Time for rationalization హేతుబద్ధీకరణకు సమయం ఆసన్నం
ABN, Publish Date - Jun 13 , 2025 | 12:03 AM
Time for rationalization ప్రభుత్వం మే 16 నుంచి జూన్ 2వరకు ఉద్యోగుల బదిలీలపై విధించిన నిషేధం సడలించడంతో జిల్లాలోని అన్ని శాఖల్లోనూ బదిలీలు ఊపందుకున్నాయి. ఈ శాఖలన్నిటికీ చెందిన ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ శాఖల నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతో వీరెవ్వరికీ ఇంతవరకు బదిలీలు జరగలేదు.
హేతుబద్ధీకరణకు సమయం ఆసన్నం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్థానచలనం
ఈనెల 30లోపు ప్రక్రియ పూర్తిచేసేలా ఉత్తర్వులు జారీ
ఇప్పటికే కేటగిరీల వారీగా నియామకానికి రూపొందిన ప్రణాళిక
ప్రభుత్వం నుంచి లైన్ డిపార్ట్‌మెంట్‌లకు అందిన జాబితా
మిగులు ఉద్యోగుల్లో కలవరం
ప్రభుత్వం మే 16 నుంచి జూన్ 2వరకు ఉద్యోగుల బదిలీలపై విధించిన నిషేధం సడలించడంతో జిల్లాలోని అన్ని శాఖల్లోనూ బదిలీలు ఊపందుకున్నాయి. ఈ శాఖలన్నిటికీ చెందిన ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ శాఖల నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతో వీరెవ్వరికీ ఇంతవరకు బదిలీలు జరగలేదు. తాజాగా గ్రామ వార్డు సచివాలయ విభాగం కూడా బదిలీల పక్రియ, హేతుబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. ఈనెల 30లోపు హేతుబద్ధీకరణ, బదిలీల పక్రియ పూర్తిచేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
- గంట్యాడ మండలం కోటారుబల్లి గ్రామ సచివాలయంలో డిజిటిల్ అసిస్టెంట్ (కార్యదర్శి-6)ని తప్పించి పంచాయతీ కార్యదర్శిని ఉంచుతున్నారు. సంక్షేమ విద్యా అసిస్టెంట్ విధులను అలాగే ఉంచి మహిళ పోలీస్‌ను తప్పిస్తున్నారు. ఈ సచివాలయంలో పని చేయాల్సిన నలుగురు సాధారణ ఉద్యోగుల్లో ఇద్దరిని మాత్రమే విధుల్లో ఉంచుతున్నారు. మిగిలిన వారికి టెన్షన్ పట్టుకుంది. ఈ విధంగా 624 మంది ఉద్యోగులు మిగిలిపోతున్నారు.
- వేపాడ మండలం వీలుపర్తి గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రామ రెవెన్యూ అధికారి, ఏఎన్‌ఎం, వెటర్నరీ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్‌లకు విధులు అప్పగిస్తున్నారు. సర్వే అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, ఫీషరీస్ అసిస్టెంట్, హార్టీకల్చర్ అసిస్టెంట్, సెరీకల్చర్ అసిస్టెంట్‌లను తప్పిస్తున్నారు. వీరు కలవరం చెందుతున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో 3,081 మంది ఉద్యోగులు మిగులుతున్నారు.
