.. వారు తిరిగి వచ్చే వరకూ ఆడబిడ్డలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూడటం నేను స్వయంగా చూశాను. కొందరు వ్యాపారులు బోట్లను ఇచ్చి.. మత్స్యకారుల ఆదాయం వాళ్లే కొట్టేస్తున్నారు. మీ కష్టాలు తీర్చేందుకు నేనున్నాను. మత్స్యకారులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. మత్స్యకార గ్రామాలు టీడీపీకి అండగా నిలబడ్డాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని రూ.10వేల నుంచి రూ.20వేల వరకు పెంచామ’ని సీఎం తెలిపారు.
- అభివృద్ధి అంటే బటన్ నొక్కడం కాదు..
‘గత పాలకుల్లా బటన్ నొక్కి ప్రచారం చేసుకోవడం నాకూ వచ్చు. కానీ చేయాల్సింది అదికాదు. ప్రజలందరికీ సంక్షేమం అందించడమే నా ధ్యేయం. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో రూ.300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఒక్క మత్స్యకారుని కుటుంబమైనా బాగుపడిందా? టీడీపీ ప్రభుత్వం హయాంలోనే మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేకంగా ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు ప్రతినెలా పింఛన్లు అందిస్తున్నాం. మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నాం. వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ. 9 సబ్సిడీ ఇస్తున్నామ’ని సీఎం తెలిపారు.
- ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా...
‘ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు సిద్ధం చేస్తున్నాం. బోట్లు కొనిచ్చి గ్రామాన్ని ఒక సెంటర్‌గా తీసుకుని ఆర్థికంగా ఆదుకుంటాం. ఏడాదిలో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌ను పూర్తిచేసి ప్రారంభిస్తాం. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు కోరిన విన్నపాలల్లో నారాయణపురం, మడ్డువలస స్టేజ్-2, తోటపల్లి కాలువ.. ఈ మూడు పూర్తి చేసి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనంతరం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
Updated Date - Apr 26 , 2025 | 11:58 PM