Technical Glitch… సాంకేతిక లోపం.. వారికి శాపం
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:44 PM
Technical Glitch… A Curse for Them సాంకేతిక లోపం కారణంగా జిల్లాలో ఎంతోమంది ‘తల్లికి వందనం’ పథకానికి నోచుకోలేదు. ప్రధానంగా విద్యాహక్కు చట్టం కింద లబ్ధి పొందిన కుటుంబాలు నగదు పొందలేకపోయాయి.
న్యాయం చేయాలని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో తల్లిదండ్రుల వినతి
పార్వతీపురం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక లోపం కారణంగా జిల్లాలో ఎంతోమంది ‘తల్లికి వందనం’ పథకానికి నోచుకోలేదు. ప్రధానంగా విద్యాహక్కు చట్టం కింద లబ్ధి పొందిన కుటుంబాలు నగదు పొందలేకపోయాయి. వాస్తవంగా ఆయా కుటుంబాలకు చెందిన ఇద్దరు పిల్లల్లో ఒకరికి ప్రైవేట్ పాఠశాలల్లో ఫ్రీ సీటు రాక.. మరొకరికి ఫీజులు చెల్లించి చదివిస్తున్నారు. అయినప్పటికీ ఇద్దరు పిల్లలూ విద్యాహక్కు చట్టం కింద ఉచిత ప్రవేశాలు పొందినట్లు ఆన్‌లైన్‌లో నమోదైంది. దీంతో జిల్లాలో ఎంతోమంది ‘తల్లికి వందనం’ పథకానికి దూరమయ్యారు. విద్యాహక్కు చట్టం కింద మన్యంలో 528 మంది విద్యార్థులు ప్రవేశాలకు అర్హత పొందారు. అయితే వారిలో 424 మంది మాత్రమే వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. కాగా పార్వతీపురంలో బెలగాం ప్రాంతానికి చెందిన ఎ.చాందిని తన ఇద్దరు పిల్లలను ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. మూడో తరగతి చదువుతున్న హర్షవర్ధన్‌కు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలో ఫ్రీ సీటు రాగా రెండో తరగతి చదువుతున్న జయవర్దన్‌కు మాత్రం ఫీజు చెల్లిస్తున్నారు. అయినా ‘తల్లికి వందనం’ పథకం వర్తించలేదు. తన ఇద్దరు పిల్లల్లో గోవింద కృష్ణ విద్యాహక్కు చట్టం కింద ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫ్రీ సీటు పొంది ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. రెండో తరగతి చదువుతున్న దేవాన్షికి ఫీజు చెల్లిసున్నా.. ‘తల్లికి వందనం’ పథకం కింద నగదు జమకాలేదు. ఇక పార్వతీపురం పట్టణంలో వాసిరెడ్డి కృష్ణ, యమనారాణి దంపతుల ఇద్దరు పిల్లలు వి.మోక్షిత్‌నాయుడు, తనుశ్రీ ఒకే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. వారికి ఫీజులు చెల్లిస్తున్నా.. మరో ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యాహక్కు చట్టం కింద చదువుతున్నట్టు ఆన్‌లైన్‌లో నమోదైంది. దీంతో వారు కూడా ‘తల్లికి వందనం’ పథకానికి నోచుకోలేదు. తమకు న్యాయం చేయాలని సోమవారం వారంతా కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు వచ్చి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. సాంకేతిక తప్పిదాన్ని సరిచేసి పథకం వర్తింపజేయాలని విన్నవించారు. దీనిపై డీఈవో రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా.. అర్హులందరికీ ‘తల్లికి వందనం ’ పథకం వర్తిస్తుందన్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.
Updated Date - Jul 14 , 2025 | 11:44 PM