Sub-Collector గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్వహణపై సబ్ కలెక్టర్ అసంతృప్తి
ABN, Publish Date - Jul 22 , 2025 | 11:28 PM
Sub-Collector Expresses Dissatisfaction Over Management of Tribal Ashram Schools కెమిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల నిర్వహణపై పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆ పాఠశాలను ఆయన పరిశీలించారు. తొలుత విద్యార్థుల హాజరుపట్టీని తనిఖీ చేశారు. సగానికి పైగా విద్యార్థులు రానట్లు గుర్తించారు.
కొమరాడ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కెమిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల నిర్వహణపై పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆ పాఠశాలను ఆయన పరిశీలించారు. తొలుత విద్యార్థుల హాజరుపట్టీని తనిఖీ చేశారు. సగానికి పైగా విద్యార్థులు రానట్లు గుర్తించారు. ఇతర రిజిస్టర్లు కూడా సక్రమంగా లేకపోవడం, పాఠశాల ఆవరణ తుప్పలు, డొంకలతో నిండిపోవడంపై ప్రధాన ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయకపోవడం, ఆహార పదార్థాలు నాణ్యతగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరాడ ఎంపీడీవోకు అక్కడ నుంచే ఫోన్ చేసి పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులను ఆదేశించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆహార వసతులు, ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సంబంధిత ఉపాధ్యాయులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ తర్వాత ఆయన గుండ-బిన్నిడి, ఎగువ గుండ-సవర గుండ రహదారులను పరిశీలించారు.
Updated Date - Jul 22 , 2025 | 11:28 PM