అంబరాన్నంటిన సిరి సంబరం
ABN, Publish Date - May 21 , 2025 | 12:08 AM
సాలూరు గ్రామదేవత శ్యామలాంబ అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగా వైభవంగా జరిగింది.
- వైభవంగా శ్యామలాంబ సిరిమానోత్సవం
- రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం
- జనసంద్రమైన సాలూరు
- విరిగిన అంజలి రథ చక్రం
సాలూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): సాలూరు గ్రామదేవత శ్యామలాంబ అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగా వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సాలూరు జనసంద్రంగా మారింది. ఆలయ పూజారి జన్ని ధనుంజయరావు, ఉత్సవ కమిటీ సభ్యులు, అల్లువారి కుటుంబం కలిసి అమ్మవారి ఘాటాలకు సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. అల్లువారి ఇంటి వద్ద పూజారి సిరిమానును అధిరోహించారు. చిన్నవీధికి చెందిన వారు ఆడవారి వేషంతో అంజలి రథం ఎక్కారు. అమ్మవారి ఘటాలు అంజలి రథం ముందుకు వచ్చిన వెంటనే సిరిమానోత్సవం మొదలైంది. సాయంత్రం 4.30 గంటలకు మొదలు కావాల్సిన సిరిమానోత్సవం రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. నాయుడువీధి నుంచి శివాజీ బొమ్మ జంక్షన్ దాటిన వెంటనే అంజలి రథం చక్రం విరిగిపోయింది. దీంతో సిరిమాను సంబరం కొంతసేపు నిలిచింది. మళ్లీ రథానికి వేరే చక్రం తెచ్చి అమర్చడంతో సిరిమానోత్సవం మళ్లీ కొనసాగింది. 15 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న పండగ కావడంతో ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, ఒడిశా, రాయిపూర్, బిలాయ్, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అధికారులు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేయగా, అంతకు మించి వచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు చాలా కష్టపడ్డారు. తప్పెటగుళ్లు, తీన్‌మార్, చోడవరం డ్రమ్ములు, బిందెల డ్యాన్స్, పులివేషాలు, సాము గరిడీలు, కాంతార, బండ్ల వేషాలు, గిరిజన థింసా నృత్యం ఎంతగానో అలరించాయి. వీటిని చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ దంపతులు, జిల్లాకు చెందిన పలువురు అధికారులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఉత్సవ కమిటీ, దేవదాయ ధర్మదాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు భక్తుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడంతో ఉత్సవం ముందుకు సాగింది. స్వచ్ఛంద సేవా సంఘాలు పలు సేవలు అందించాయి.
సిరిమానోత్సవం సాగిందిలా..
తొలుత సాలూరు అల్లువీధి నుంచి సిరిమానోత్సవం ప్రారంభమైంది. అక్కడి నుంచి శివాజి బొమ్మ జంక్షన్, బోసుబొమ్మ జంక్షన్, మెయిన్‌రోడ్డు మీదుగా ఎన్టీఆర్ కూడలికి చేరుకుంది. అక్కడి నుంచి కోటదుర్మమ్మ గుడి జంక్షన్, పెద్దకోమటిపేట మీదుగా డబ్బివీధి, కేహెచ్ స్కూల్, బోసుబొమ్మ కూడలి, శివాజీ బొమ్మ, అక్కేన వీధి రామమందిరం మీదుగా తోట వీధిలో ఉన్న శ్యామలాంబ ఆలయం వరకు సిరిమానోత్సవం సాగింది.
Updated Date - May 21 , 2025 | 12:08 AM