సీట్లు నిండట్లే!
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:39 AM
విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు వారాలు దాటుతున్నా జిల్లాలో చాలా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) సీట్లు భర్తీ కాలేదు.
- కేజీబీవీల్లో ప్రవేశాలకు ఆసక్తి చూపని విద్యార్థినులు
- అవగాహన కల్పించని అధికారులు
-కానరాని రెగ్యులర్ అధ్యాపకులు
నెల్లిమర్ల, జూలై 4(ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు వారాలు దాటుతున్నా జిల్లాలో చాలా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) సీట్లు భర్తీ కాలేదు. ఆరో తరగతిలో ప్రవేశాలు పర్వాలేకున్నా, ఇంటర్ సంబంధించి సీట్లు నిండలేదు. రెగ్యులర్ అధ్యాపకులు, ప్రత్యేకాధికారులు, సీఆర్‌టీలు లేకపోవడంతో కేజీబీవీల్లో చేరేందుకు విద్యార్థినులు ఆసక్తి చూపడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకొంది. అవగాహన కల్పించి విద్యార్థినులను ఈ పాఠశాలల్లో చేరేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీనివల్ల కేజీబీవీల్లో సీట్లు నిండని పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో బాడంగి, భోగాపురం, బొబ్బిలి, బొండపల్లి, చీపురుపల్లి, డెంకాడ, దత్తిరాజేరు, గంట్యాడ, గరివిడి, గజపతినగరం, గుర్ల, జామి, కొత్తవలస, ఎల్.కోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, రామభద్రపురం, తెర్లాం, వేపాడ, విజయనగరంలో కేజీబీవీలు ఉన్నాయి. ఆరు నుంచి ఇంటర్ వరకూ ఇక్కడ తరగతులు నిర్వహిస్తారు. ప్రతి తరగతిలో 40 సీట్లు చొప్పున ఉంటాయి. తల్లిదండ్రులు చనిపోయినా, తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయినా వారి పిల్లలకు కేజీబీవీల్లో సీట్లు ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులతో పాటు కంప్యుటర్ సైన్స్, అకౌంట్ టాక్సెసన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ఆనిమేషన్, ఫిజియోథెరపీ, సెరికల్చర్ కోర్సులను ప్రారంభించారు. అయితే, ప్రతి కోర్సులో కూడా పూర్తిస్థాయిలో సీట్లు నిండడం లేదు. పది నుంచి 15 సీట్లు వరకు ఖాళీగా ఉండిపోతున్నాయి. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కేజీబీవీల్లో చేరేందుకు విద్యార్థినులు ఇష్టపడడం లేదు. వైసీపీ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను నియమించిందే తప్పా శాశ్వత అధ్యాపకులను నియమించలేదు. కొందరు కేజీబీవీ ప్రత్యేకాధికారులు, సీఆర్‌టీలు సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చాలా పాఠశాలలకు ఇప్పటికీ ప్రత్యేకాధికారులు లేరు. ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. సీఆర్‌టీలు కూడా పూర్తిస్థాయిలో లేరు. బాలికా రక్షణకు పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలను అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి నులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. విద్యార్థినులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కేజీబీవీలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
Updated Date - Jul 05 , 2025 | 12:39 AM