Survival is a threat! మనుగడకే ముప్పు!
ABN, Publish Date - May 09 , 2025 | 12:08 AM
Survival is a threat! ‘ప్లాస్టిక్‌ను వాడొద్దు. వాడేసిన ప్లాస్టిక్‌ను ఎక్కడబడితే అక్కడ పడేయవద్దు. పంచాయతీ వాహనం వచ్చేటప్పుడు వాటిని అప్పగించండి.
మనుగడకే ముప్పు!
గెడ్డలు, వాగులు, చెరువుల్లో ప్లాస్టిక్ ప్రత్యక్షం
ఖాళీ ప్రదేశాల్లో ఈ-వ్యర్థాలు
నిర్లక్ష్యంగా పడేస్తున్న వైనం
వరద నీటితో పంట పొలాల్లోకి చేరే ప్రమాదం
స్వచ్ఛాంధ్ర సాకారానికి విఘాతం
‘ప్లాస్టిక్‌ను వాడొద్దు. వాడేసిన ప్లాస్టిక్‌ను ఎక్కడబడితే అక్కడ పడేయవద్దు. పంచాయతీ వాహనం వచ్చేటప్పుడు వాటిని అప్పగించండి. లేకుంటే ఇవన్నీ పర్యావరణానికి హాని చేస్తాయి. పాడైన ఫోన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్‌మిషన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటి ఎలకా్ట్రనిక్ వస్తువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేయకండి. ఇ- వ్యర్థాల సేకరణ కేంద్రంలో వాటిని అప్పగించండి’ అంటూ సీఎం నుంచి జిల్లా అధికారుల వరకు సూచిస్తున్నారు. కానీ మార్పు రావడం లేదు. నేటికీ ప్లాస్టిక్, ఎలక్ర్టానిక్ వ్యర్థాలతోనే నీటి వనరులు, పరిసరాలు కనిపిస్తున్నాయి.
- శృంగవరపుకోట పంచాయతీ పరిధిలోని రాచ్చెరువు వరద నీటిని కిందకు పంపించే గెడ్డ వాగు ఇది. శివరామరాజుపేట గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ గెడ్డ వాగులో కనిపిస్తున్నవన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలే. సమీపంలోని మద్యం దుకాణం వద్దకు వచ్చిన వారంతా ప్లాస్టిక్ వాటర్ బాటిల్, వాటర్ ప్యాకెట్‌లను కొనుగోలు చేసి ఖాళీ అయిన వాటిని అక్కడే పడేస్తున్నారు. ఇవన్నీ ఈ గెడ్డ వాగులో చేరుతుండడంతో వర్షకాలంలో వరద నీటితో పాటు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ దిగువభాగాన ఉన్న శివరామరాజుపేట చెరువులోకి, దీన్ని నుంచి తిమిడి గ్రామం వరకు అనేక చెరువులకు నీరు వెళ్తుంది. తద్వారా ఈచెరువులన్నీ కలుషితమవుతున్నాయి. ఈ నీటితో పండించిన పంటలు విషతుల్యం కాక తప్పదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
శృంగవరపుకోట, మే 8(ఆంధ్రజ్యోతి):
స్వచ్ఛాంధ్ర, స్వర్ణంధ్ర కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆహ్మద్‌బాబు ఇటీవల ఎస్.కోట వచ్చారు. ప్లాస్టిక్, ఇ-వ్యర్థాల నిర్వహణ, పరిసరాల శుభ్రతపై స్థానికులకు అనేక సూచనలు ఇచ్చారు. ఎమ్మెల్యే, జేసీ, ఇతర జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్, ఇ-వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయవద్దని స్థానికులకు సూచించారు. వాటిని పంచాయతీ సిబ్బందికి అందించాలని కోరారు. అలాగే చేస్తామని అంతా ప్రతిజ్ఞ కూడా చేశారు. ఉన్నతాధికారులు వెళ్లగానే ఎప్పటిలాగే చేస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ చెత్త వేస్తున్నారు. ఇప్పటికే మురుగు కాలువగా మారిన కళింగెడ్డ, విశాఖ-అరకు రోడ్డులోని షీర్డి సాయిబాబు ఆలయం వెనకున్న కుళ్లీకోనేరు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి.
ఒక పక్క చెరువు గర్భాలు, మరో పక్క గెడ్డ వాగుల్లో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో సాగునీరు కలుషితమవుతోందని వాపోతున్న రైతులు మద్యం దుకాణాల సమీపంలోని పొలాల్లో కనిపిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి ఆందోళన చెందుతున్నారు. ఎస్.కోట పంచాయతీలోనే కాదు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. అరోగ్యకర సమాజ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్, రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర నినాదాలతో ముందుకు వెళ్తున్నాయి. ప్రతి నెలా మూడో శనివారం పారిశుధ్య నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, శాసన సభ్యులు గ్రామాల బాట పడుతున్నారు. అపరిశుభ్రత లేని గ్రామాలను చూడాలని కలలు కంటున్నారు. కానీ క్షేత్ర స్థాయి పరిస్థితులు మారడం లేదు. మద్యం దుకాణాల ఏర్పాటుతో పారిశుధ్య నిర్వహణ మరింత దిగజారింది. మద్యం అమ్మకాలపై దృష్టిసారించిన వ్యాపారులు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులకు స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్ర నినాదాలు వినిపించడం లేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గ్రామాలకు వచ్చి గొంతు చించుకొని చెబుతున్న మాటలు వీరి చెవికి ఎక్కడం లేదు.
Updated Date - May 09 , 2025 | 12:08 AM