ముగిసిన శ్యామలాంబ ఉత్సవాలు
ABN, Publish Date - May 22 , 2025 | 12:21 AM
సాలూరు గ్రామదేవత శ్యామలాంబ అమ్మ వారి ఉత్సవాలు బుధవారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
- ఆలయానికి చేరుకున్న సిరిమాను, అంజలి రథం, ఘటాలు
-ఊపిరిపీల్చుకున్న యంత్రాంగం
సాలూరు, మే 21(ఆంధ్రజ్యోతి): సాలూరు గ్రామదేవత శ్యామలాంబ అమ్మ వారి ఉత్సవాలు బుధవారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 18న ఉయ్యాల కంబాలతో ఉత్సవాలు ప్రారంభయ్యాయి. 19న తోలెళ్లు, 20న సిరిమానోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. బుధవారం అనుపోత్సవంతో అమ్మవారి పండుగ ముగిసింది. బుధవారం వేకువజామున 3 గంటలు దాటిన తరువాత సిరిమాను, అంజలి రథం, ఘటాలు అమ్మవారి ఆలయానికి చేరుకున్నాయి. ఈ ఉత్సవాలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అంతా తానై నడిపారు. మూడు నెలలుగా అన్ని శాఖల అధికారులను సమావేశపరచి, వారిని సమన్వయం చేసుకుంటూ పండుగ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ రాంబాబు, సీఐలు అప్పలనాయుడు, రామకృష్ణ ఎంతగానో శ్రమించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో యంత్రాంగంతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
పండుగ ప్రశాంతంగా జరిగింది: ఎస్పీ
బెలగాం, మే 21 (ఆంధ్రజ్యోతి): అందరి సహకారంతో సాలూరు శ్యామ లాంబ పండుగ ప్రశాంతంగా జరిగిందని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. బుధ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్మవారి ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిరిమానోత్సవం ముగిసిన తర్వాత భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాన కూడళ్లలో బ్యారికేడ్లను క్రమపద్ధతిలో తొలగించి, అన్ని మార్గాల్లో వెళ్లేందుకు అనుమతించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించామన్నారు. పోలీస్ శాఖ ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసినట్లు తెలిపారు.
జనాలతో కిటకిటలాడుతున్న పట్టణ రహదారి
Updated Date - May 22 , 2025 | 12:21 AM