పోలీస్ స్టేషన్లకు అత్యాధునిక వాహనాలు
ABN, Publish Date - Jul 03 , 2025 | 11:38 PM
అత్యాధునిక సాంకేతికతో కూడిన ద్విచక్ర వాహనాలను జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లకు అందజేయనున్నట్లు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
- జిల్లాకు 41 బైక్‌ల కేటాయింపు
- ప్రారంభించిన డీఐజీ గోపినాథ్ జట్టి
బెలగాం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): అత్యాధునిక సాంకేతికతో కూడిన ద్విచక్ర వాహనాలను జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లకు అందజేయనున్నట్లు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. గురువారం పార్వతీపురంలో నూతనంగా నిర్మించిన పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ స్టేషన్‌ను డీఐజీ ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లకు అందజేసే 41 ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు, రహదారి ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు విజిబుల్ పోలీసింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన 41 ద్విచక్ర వాహనాలను జిల్లాకు కేటాయించిందని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ బైక్‌లతో సంఘటనా స్థలానికి వేగంగా చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ వాహనాలతో అధికారులు, సిబ్బంది, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఐజీ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి వివిధ టీంలతో చర్చించారు. వారు నిర్వహించే విధులు గురించి అడిగి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి, పార్వతీపురం ఏఎస్పీ అంకితాసురాన, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి, సీఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 11:38 PM