Unyielding Elephants వదలని ఘీం‘కరి’ంపు
ABN, Publish Date - Apr 27 , 2025 | 11:25 PM
Unyielding Elephants భామిని మండలం నేరడి బ్యారేజ్ సమీపంలో గత మూడు రోజులుగా సంచరిస్తున్న ఏనుగులు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం రాత్రి నేరడి వంశధార నదీతీరంలో ఉన్న పడవను ధ్వంసం చేశాయి.
గరుగుబిల్లి మండలంలో ధాన్యం నిల్వలు ధ్వంసం
భామిని, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): భామిని మండలం నేరడి బ్యారేజ్ సమీపంలో గత మూడు రోజులుగా సంచరిస్తున్న ఏనుగులు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం రాత్రి నేరడి వంశధార నదీతీరంలో ఉన్న పడవను ధ్వంసం చేశాయి. దీంతో జాలరి చక్క శ్రీనివాసరావు లబోదిబోమంటున్నాడు. గజరాజుల కారణంగా సుమారు రూ.మూడు లక్షల విలువైన పడవను నష్టపోయాయని వాపోయాడు. వాస్తవంగా ఈ పడవ ద్వారానే వర్షాకాలంలో నేరడి, గురండి, బిల్లుమడ, వడ్డంగి, లోహరజోల, సింగిడి ప్రజలు నది దాటి ఒడిశా వైపు ఉన్న కురిటిగూడ, ఖండవ, సావ, బడిగ, గౌరి గ్రామాలకు రాకపోకలు సాగిస్తారు. ఖండవ రైల్వేస్టేషన్‌కు కూడా అఽధికంగా చేరుకుంటారు. ప్రస్తుతం పడవ ధ్వంసం కావడంతో వర్షాకాలంలో వారు నది దాటడం వీలుపడదు. 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి స్వగ్రామాలకు చేరుకోవాల్సి వస్తుంది. దీనిపై అటవీశాఖాధికారులు స్పందించాలని జాలారి కోరాడు. కాగా ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఫారెస్ట్ బీట్ అధికారి దాలినాయుడు, గార్డు శ్రీనివాసరావు తెపాపారు. గజరాజుల గుంపు ఒడిశాలోని ఖండవ వైపు వెళ్లే అవకాశం ఉందని ట్రాకర్లు చెప్పారు.
తిరిగొచ్చాయ్..
గరుగుబిల్లి: గజరాజుల గుంపు గరుగుబిల్లి మండలానికి తిరిగొచ్చాయి. కొద్ది రోజులుగా జియ్యమ్మవలస, కురుపాం, కొమరాడ మండలాల్లో అవి సంచరించాయి. ఆయా ప్రాంతాల్లో పలు రకాల పంటలకు నాశనం చేశాయి. కాగా ఆదివారం తెల్లవారు జామున తోటపల్లి పంచాయతీ నందివానివలసలో అవి హల్‌చల్ చేశాయి. ప్రధన రహదారికి ఆనుకుని ఉన్న రైస్ మిల్లు ఆవరణలో ధాన్యం నిల్వలను ధ్వంసం చేశాయి. మిల్లు బయట ఉన్న బస్తాలను చెల్లా చెదురుగా పడేశాయి. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. అటవీశాఖధికారులు స్పందించి.. తక్షణమే వాటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - Apr 27 , 2025 | 11:25 PM