Sketch of explosions in Vizianagaram విజయనగరంలోనే పేలుళ్లకు స్కెచ్
ABN, Publish Date - May 22 , 2025 | 12:19 AM
Sketch of explosions in Vizianagaram ఉగ్రవాద సానుభూతిపరులు విజయనగరంలోనే భారీ పేలుళ్లకు స్కెచ్ వేసినట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇది తెలిసి జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. విజయనగరంలో ఉగ్రమూలాలు వెలుగుచూసిన నాటి నుంచి జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘటన చోటుచేసుకోవడం అందరినీ విస్తుపరిచింది.
విజయనగరంలోనే పేలుళ్లకు స్కెచ్
ఉగ్రమూలాలపై వెలుగుచూస్తున్న కొత్త అంశాలు
పేలుళ్లకు సిద్ధమవుతున్న సమయంలోనే సిరాజ్ అరెస్టు
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పోలీసులు
కలవరంలో జిల్లా ప్రజలు
ఉగ్రవాద సానుభూతిపరులు విజయనగరంలోనే భారీ పేలుళ్లకు స్కెచ్ వేసినట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇది తెలిసి జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. విజయనగరంలో ఉగ్రమూలాలు వెలుగుచూసిన నాటి నుంచి జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘటన చోటుచేసుకోవడం అందరినీ విస్తుపరిచింది. జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రలోనూ ఉగ్రనీడల అంశం ప్రధాన చర్చనీయాంశమైంది. మరోవైపు ఉగ్ర నీడలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తోంది. విచారణలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూస్తున్నట్లు సమాచారం.
విజయనగరం, మే 21 (ఆంధ్రజ్యోతి):
విజయనగరం నడిబొడ్డున పేలుళ్లకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఉగ్ర సానుభూతిపరుడు సిరాజ్ ఉర్ రెహ్మన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తాజాగా తెలిసింది. పేలుడు పదార్థాలు, వాటికి అవసరమైన పీవీసీ పైపుముక్కలు, ఇతర సామగ్రిని శనివారం( ఈనెల 17న) నాడే కొనుగోలు చేసి ఐఈడీ (ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) తయారీకి సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు. ఉగ్రవాద సానుభూతిపరులు కొద్దిరోజులుగా పేలుడు పదార్థాలకు సంబంధించిన సామగ్రి సేకరణ, ఆన్‌లైన్‌లో వాటి కొనుగోలు వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. విజయనగరంలోని విజ్జీ స్టేడియానికి వెళ్లే రోడ్డులో రాజానగర్ వద్ద పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రి ఉన్న బ్యాగుతో మోటార్ సైకిల్‌పై అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి విచారించారు. జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఐఈడీని పేల్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు విచారణలో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. ఏప్రిల్ 20, 26, 30 తేదీల్లో ఉర్దూ పాఠశాల అడ్రస్‌తో ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలు వచ్చినట్టు విచారణ అధికారులు గుర్తించారు. నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్న రెండు సెల్‌ఫోన్లలో కీలక ఆధారాలు లభించాయి. సిరాజ్‌తోనే పాస్‌వర్డ్ చెప్పించి లాక్ తీయించారు. వాటిలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి అన్నిరకాల సమాచార యాప్‌లు ఉండడంతో అధికారులు విస్తుపోయారు. అందులో సిరాజ్, సమీర్ మధ్య పేలుడు పదార్థాల సేకరణ, వినియోగంపై ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగాయి. వీరి మధ్య గంటల తరబడి చాటింగ్ సాగినట్టు సైతం గుర్తించారు.
కొత్తగా అదుపులోకి ముగ్గురు
విజయనగరంలో ఇద్దరు వ్యాపారులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర సానుభూతిపరులు ఇచ్చిన సమాచారంతోనే వారిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. కన్యకాపరమేశ్వరి కోవెల ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారులతో పాటు మరోవ్యక్తిని రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు నిందితులకు పేలుడు పదార్థాలను విక్రయించారని అనుమానిస్తున్నారు. ఇంకోవైపు సిరాజ్, సమీర్‌లను కస్టడీకి ఇవ్వాలని విజయగనగరం రెండో పట్టణ పోలీసులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు వాదనలు విన్నాక తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు బృందాలుగా విడిపోయి నగరం మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. దాదాపు 10 మంది అధికారులు విచారణ సాగిస్తున్నారు.
