ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Friend's Betrayal మిత్రుడి మోసం తట్టుకోలేక..

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:10 AM

Unable to Bear Friend's Betrayal మిత్రుడి మోసాన్ని ఓ వ్యాపారి తట్టుకోలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు, వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చారు. అంతకముందు తన మృతికి కారణం స్నేహితుడే అంటూ సెల్‌ఫోన్‌లో వాయిస్‌ మెసేజ్‌లు పంపించారు,

నాగభూషణరావు (ఫైల్‌)

తెల్లవారుజామున తన షాపులోనే ఉరివేసుకున్న వైనం

ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణం

ముందుగా సెల్‌ఫోన్‌లో వాయిస్‌ మెసేజ్‌లు విడుదల

చేతులు, జేబుల్లో లేఖలు

తన చావుకు స్నేహితుడే కారణమని సందేశం

కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకోలు

సాలూరు, జూలై9 (ఆంధ్రజ్యోతి): మిత్రుడి మోసాన్ని ఓ వ్యాపారి తట్టుకోలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులు, వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చారు. అంతకముందు తన మృతికి కారణం స్నేహితుడే అంటూ సెల్‌ఫోన్‌లో వాయిస్‌ మెసేజ్‌లు పంపించారు, ఇదే విషయంపై లేఖలు రాసి.. చేతులు, జేబుల్లో పెట్టుకుని ఉసురుతీసుకున్నారు. ఈ విషాదకర ఘటన బుధవారం సాలూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పాచిపెంట మండలం మాతుమూరుకు చెందిన ఇండురి నాగభూషణరావు(63) చాలా ఏళ్ల కిందట కుటుంబంతో కలిసి సాలూరుకు వచ్చారు. పట్టణంలో తెలగావీధిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొన్నాళ్లుగా మామిడిపల్లి జంక్షన్‌ వద్ద ఉన్న మణికంఠ ఎలక్ర్టికల్స్‌ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మొదటి భార్య చనిపోవడంతో కూతురు, కొడుకు విశాఖలో ఉంటున్నారు. కొద్ది కాలానికి ఆయన రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్య, కూతురుతో కలిసి సాలూరులో ఉంటున్నారు. కాగా వివిధ కారణాలతో పట్టణానికి చెందిన తన స్నేహితుడు డబ్బి కృష్ణారావు వద్ద రూ.40 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే దానికి ప్రతినెలా వడ్డీ చెల్లించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో తన షాపును స్నేహితుడికే రూ.75 లక్షలకు విక్రయించారు. అయితే కృష్ణారావు రూ.40 లక్షలు తీసుకుని.. రుణంగా రూ.10 లక్షలు నాగభూషణరావుకు ఇచ్చారు. మిగతా రూ.25 లక్షలకు సంబంధించి అదే షాపును నాగభూషణరావుకు తనఖాకు ఇచ్చారు. షాపునకు గుడ్‌విల్‌ నిమిత్తం రూ.20వేలు, అప్పుగా తీసుకున్న రూ.10లక్షలకు గానూ రూ.10వేలు మొత్తంగా నెలకు రూ.30వేలు చొప్పున నాగభూషణరావు తన మిత్రుడైన కృష్ణారావుకు ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు వారు ఒప్పందం చేసుకున్నారు. మరోవైపు నాగభూషణరావు మరికొంతమంది వద్ద కూడా రుణంగా కొంతమొత్తం తీసుకున్నారు. అయితే కృష్ణారావుకు వడ్డీ సకాలంలో చెల్లించలేకపోవడం, స్నేహితుడి మోసం భరించలేక పోవడం, ఇతరులకు కూడా డబ్బులు ఇవ్వలేకపోవడంతో మనస్తాపం చెందారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు నాగభూషణరావు తన షాపులోనే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. కాగా తన భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భార్య, కూతురు కలిసి పట్టణంలో గాలించారు. షాపునకు వెళ్లి చూడగా.. తలుపులు తెరిచే ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా ఫ్యానుకు ఉరేసుకున్న నాగభూషణరావును చూసి వారు షాక్‌కు గురయ్యారు. ఇంటి పెద్దను కోల్పోయిన వారు ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ఇక తమకు దిక్కెవరంటూ? కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తన సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయే ముందు..మృతుడి వాయిస్‌ మెసేజ్‌ ఇలా..

‘కృష్ణా నువ్వు కావాలనే కదా ఆ కాగితం అలా రాశావు. 420యే కదా అదీ. ఆ కాగితం బయటకు వస్తే నీ పరువు, మర్యాదలు పోవా? మోసపూరితంగా నా సొమ్ము కాజేయడానికే కదా అలా రాసింది. నా షాపు స్వాధీన తనఖా పత్రం ఎలా రాసుకున్నావో ఒకసారి చదువుకుని చూడు. దానిని ఎవరికైనా చూపించు. కావాలని మోసం చేయడానికే ఆ కాగితం అలా రాశావు. నా డబ్బును అన్‌సెక్యూర్డ్‌ చేశావు. నేను రోజంతా కాకిలా కష్టపడితే.. నువ్వు సాయంత్రం గెద్దలా వచ్చి డబ్బులు తన్నుకుపోవడం ఎంతవరకు సమంజసం. నా డబ్బులు నాకే ఇచ్చి.. వడ్డీ తీసుకుంటున్నావు. నా పాతిక లక్షలు నీ దగ్గర ఉంచుకుని వాటిని నువ్వు వడ్డీని తిప్పుకోవడం సబబేనా? మిత్రుడుగా నిన్ను నమ్మినందుకు ఇంత ఇబ్బందికి గురిచేస్తావా..? నీ కారణంగానే నేను చనిపోతున్నాను. నా చావుకు నువ్వే కారణం. నా కుటుంబాన్ని అధికారులే ఆదుకోవాలి.’ అంటూ నాగభూషణరావు మరణించే ముందు వాట్సాప్‌ గ్రూపుల్లో వాయిస్‌ మెసేజ్‌లు పంపించారు. దీనిపై లేఖలు రాసి తన జేబులు, చేతుల్లో పెట్టుకుని షాపులో ఉరేసుకున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:10 AM