That company should write the medicines ఆ కంపెనీ మందులే రాయాలట
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:16 AM
That company should write the medicines ఎన్టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఒక ఆందోళనకరమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. ఆ ఆసుపత్రుల్లో ఒక నిర్దిష్ట ఫార్మాసూటికల్ కంపెనీకి చెందిన ఔషధాలనే తప్పనిసరిగా సూచించాలని వైద్యులపై ఓ అధికారి తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ వైద్యసేవకు చెందిన ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు జిల్లాలో 26 ఉన్నాయి.
ఆ కంపెనీ మందులే రాయాలట
వైద్యులపై ఒత్తిడి
ఎన్టీఆర్ నెట్‌వర్క్ ఆసుబంధ ఆసుపత్రులకూ ఆదేశం
డొల్ల కంపెనీకి ఆదాయం చేకూర్చే ప్రయత్నం
తెరవెనుక నడిపిస్తున్న ప్రధాన అధికారి?
విజయనగరం రింగురోడ్డు, జూలై3(ఆంధ్రజ్యోతి):
ఎన్టీఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఒక ఆందోళనకరమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. ఆ ఆసుపత్రుల్లో ఒక నిర్దిష్ట ఫార్మాసూటికల్ కంపెనీకి చెందిన ఔషధాలనే తప్పనిసరిగా సూచించాలని వైద్యులపై ఓ అధికారి తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ వైద్యసేవకు చెందిన ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులు జిల్లాలో 26 ఉన్నాయి. ఆ ఆసుపత్రుల వైద్యులకు ప్రభుత్వ అధికారి నుంచి అనధికార ఆదేశాలు అందుతున్నట్టు సమాచారం. రోగులకు మందులు సూచించేటప్పుడు ఆ కంపెనీకి చెందిన మందులనే రాస్తున్నారని తెలిసింది.
- ఆ ఫార్మా కంపెనీ విశ్వసనీయతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇది కేవలం డొల్ల కంపెనీ అయి ఉండవచ్చునని లేదా నాణ్యత లేని ఔషధాలను సరఫరా చేసే కంపెనీ అయి ఉండవచ్చునని పేరు చెప్పేందుకు ఇష్టపడని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఆ కంపెనీ ఔషధాలను ప్రమోట్ చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులు పెద్ద ఎత్తున లాభాలు పొందుతున్నారని, ఇందులో ప్రభుత్వ ఉన్నతాధికారుల పాత్ర సైతం ఉందని తెలిపారు. ఇదొక పెద్ద కుంభకోణంగా వారు భావిస్తున్నారు. తెలిసినా తాము ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వెనుక ఎన్టీఆర్ వైద్య సేవకు చెందిన ఓ పెద్ద అధికారి పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది.
- ఇతర రాష్ట్రానికి చెందిన ఓ ఫార్మా కంపెనీ పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, కంటి చుక్కల మందులు, ప్రొటీన్ పౌడర్లు, విటమిన్ మాత్రలను తయారు చేస్తోంది. వీటిని మాత్రమే ఆసుపత్రుల్లో ఆయా వ్యాధులకు వైద్యులు ప్రిస్ర్కిప్షన్‌లో రాయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. చేసేది లేక వైద్యులు అలాగే చేస్తున్నారని తెలిసింది.
- వైద్యులు రోగి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఔషధాలను సూచించాలి. అయితే ఒక నిర్దిష్ట కంపెనీ మందులనే రాయాలని ఒత్తిడి చేయడం వల్ల రోగులకు సరైన చికిత్స అందకపోవచ్చు. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఇది వైద్య నైతికతకు విరుద్ధమని కొందరు వైద్యులు వాపోతున్నారు. తెరవెనుక అధికారి ఆదేశాలకు భయపడి అందరూ అదే దారిలో వెళ్తున్నారు. కొందరు వైద్యులు మాత్రం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నారు.
- ఆ కంపెనీ మార్కెట్లో పెద్దగా పేరున్నది కాదని, దాని ఉత్పత్తులు కూడా విస్తృతంగా అందుబాటులో లేవని, అలాంటి కంపెనీ మందులను రాయాలని ఒత్తిడి చేయడం సరికాదని ఓ సీనియర్ వైద్యుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇదే విషయంపై ఎన్టీఆర్ వైద్యసేవ కో-ఆర్డినేటర్ డాక్టర్ సాయిరామ్‌ను వివరణ కోరగా, ఈ విషయం తన దృష్టికి రాలేదని, పరిశీలించి విచారణ చేపడ్తామని అన్నారు.
Updated Date - Jul 04 , 2025 | 12:16 AM