బ్యాంక్‌లో అకౌంట్లపై ఆరా
సిరాజ్‌తో పాటు కుటుంబసభ్యుల ఆర్థిక పరిస్థితిపై దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సిరాజ్‌తో పాటు కుటుంబసభ్యుల బ్యాంక్ అకౌంట్ల వివరాలు అందించాలని నగరంలో అన్ని బ్యాంకుల అధికారులకు సమాచారమిచ్చారు. మరోవైపు సిరాజ్‌తో పాటు కుటుంబ సభ్యులందరికీ డీసీసీబీ బ్యాంకులో అకౌంట్‌తో పాటు మరికొన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని తెలిసింది. సిరాజ్ తండ్రి ఇంతకుముందు కొత్తవలస పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేవారు. ఆ సమయంలోనే కొత్తవలస డీసీసీబీ బ్రాంచిలో అకౌంట్లు తెరిచినట్టు తెలుస్తోంది. సిరాజ్‌తో పాటు అతడి తండ్రికి అక్కడే బ్యాంక్ అకౌంట్ ఉండేది. అయితే తండ్రి బదిలీ జరిగిన తరువాత సిరాజ్ తన అకౌంట్‌ను కూడా విజయనగరం డీసీసీబీకి బదిలీ చేసుకున్నాడు. సిరాజ్ తండ్రి బ్యాంక్ లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారని సమాచారం. లాకర్‌ను తెరిచేందుకు మొదట యూనిఫారం లేకుండా వెళ్లారు. బ్యాంక్ అధికారులు నిరాకరించారు. అయితే అప్పటికే దర్యాప్తు అధికారుల ఆదేశాలు ఉండడంతో బ్యాంక్ అధికారులు లాకర్ తెరిచేందుకు అంగీకరించలేదు.
- సిరాజ్ తండ్రి సోమ, మంగళవారాల్లో వరుసగా రెండుసార్లు బ్యాంకుకు వచ్చి లాకర్ తెరవాలని కోరినట్టు సమాచారం. జాతీయ దర్యాప్తు సంస్థ లోతైన విచారణ చేపడుతుండడంతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సిరాజ్, కుటుంబ సభ్యుల ఖాతాలను దర్యాప్తు సంస్థ, పోలీసులు సీజ్ చేశారని తెలిసింది.
స్పీడ్ పెంచిన ఎన్‌ఐఏ
నిందితులను కస్టడీకి ఇస్తే పూర్తి స్థాయిలో విచారించే యోచన
ఎఫ్‌ఐఆర్‌లో అనేక అంశాలను పేర్కొన్న పోలీసులు
విజయనగరం /క్రైం/రూరల్/రింగురోడ్డు, మే 21 (ఆంధ్రజ్యోతి):
విజయనగరం జిల్లాలో ఉగ్రవాద సానుభూతిపరుల కదలికలపై ఎన్‌ఐఏ, పోలీస్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో అనేక సంచలన అంశాలను పేర్కొన్నారు. అందులో ఉన్న సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 16న కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారంతో విజయనగరం పోలీసులు విజ్జీస్టేడియం సమీపంలో సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఓ సంచిలో పేలుడుకు వినియోగించే వస్తువులు, ల్యాప్‌టాప్, ఇతరత్రాసామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు. తాను బీటెక్ వరకు చదువుకున్నానని, కొత్తవలసలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశానని, అనంతరం హైదరాబాద్ వెళ్లి పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడించాడు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ పరిచయం అయ్యాక వరంగల్‌కు చెందిన పరహాన్ మొహిద్దిన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాదర్‌తో కూడా పరిచయం ఏర్పడిందని... ఖిలాఫత్, జీహాది తదితర విషయాలపై చర్చించుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. రాకెట్ లాంచర్ తయారుచేయడం, దాన్ని వినియోగించడంపై ఆన్‌లైన్‌లో అధ్యయనం చేసిన సిరాజ్ వాటి తయారీ కోసం విజయనగరంలోని మూడు షాపుల్లో ప్లాస్టిక్ పైపులు, బ్లేడ్‌లు, అందుకు కావాల్సిన ఇతర సామగ్రిని కొనుగోలు చేసినట్లు తెలిసింది.
- కొంతమంది మతోన్మాదుల ప్రసంగాలకు ఆకర్షితుడయ్యాడు. తనకు ఇన్‌స్టాలో పరిచయమైన వారిని కలిసేందుకు 2024 నవంబరు 22న ముంబయికి వెళ్లాడు. అంతకుముందు 2024 జనవరి 26న సహబాజ్, జీషాన్‌లను కలవడానికి ఢిల్లీ వెళ్లాడు. సౌదీలో ఉంటున్న బీహార్‌కు చెందిన అబూతాలమ్ అలియాస్ అబూముసాబ్ అనే వ్యక్తి సూచనతో తాను తరచూ సిగ్నల్ యాప్ ద్వారా జిహాదీ చర్యల వైపు ఆకర్షితుడైనట్లు పోలీసులకు తెలిపాడు.
- పేలుళ్ల సామగ్రిని విజయనగరంలోని కేఎల్ పురం, కన్యకా పరమేశ్వరీ ఆలయ ప్రాంతంలో కొనుగోలు చేసి, ఐఈడీ బాంబులను తయారు చేసి ముందుగా విజయనగరంలో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పేల్చేందుకు నిర్ణయించుకున్నామని, అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుండగా పోలీసులకు పట్టుబడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొని ఉంది.
------------------------------
Updated Date - May 22 , 2025 | 12:19 AM