The war on fluoride ఫ్లోరైడ్ రక్కసిపై యుద్ధం
ABN, Publish Date - Jun 01 , 2025 | 11:38 PM
The war on fluoride ఫ్లోరైడ్ నియంత్రణపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లావ్యాప్తంగా ఫ్లోరైడ్ మూలాలపై సర్వే నిర్వహించింది. అత్యధికంగా బాధితులు రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న 25 గ్రామాల్లో ఉన్నట్లు నిర్ధారించింది. ఆయా గ్రామాల్లో 88 మంది ఫ్లోరైడ్ బారిన పడినట్లు, వీరిలో 30 మంది వరకూ చిన్నారులున్నట్లు గుర్తించింది.
ఫ్లోరైడ్ రక్కసిపై
యుద్ధం
నాలుగు మండలాల్లోని 25 గ్రామాల్లో ఫ్లోరైడ్
88 మంది బాధితుల గుర్తింపు
సర్వే చేసిన జిల్లా వైద్యశాఖ
అదుపునకు తక్షణం చర్యలు
రాజాం రూరల్, జూన్1(ఆంధ్రజ్యోతి): ఫ్లోరైడ్ నియంత్రణపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లావ్యాప్తంగా ఫ్లోరైడ్ మూలాలపై సర్వే నిర్వహించింది. అత్యధికంగా బాధితులు రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న 25 గ్రామాల్లో ఉన్నట్లు నిర్ధారించింది. ఆయా గ్రామాల్లో 88 మంది ఫ్లోరైడ్ బారిన పడినట్లు, వీరిలో 30 మంది వరకూ చిన్నారులున్నట్లు గుర్తించింది. ఇప్పటికే వారికి వైద్యసేవలతో పాటు అవసరమైన పరికరాలు అందజేసింది. జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు కూడా స్ర్కీనింగ్ టెస్ట్‌లు నిర్వహించి భవిష్యత్తులో ఫ్లోరైడ్ మహమ్మారి బారిన పడకుండా కార్యాచరణ రూపొందించింది.
ఫ్లోరోసిస్ లక్షణాలివీ
ఫ్లోరోసిస్ బారినపడితే కాళ్లు, చేతులు వంకరపోవడం, వెన్నుముక కట్టేలా బిగుసుకు పోవడం, ఎముకలు పెళుసుబారడం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వెన్నెముక లిగ్‌మెంట్స్ ఉబ్బిపోయి, నరాలు ఒత్తుకుపోయి, కాళ్లు, చేతులకు తిమ్మిర్లు వచ్చి అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఎదురవుతుందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థతో పాటు ఎర్ర రక్తకణాలు, వీర్య కణాలపైనా ఫ్లోరైడ్ దుష్ప్రభావం చూపుతుందని వైద్యులంటున్నారు. దంతాలు పసుపు లేదా గోధుమవర్ణం నుంచి నల్లగా మారి దెబ్బతింటాయని, కొంతమందికి కాళ్లు వంకర్లు పోతాయని స్పష్టం చేస్తున్నారు. ఫ్లోరైడ్ మూలాలున్నట్లు నిర్దారించిన గ్రామాల్లో గర్భిణులుంటే ముందస్తు పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డలు ఫ్లోరోసిస్ బారిన పడకుండా కాపాడవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ప్రాథమిక స్థాయిలోనే గుర్తించామన్న డీఎంహెచ్‌వో
జిల్లాలో ప్రాథమిక స్థాయిలో ఫ్లోరైడ్ బాధితుల్ని గుర్తించేందుకు వీలుగా చర్యలు ప్రారంభించామని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి ఎస్.జీవనరాణి ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం ఆరోగ్య, ఆశ కార్యకర్తలకు శిక్షణనిచ్చి ఫ్లోరోసిస్ బాధితులకు చికిత్స అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. రాజాం నియోజకవర్గంలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలా ల్లోని 25 గ్రామాల్లో ఫ్లోరోసిస్ మూలాలున్నట్లు గుర్తించామన్నారు. 88 మందిలో ముగ్గురు పిల్లలు, ఆరుగురు పెద్దలు డెంటల్ ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడ్డారని, మరో ఇద్దరికి స్కెలిటల్ ఫ్లోరోసిస్ సోకిందని స్పష్టం చేశారు. బాధితులకు మందులు అందజేస్తున్నామని, నడవలేని వారికి వీల్‌చైర్లు సైతం ఇచ్చామని తెలిపారు. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలలో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నామని, ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో, ఏవి తినకూడదో అవగాహన కల్పిస్తున్నట్లు జీవనరాణి వెల్లడించారు.
