Lakshimpet: లక్షింపేటలో అల్లర్లు జరగకూడదు
ABN, Publish Date - May 13 , 2025 | 11:17 PM
Lakshimpet:లక్షింపేట కేసు కోర్టులో విచారణ ప్రారంభంకానున్న నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
- పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
- గ్రామంలో పర్యటించిన ఎస్పీ వకుల్ జిందల్
వంగర, మే 13 (ఆంధ్రజ్యోతి): లక్షింపేట కేసు కోర్టులో విచారణ ప్రారంభంకానున్న నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. మంగళవారం ఆయన లక్షింపేటలో పర్యటించారు. 2012లో గ్రామంలో జరిగిన వివాదానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితి, న్యాయస్థానంలో కేసు విచారణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు, నిందితులతో మాట్లాడారు. గ్రామంలో శాంతియుత వాతావరణంలో కేసు విచారణ జరగడానికి అంతా సహకరించాలని కోరారు. గ్రామంలో పికెట్‌లో ఉన్న పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్న వివాదం కూడా జరగడానికి అవకాశం లేకుండా చూడాలన్నారు. గ్రామంలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే వెంటనే తమదృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం వంగర పోలీసు స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. లక్షింపేట బాధితులు గంగులు, సింహాలతో పాటు పలువురు పోలీసుస్టేషన్‌కు చేరుకుని గ్రామంలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిగే సమయానికి కొత్తగా పీపీని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం, విజయనగరం కలెక్టర్లకు వివరిస్తానని ఎస్పీ తెలిపినట్లు బాధితులు చెప్పారు. ఎస్పీ వెంట చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, రాజాం సీఐ ఉపేంద్రరావు, ఎస్‌ఐ శంకర్ తదితరులు ఉన్నారు.
Updated Date - May 13 , 2025 | 11:17 PM