ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక తోడేస్తున్నారు

ABN, Publish Date - Jul 10 , 2025 | 12:24 AM

అధికార, ప్రతిపక్ష నేతలు ఏకమై ఇసుకను తోడేస్తున్నారు. చంపావతి నది, ఏడోంపుల గెడ్డలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలకు తెగబడుతున్నారు.

తుమ్మికాపల్లి వద్ద చంపావతి నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు

-చంపావతి నది, ఏడోంపుల గెడ్డలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

- ఉచితం పేరిట అక్రమంగా రవాణా

- ఏకమైన అధికార, ప్రతిపక్ష నేతలు

- అడుగంటుతున్న భూగర్భజలాలు

- తూతూమంత్రంగా అధికారుల దాడులు

గజపతినగరం జూలై 9 (ఆంధ్రజ్యోతి): అధికార, ప్రతిపక్ష నేతలు ఏకమై ఇసుకను తోడేస్తున్నారు. చంపావతి నది, ఏడోంపుల గెడ్డలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలకు తెగబడుతున్నారు. ఉచితం పేరిట ప్రతిరోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించుకుపోతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒక్కటికావడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇసుక తవ్వకాలు అడ్డగోలుగా చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనివల్ల వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఇదీ గజపతినగరం మండలంలో జరుగుతున్న ఇసుక దందా తీరు. తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన టీడీపీ, వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు ప్రతిరోజూ ఇరవై ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అర్ధరాత్రి యంత్రాలతో వచ్చి ఇసుకను తవ్వి సమీప తోటలు, పొలాల్లో నిల్వ చేస్తున్నారు. అనంతరం స్థానిక అవసరాల కోసమని చెప్పి ట్రాక్టర్లతో పట్టణ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తీరానికి ఆనించి ఇసుక తవ్వకాలు చేపట్టడంతో సమీప పొలాలు నదిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా చంపావతి నది నుంచి తుమ్మికాపల్లి, కెంగువ, పురిటిపెంట, గంగచోళ్ల పెంట గ్రామాలకు చెందిన ట్రాక్టర్లతో, ఏడోంపుల గెడ్డ నుంచి ఎం.గుమడాం, లింగాలవల, కొత్తశ్రీరంగరాజపురం గ్రామాలకు చెందిన ట్రాక్టర్లతో అధికంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇసుకను తోడేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలతో చంపావతి, ఏడోంపుల గెడ్డ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సుమారు 3వేల ఎకరాలకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. గతంలో నదిలో ఇసుక నిల్వలు ఉండడం వల్ల తేమ శాతంతో భూగర్భ జలాలు పెరిగి వేసవిలో తాగు,సాగునీటికి సమస్య ఉండేది కాదు. ప్రస్తుతం ఇసుకను పూర్తిగా తోడేయడంతో మట్టి కనిపిస్తుందని, దీనివల్ల సాగు, తాగునీటి సమస్య ఏర్పడిందని ఎం.గుమడాం, పురిటిపెంట, లింగాలవలస, గంగచోళ్లపెంట, కెంగువ, తుమ్మికాపల్లి తదితర గ్రామాల ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకాలతో తమ పంట పొలాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటీవల తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి తూతుమంత్రంగా దాడులు జరిపి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు ఒక్కటైనప్పుడు తాము ఏమి చేయగలమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.

చర్యలు తప్పవు

ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవు. మొదటిసారి ట్రాక్టర్‌ పట్టుబడితే రూ.10 వేలు అపరాధ రుసుం విధిస్తాం. అదే ట్రాక్టర్‌ రెండో పర్యాయం పట్టుబడితే రూ.20 వేలు విధిస్తాం. ఎటువంటి అనుమతులు లేకుండా నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలించరాదని ఇప్పటికే దండోరా వేయించాం. చంపావతి, ఏడోంపుల గెడ్డ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులతో పర్యవేక్షణ కొనసాగిస్తాం.

- బి.రత్నకుమార్‌, తహసీల్దార్‌, గజపతినగరం

Updated Date - Jul 10 , 2025 | 12:24 AM