ఎందుకిలా..
వాస్తవానికి తాగేనీరు, తీసుకున్న ఆహారం ద్వారా ఎక్కువమొత్తంలో ఫ్లోరైడ్ వ్యక్తి శరీరంలోకి వెళ్తే ఏర్పడే అనారోగ్యాన్ని ఫ్లోరోసిస్ అంటారని వైద్యశాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇవే కాకుండా నీటిలో ఉండే 15 మూలకాలతో పాటు నైట్రేట్, బెరిలియం వంటి ప్రమాదకర కారకాలు మనిషి శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా ఫ్లోరోసిస్‌కు మరో కారణం. మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడినవారి ఎముకల్లో ఫ్లోరైడ్ ఉండిపోవడం కూడా ఇంకో కారణం.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అల్యూమినియం పాత్రల్లో వండే పదార్థాలను తినకూడదు. రక్షిత నీటిని తాగాలి. అల్లం, వెళ్లుల్లి, చిరుధాన్యాలు, క్యారెట్, బొప్పాయి, టమాటా, పప్పుధాన్యాలు, చిలగడ దుంపలు, తీసుకోవాలి. పాలు, పెరుగు, జున్ను, బెల్లం, ఆకుకూరలు, మునగకాడలు, జీలకర్ర, ఉసిరి, జామ, నిమ్మ తీసుకుంటే మేలని వైద్యులు తెలిపారు.
రాజాం నియోజకవర్గంలో...
రాజాం నియోజకవర్గంలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలలోని 25 గ్రామాలలో ఫ్లోరైడ్ ప్రభావం ఉన్నట్లు జిల్లా వైద్యశాఖ గుర్తించింది. వాస్తవానికి ఉష్ణోగ్రతల ఆధారంగా పరిశీలిస్తే.. ఫ్లోరైడ్ స్థాయి 0.7 నుంచి 1.2 పిపిఎంగా ఉన్న జలాలను తాగవచ్చు. అయితే వైద్యశాఖ నిర్ధారించిన 25 గ్రామాల్లో తాగునీటిలో 1.5 పిపిఎం కన్నా ఎక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ గుర్తించింది. దీంతో ఆయా గ్రామాల్లో కొంతమంది ఫ్లోరోసిస్ బారిన పడినట్లు అధికారులు ప్రకటించారు.
రాజాం మండలంలో.... అంతకాపల్లి, పొగిరి, అమరాం, దోసరి, మారేడుబాక..
రేగిడి మండలంలో... కొర్లవలస, అంబకండి, మునకలవలస, లింగాలవలస, పెద శిర్లాం, పారంపేట, వన్నలి, ఒప్పంగి, వెంకంపేట
సంతకవిటి మండలంలో... మండాకురిటి, గోవిందపురం, బిల్లాణి, గుళ్ల సీతారాంపురం, మాధవరాయపురం, గోళ్లవలస
వంగర మండలంలో... కొట్టిశ, కోనంగిపాడు, శ్రీహరిపురం, లక్ష్మిపేట కాలనీ, మరువాడ గ్రామాల్లో ఫోరైడ్ బాధితులను వైద్యశాఖ గుర్తించింది.
Updated Date - Jun 01 , 2025 | 11:38 PM