మారనున్న గిరిజనుల బతుకులు
ABN, Publish Date - Jun 18 , 2025 | 12:04 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల బతుకుల్లో స్వర్ణయుగం రానున్నట్టు రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
‘ఉత్కర్ష్ అభియాన్’కు జిల్లాలో 165 గ్రామాల ఎంపిక
రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖా మంత్రి సంధ్యారాణి
సాలూరు, జూన్ 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల బతుకుల్లో స్వర్ణయుగం రానున్నట్టు రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని కొత్తవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ధర్తి ఆబజన్-జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా 2024 అక్టోబరు 2న ప్రారంభించిన ఈ పథకం దేశంలోని గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికిగానూ రూపొందించారని అన్నారు. ఈ పథకం 2024-25 నుంచి 2028-29 వరకు 5 సంవత్సరాలపాటు అమల్లో ఉంటుంద ని చెప్పారు. ఈ పథకం కింద దేశంలో గిరిజనులు నివసించే 63వేల 843 గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సేవలు, జీవనోపాధి, రోడ్లు అనుసంధానం, ఆర్థిక సాధికారిత వంటి కీలకరంగాల్లో అభివృద్ధి చర్యలు చేపడతాయని ఆమె వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 165 గిరిజన గ్రామాలను ఎంపిక చేశారని ఆమె తెలిపారు. వీటికి సంబంధించి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక లు రూపొందించారని చెప్పారు. దీనిపై జూన్ 15 నుంచి 30 వరకు అవగాహన, ప్రయోజన సదస్సులు నిర్వహిస్తా రని ఆమె తెలిపారు. ప్రతి గిరిజన గ్రామంలో గిరిజన స్థితిగతులపై సర్వే నిర్వహించి గిరిజనులకు 14 ప్రభుత్వ ప్రధాన సేవలు అందిస్తామని ఆమె చెప్పారు.
రాష్ట్రంలో డోలీ మోతలు లేకుండా రూ.1300 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టారని ఆమె తెలిపారు. అందులో భాగంగా సాలూరు నియో జకవర్గంలో రూ.110 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా నేరుగా తల్లుల ఖాతాల్లోకి రూ.13వేలు జమ చేశామన్నారు. 16వేల 500 ఉపాధ్యాయ ఉద్యో గాలకు డీఎస్సీ ద్వారా నియామక ప్రక్రియ చేపడితే అందులో 2 వేల మంది టీచర్లు కేవలం ఎస్టీలేనని ఆమె తెలిపారు. త్వరలో అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు లబ్ధి చేకూరనుందన్నారు. ఐటీడీఏ ద్వారా 18 రకాల సంక్షేమ పథకాలు గిరిజనులకు లబ్ధి చేకూర్చనున్నాయన్నారు.
తప్పుడు ప్రచారం సరికాదు
తాను తోణాంలో నిర్వహించిన బహిరంగ సభలో మెట్టవలస గ్రామానికి పాఠశాల భవనం వారం పదిరో జుల్లో మంజూరు చేస్తానని చెప్పిన మాటకు కట్టుబటి ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. పాఠశాల భవనం నిమిత్తం నిర్మాణం కోసంరూ.16 లక్షల నిధులు మంజూ రయ్యాయని, టెండర్లు పిలిచామని, టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణాలు ప్రారంభమవు తాయ న్నారు. ఈలోగా పాఠశాల భవన నిర్మాణానికి చందాలు వసూలు చేస్తున్నట్టు లేనిపోని రాద్దాంతం చేయడం సరికాదని ఆమె తెలిపారు. అనంతరం గిరిజనులకు ధ్రువపత్రాలు అందజేశారు. విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసిన బ్యాగులు, కిట్లు, పుస్తకాలను అందజేశారు.
డప్పు కొట్టి.. థింసా నృత్యం చేసి..
కార్యక్రమం అనంతరం మంత్రి సంధ్యారాణి గిరిజ నుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు డప్పు వాయించారు. అలాగే గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశ్, డీఎంహెచ్‌వో భాస్కరరావు, ఎంపీడీవో పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 18 , 2025 | 12:04 AM