They are robbing the river..! నదిని దోచేస్తున్నారు..!
ABN, Publish Date - May 30 , 2025 | 12:07 AM
They are robbing the river..! ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమ ధనార్జనే ధ్యేయంగా దోచుకుంటున్నారు. నామరూపాల్లేకుండా చేస్తున్నారు. కాపాడాల్సిన అఽధికారులు అటువైపుగా కన్నెత్తి చూడడంలేదు.
నదిని దోచేస్తున్నారు..!
చంపావతిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు
ఇప్పటికే పెద్దపెద్ద గోతులు
20పైగా ట్రాక్టర్లతో తరలింపు
భోగాపురం, మే29(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమ ధనార్జనే ధ్యేయంగా దోచుకుంటున్నారు. నామరూపాల్లేకుండా చేస్తున్నారు. కాపాడాల్సిన అఽధికారులు అటువైపుగా కన్నెత్తి చూడడంలేదు. తమ బాధ్యత కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. భోగాపురం మండలం కోటభోగాపురం వద్ద చంపావతి నదీ ప్రాంతంలో తాజాగా ‘ఆంధ్రజ్యోతి’ కెమెరా కంట పడిన దృశ్యాలు ప్రకృతిలో జరుగుతున్న విధ్వంసాన్ని చూపాయి. ఆ ప్రాంతాన్ని గమనిస్తే నదీ గర్భాన్ని ఇసుకాసురులు ఏ స్థాయిలో తోడేస్తున్నారో అర్థమవుతోంది. నిరంతరం ఎక్సకవేటర్లతో తవ్వకాలు కొనసాగిస్తూ నది నామరూపాల్లేకుండా చేస్తున్నారు. యంత్రాలతో లోతుగా తవ్వి ట్రాక్టర్లకు నింపి తరలించుకుపోతున్నారు. సుమారు 20 ట్రాక్టర్లకు పైగా నిత్యం నదీగర్భాన్ని ఖాళీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూడకపోవడం గమనార్హం. ఇసుక తరలించేందుకు దారి లేకపోయినా ప్రమాదకరంగా ట్రాక్టర్లను నడుపుతూ ఇసుకను పట్టుకుపోతున్నారు. ఈ దందా వల్ల నది ప్రమాదకరంగా మారుతోంది. పెద్ద పెద్ద గోతులతో నిండిపోతోంది. అందం.. ఆహ్లాదకరంగా మొన్నటివరకు కనిపించిన నది నేడు కకావికళంగా దర్శనమిస్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని నదీ తీర గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. వచ్చేది వర్షాకాలం కావడంతో వరద నీరు చేరాక సమీప గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే నదీ స్నానం కోసం కాని, ఈత సరదా కోసం కాని దిగే వారి పరిస్థితి ఏంటని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులు ఇసుకను అక్రమంగా తవ్వి రూ.లక్షల్లో ధనార్జన పొందుతున్నారు. ఇక్కడి నుంచి ట్రాక్టర్లతో తరలించి ఆపై లారీలకు నింపి విశాఖ, ఇతర ప్రాంతాల్లో ఇసుకను భారీ ధరకు విక్రయిస్తున్నారు. పట్టపగలే యంత్రాలతో భారీగా తవ్వకాలు జరుపుతున్నారంటే అధికారుల తీరు ఏవిధంగా ఉందో తెలుస్తోంది. దీనిపై తహసీల్దార్ ఎం.సురేష్‌ను వివరణ కోరగా ఆర్‌ఐ, వీఆర్వోను పంపించి పరిశీలించి చర్యలు తీసుకొంటామని తెలిపారు.
Updated Date - May 30 , 2025 | 12:07 AM