Painful Walk బడికి వెళ్లాలంటే .. ‘నడక’యాతన
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:07 AM
To Reach School… A Painful Walk ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు చదువు కష్టాలు తప్పడం లేదు. పాఠశాలలకు వెళ్లాలంటే ఆపసోపాలు పడాల్సి వస్తోంది. రోజూ కొండ దిగి... ఐదారు కిలోమీటర్లు నడిచి.. అటవీ ప్రాంతంలో రాళ్లు రప్పలు.. బురద రోడ్లును దాటుకుని బడులకు చేరాల్సిన దుస్థితి.
కొండ దిగి ... కిలో మీటర్ల కొద్దీ నడిచి స్కూళ్లకు వెళ్లాల్సిన దుస్థితి
నిత్యం రాళ్లు రప్పలు.. బురద రోడ్లు దాటాల్సిందే..
స్వగ్రామాల్లో పాఠశాలలు లేక అవస్థలు
ఆందోళనలో తల్లిదండ్రులు
జియ్యమ్మవలస, జూలై7(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు చదువు కష్టాలు తప్పడం లేదు. పాఠశాలలకు వెళ్లాలంటే ఆపసోపాలు పడాల్సి వస్తోంది. రోజూ కొండ దిగి... ఐదారు కిలోమీటర్లు నడిచి.. అటవీ ప్రాంతంలో రాళ్లు రప్పలు.. బురద రోడ్లును దాటుకుని బడులకు చేరాల్సిన దుస్థితి. స్కూళ్లకు వెళ్లిన చిన్నారులు తిరిగి ఇళ్లకు చేరే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నా.. సంబంధిత ఐటీడీఏ, విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
-జియ్యమ్మవలస మండలం టీకే జమ్ము పంచాయతీ కూటం గిరి శిఖర గ్రామంలో 15 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు చదువుకోవాలంటే గోర్లివలస ప్రాథమిక పాఠశాలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం రోజూ అటవీ ప్రాంతం మీదుగా కొండ కిందికి వెళ్లాల్సి ఉంది. నిత్యం సుమారు ఆరు కిలో మీటర్లు కాలినడకన తప్పడం లేదు. ఇదే విషయంపై గతంలో ‘అడవిలో ఆరు కిలో మీటర్లు’ శీర్షికన ఈ ఏడాది మార్చి 20న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అప్పట్లో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై మండల విద్యాశాఖాధికారులు మార్చి 21న ఆ గ్రామానికి చేరు కున్నారు. గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. సమస్యను అర్థం చేసుకున్నారు. కూటం గిరి శిఖర గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాల్సి ఉందని ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. కానీ నేటికీ పాఠశాల అక్కడ ఏర్పాటు కాలేదు. దీంతో ఆ గ్రామ గిరిజన విద్యార్థులకు అటవీ ప్రాంతం మధ్య నుంచి కాలినడకన తప్పడం లేదు. తమ పిల్లలకు ఏ ప్రమాదం జరిగినా అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ గ్రామ గిరిజనులు చెబుతున్నారు.
- గరుగుబిల్లి: జియ్యమ్మవలస మండలం కుదమ పంచాయతీ పరిధి గంగరాజపురం గదబవలస గ్రామ విద్యార్థుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. గతంలో ఈ గ్రామంలో పాఠశాల ఉండేది. కానీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో వైసీపీ సర్కారు హయాంలో అక్కడ పాఠశాలను ఎత్తివేశారు. దీంతో అక్కడి గిరిజన చిన్నారులు గరుగుబిల్లి మండలం తోటపల్లిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. పూర్తిగా బురదమయమైన గోతుల రోడ్డుపై నుంచి రోజూ రెండు కిలో మీటర్లు నడిచి పాఠశాలకు చేరుకోవాల్సి వస్తోంది. అయితే మార్గమాధ్యంలో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 12 మంది విద్యార్థులు రోజూ నానా అవస్థలు పడుతున్నారని, తమ గ్రామంలో ఉన్న పాఠశాలను పునః ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
- అర్నాడ పంచాయతీ వీరబ్రహ్మేంద్రపురం, డంగభద్రవలస గ్రామ గిరిజన విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది. దీనిపై ప్రజాప్రతినిధులు, కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. విద్యార్థులకు చదువు కష్టాలు తప్పించాలని వేడుకుంటున్నారు.
నివేదిక పంపించాం
గతంలో కూటం గిరిశిఖర గ్రామాన్ని పరిశీలించాం. అక్కడ పాఠశాల ఏర్పాటు చేయాలని నివేదిక పంపించాం. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. గంగరాజపురం గదబవలస గ్రామంలో పరిస్థితిని పరిశీలిస్తాం. పాఠశాల ఏర్పాటు చేయాలని పైఅధికారులను కోరుతాం.
- ధనుకొండ గౌరునాయుడు, ఎంఈవో-1, జియ్యమ్మవలస
Updated Date - Jul 08 , 2025 | 12:07 AM