Social Groups సామాజిక వర్గాలకు అండగా..
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:10 PM
Support for Social Groups జిల్లాలో బీసీ, ఎస్సీ తదితర సామాజిక వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారికి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ మేరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టింది.
స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు
పార్వతీపురం, ఏప్రిల్19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బీసీ, ఎస్సీ తదితర సామాజిక వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారికి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ మేరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులందరికీ రుణాలు మంజూరయ్యే విధంగా బ్యాంకులకు సిఫారసులు వెళ్లాయి. త్వరలోనే ఆయా లబ్ధిదారులకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు కానున్నాయి. 2025-26కు సంబంధించి 2,929 మంది బీసీ లబ్ధిదారులకు రూ.35 కోట్లను సబ్సిడీపై రుణాలను అందించనున్నారు. ఇటీవల జ్యోతిబా పూలే జయంతి వేడుకల సందర్భంగా బీసీ కార్పొరేషన్ ద్వారా 124 మందికి రూ. 2.70 కోట్ల విలువ చేసే వ్యవసాయ ఇతర పనిముట్లు అందించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి , కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జేసీ శోభిక, పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ తదితరుల చేతులు మీదగా పంపిణీ చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 266 మందికి రూ.11.53 కోట్లతో స్వయం ఉపాధి కల్పిచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇతర సామాజిక వర్గాల్లో పేదలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వాస్తవంగా గత ఐదేళ్లలో వివిధ కార్పొరేషన్లు దిష్టిబొమ్మల్లా మారాయి. వాటి చైర్మన్లు, డైరెక్టర్లు గౌరవ వేతన పొందేందుకు మాత్రమే పరిమితమయ్యారు. వాటి ద్వారా రుణాలు మంజూరు చేయించలేని పరిస్థితుల్లో ఉంటూ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఏదేమైనా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం తేవడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Apr 19 , 2025 | 11:11 PM