నిధులు సరే.. బిల్లులేవి?
ABN, Publish Date - Jul 06 , 2025 | 11:45 PM
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి( పంచాయతీ వర్క్‌లు) గంట్యాడ మండలంలో గత నెల 23న రూ.2.41 కోట్లకు ఎఫ్‌టీవో(ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్)లు అప్‌లోడ్ చేశారు.
విజయనగరం కలెక్టరేట్, జూలై 6(ఆంధ్రజ్యోతి): పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి( పంచాయతీ వర్క్‌లు) గంట్యాడ మండలంలో గత నెల 23న రూ.2.41 కోట్లకు ఎఫ్‌టీవో(ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్)లు అప్‌లోడ్ చేశారు. ఇప్పటి వరకూ పనులు చేసిన వారికి బిల్లులు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదు. అలాగే పశువుల షెడ్ల విషయానికి వస్తే కోటి రూపాయలకు గత నెల 17,18 తేదీల్లో ఎఫ్‌టివోలు జనరేట్ చేయగా ఇప్పటివరకూ రూ.35 లక్షలు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. దీంతో కాంట్రాక్టర్లు నిరాశ చెందుతున్నారు. ఈ సమస్య జిల్లా వ్యాప్తంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.109 కోట్ల బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 13 నుంచి ఇదే పరిస్థితి ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువలు, బీటీ రోడ్లు, సోప్ పిట్స్ వంటి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అభివృద్ధి పనుల కోసం ఒకేరోజు గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేశాయి. ఆపై జిల్లా వ్యాప్తంగా 4347 పనులకు రూ.438 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకూ 2808 పనులు పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పూర్తి చేసిన పనులకు గత ఏడాది డిసెంబరు 13 వరకూ రూ.84 కోట్లు మంజూరు చేశారు. ఆ తరువాత పూర్తి చేసిన పనులకు చెల్లించడం లేదు. ఇప్పటి వరకూ రూ.109 కోట్ల బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. దాదాపు 8 నెలల నుంచి బిల్లులు మంజూరు కాక మిగిలిన పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గ్రామాల్లో పనులు మధ్యలో ఆగిపోయాయి.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళనలు చేశారు. ఈ ప్రభుత్వంలోనూ సమస్య పునరావృతం కావడంతో మథనపడుతున్నారు. పల్లె పండుగలో పనులు చేపట్టిన వారు చాలా వరకు టీడీపీ, జనసేన కార్యకర్తలే. చేసిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోయినప్పటికీ బయటకు చెప్పుకోలేక మౌనంగా ఉంటున్నారు. పశువుల షెడ్‌లకు గ్రామాల్లో రైతులు ముందుగా పెట్టుబడి పెట్టి నిర్మించారు. ప్రతి రైతు లక్ష నుంచి లక్షా 80 వేల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టారు. వీరికి డిసెంబరు నెల నుంచి బిల్లులు మంజూరు కావడం లేదు.
- జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో జరిగిన సాధారణ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.42 కోట్లకు ఎఫ్‌టీవోలు అప్‌లోడ్ చేశారు. పశువుల షెడ్లకు రూ.11 కోట్ల బిల్లులు అప్‌లోడ్ చేశారు. ఇప్పటి వరకూ 20 శాతం నిధులు జమ అయినట్లు సమాచారం. సాంకేతిక సమస్య వల్ల బిల్లులు జమ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. పక్క జిల్లాలో నిఽధులు జమ అవుతున్నా మన జిల్లాలో ఎందుకు కాలేదని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - Jul 06 , 2025 | 11:45 PM