విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:11 AM
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని పీవో అశుతోష్ శ్రీవాత్సవ అధికారులను ఆదేశించారు.
-ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ
పార్వతీపురం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని పీవో అశుతోష్ శ్రీవాత్సవ అధికారులను ఆదేశించారు. గురువారం గిరిమిత్ర సమావేశ మందిరంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, వసతిగృహ సంక్షేమాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. అన్ని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు డ్రైవ్ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ‘పాఠశాలల ప్రాంగణాలు శు భ్రపర్చడం, తరగతి గదుల నిర్వహణ, చిన్నపాటి మరమ్మతులు చేపట్టడం, అన్ని ఐటీ పరికరాలు సరిగ్గా పనిచేసేలా చూసుకోవడం, నీటి ట్యాంక్‌లను శుభ్రపర్చడం మొదలైన వాటికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలి. ఐఎఫ్‌పీ ప్యానెళ్లు, ఇతర డిజిటల్ ఫ్లాట్‌ఫారాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. సాఫ్ట్‌వేర్, హార్డవేర్ పరికరాలను విద్యా కార్యకలాపాలకు సరిగ్గా ఉపయోగించుకోవాలి. పాములు, ఇతర విషపూరిత కీటకాల నుంచి పిల్లలను రక్షించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, స్థానిక పీహెచ్‌సీ సమన్వయంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. సికిల్ సెల్, అనీమియా పరీక్షలు చేయాలి. సురక్షితమైన తాగునీటిని అందించాలి. బాలికల విద్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల భద్రతపై నిఘా ఉంచాలి. జిల్లా అధికారుల ముందస్తు అనుమతి లేకుండా బయట వ్యక్తులను పాఠశాలల ప్రాంగణాల్లోకి అనుమతించకూడదు. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాం ధ్ర కార్యక్రమం నిర్వహించాలి.’ అని పీవో సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకుడు ఆర్.కృష్ణవేణి, ఉపవిద్యాశాఖ అధికారి, జిల్లా మలేరియా అధికారి వై.మణి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 12:11 AM