Support for Cultivation సాగుకు సాయం
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:02 AM
Support for Cultivation కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అర్హులైన రైతన్నల ఖాతాల్లోకి శనివారం అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమచేయనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నేడు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ
జిల్లాలో 1.22 లక్షల మందికి లబ్ధి
పార్వతీపురం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అర్హులైన రైతన్నల ఖాతాల్లోకి శనివారం అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమచేయనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాగు సాయంగా పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రూ. 20 వేలు అందజేయనున్నారు. మొదటి విడతగా నేడు కేంద్రం తరపున రూ.2 వేలు, రాష్ట్ర సర్కారు నుంచి రూ.5 వేలు చొప్పున జమ చేయనున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో గుర్తించిన 1,22,260 మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ. 84.58 కోట్లు జమకానుంది. మొత్తంగా మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ కింద రూ.6 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.14 వేలు జమ కానుంది.
గత వైసీపీ ప్రభుత్వంలో ...
గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.ఆరు వేలు అందించగా.. అప్పటి వైసీపీ సర్కారు రూ.7,500 అందించేవారు. మొత్తంగా రైతులకు రూ. 13,500 అందేది. మొదటి విడతగా కేంద్రం నుంచి రూ.2వేలు , రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3 వేలు అందించేవారు. ఆ తర్వాత మిగిలిన ఆర్థిక సహాయం రెండు విడతలుగా అందజేసేవారు.
నేడు పండగ వాతావరణంలో...
జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో పండగ వాతావరణంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములవ నున్నారు. సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కురుపాంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, సీతానగరం మండలం గుచ్చిమిలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండ మండలం కొండాపురంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాబర్ట్‌పాల్ తెలిఆపపరు.
పక్కాగా నిర్వహణ
జిల్లాలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వ్యవసాయాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల స్థాయిలో, రైతు సేవా కేంద్రా ల్లోనూ నిధుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వ హించాలని సూచించారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో 1,22,260 మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ. 84.58 కోట్లు జమకానుందని వెల్లడించారు.
Updated Date - Aug 02 , 2025 | 12:02 AM