శృంగవరపుకోట, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 530 గ్రామ సచివాలయాలు, 96 వార్డు సచివాలయాలు కలిపి మెత్తం 626 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పురుడు పోసుకున్న ఈ సచివాలయాల్లో ఒకరికి పనుంటే, మరొకరికి పని ఉండడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీన్ని సరిచేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూనుకుంది. గ్రామ వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరిస్తోంది. ఇప్పటికే సచివాలయాల జనాభా ప్రతిపాదికన ఏ. బీ, సీలుగా విభజించింది. ఇదే విధంగా వీటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా సాధారణ, నిర్దిష్ట(టెక్నికల్) ప్రయోజిత ఉద్యోగులుగా వర్గీకరించింది. ఏ కేటగిరి సచివాలయాల్లో ఆరుగులు ఉద్యోగులు, బి కేటగిరి సచివాలయాల్లో ఏడుగురు ఉద్యోగులు, సీ కేటగిరి సచివాలయాల్లో ఎనిమిది మంది ఉద్యోగులు పని చేసేలా ప్రభుత్వం ఇప్పటికే జిల్లాల వారీగా జాబితాను తయారు చేసి పంపించింది. సచివాలయాల్లో పనిచేయాల్సిన ఉద్యోగుల సంఖ్యతో పాటు శాఖల వారీగా విధులు నిర్వర్తించే వారి వివరాలనూ పొందుపరిచారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో సాధారణ పనితీరు ఉద్యోగులు గ్రామ, వార్డు సచివాలయాల్లో 1880 మంది ఉన్నారు. వీరిలో 624 మంది ఉద్యోగులు మిగిలిపోతున్నారు. నిర్దిష్ట (టెక్నికల్) ప్రయోజిత పనితీరు ఉద్యోగుల్లో 2,795 మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. మరో 3,081 మంది ఉద్యోగులు మిగులుతున్నారు.
- జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలన్నిటిలోనూ హేతుబద్ధీకరణలో భాగంగా 4,665 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. 3,705 మంది వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యతల నుంచి తప్పిస్తున్నారు. వీరందరినీ ఎక్కడెక్కడ సర్దుబాటు చేయనున్నారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఏఎన్‌ఎంలు తప్ప మిగిలిన శాఖల పరిధిలో చేస్తున్న ఉద్యోగులందరూ కలవరపాటుకు గురవుతున్నారు.
బదిలీలకు మార్గదర్శకాలివే..
- ఒకే గ్రామ, వార్డు సచివాలయంలో ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులందరికీ తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. ఈ కాలం పూర్తికాని వారు వ్యక్తిగత అభ్యర్థనపై బదిలీకి అర్హులు.
- ఉద్యోగి సొంత మండలంలోని గ్రామ వార్డు సచివాలయాలకు బదిలీలకు అనర్హులు
- ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కలెక్టర్ బదిలీలు, నియామక పత్రాలు అందిస్తారు.
- బదిలీల ప్రక్రియ పూర్తితరువాత కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట పోస్టులకంటే ఎక్కువ ఉంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అక్కడే కొనసాగిస్తారు
- హేతుబద్ధీకరణ, బదిలీ పక్రియ పూర్తయిన తరువాత జూలై 10లోపు హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో మ్యాపింగ్ పూర్తిచేయాలి.
ఈ కేటగిరీలకు ప్రాధాన్యం
- దృష్టిలోపం, మానసిక వికలాంగ పిల్లలు ఉన్నవారికి వైద్య సదుపాయాలు అందుబాటులో వున్న గ్రామ వార్డు సచివాలయానికి బదిలీ అవకాశం
- గిరిజన ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు పనిచేసిన వారికి, నిబంధనల ప్రకారం 40శాతం, అంతకంటే ఎక్కువున్న ఉద్యోగులకు, దీర్ఘకాలిక వ్యాధులు క్యాన్సర్, ఓపెన్ సర్జరీ, ఓపెన్ హార్ట్ ఆపరేషన్‌లు, న్యూరోసర్జరీ, కిడ్ని మార్పిడితో పాటు వైద్యకారణాలతో ఆధార పడే జీవిత భాగస్వామి, పిల్లలున్న ఉద్యోగులు, కారుణ్యప్రాతిపాదికన నియమించిన వితంతు మహిళలకు కోరుకున్న సచివాలయానికి బదిలీ
- భార్యా,భర్త ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే వారిద్దరికి ఒకే చోట అవకాశం
- దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. ప్రత్యేక అభ్యర్థనతో వీరికి బదిలీ అవకాశం.
Updated Date - Jun 13 , 2025 | 12:03 AM