నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులపై నిఘా
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:21 AM
జిల్లాలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు.
- ఎస్పీ వకుల్ జిందాల్
విజయనగరం క్రైం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంతర నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించాలని, శక్తి టీమ్స్ మరింత విస్తృతంగా పనిచేయాలని అన్నారు. ‘అదృశ్యం కేసుల్లో వ్యక్తులను ట్రేస్ చేసేందుకు చర్యలు చేపట్టాలి. నేరాల నియంత్రణకు పోలీసు స్టేషన్ల పరిధిలో ఆటో డ్రైవర్ల వివరాలు సేకరించాలి. నేర ప్రవృత్తి కలిగిన ఆటో డ్రైవర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలి. మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ఫిర్యాదులు వస్తే వెంటనే కేసు నమోదు చేయాలి. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా హైవేపై పెట్రోలింగ్ వాహనాలు చర్యలు చేపట్టాలి.’ అని ఎస్పీ అన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు శ్రీనివాసరావు, భవ్యరెడ్డి, రాఘవులు, గోవిందరావు, వీర కుమార్, న్యాయసలహాదారు పరుశురామ్, సీఐలు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 12:21 AM