Shined in JEE జేఈఈలో మెరిశారు
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:06 AM
Shined in JEE జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ చూపారు. కొమరాడ మండలం గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 21వ ర్యాంకు, ఓబీసీలో 2వ ర్యాంకు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
భరత్‌చంద్రకు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 21వ ర్యాంకు
పాలకొండకు చెందిన రసజ్ఞకు 78వ ర్యాంకు
జియ్యమ్మవలస, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులతో ప్రతిభ చూపారు. కొమరాడ మండలం గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 21వ ర్యాంకు, ఓబీసీలో 2వ ర్యాంకు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ విద్యార్థి తండ్రి రామకృష్ణ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఉన్న మెరైన్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తల్లి దమయంతి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బెలమం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వారు శ్రీకాకుళంలో నివాసం ఉండగా.. విద్యార్థి మాత్రం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కాగా భరత్‌చంద్ర అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో, 2 నుంచి 5వ తరగతి వరకు గుడివాడలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివాడు. హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేశాడు. ఇటీవల జరిగిన ఈఏపీసీఈటీ ఇంజనీరింగ్ విభాగంలో 99.99 శాతం మార్కులు సాధించి తెలంగాణలో మొదటి ర్యాంకు సాధించాడు. జేఈఈ మెయిన్స్ 2025లో ఆలిండియా 121వ ర్యాంకు, ఆలిండియా ఓబీసీ కోటాలో 17వ ర్యాంకు పొందాడు. అంతేగాకుండా ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌కు (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టుల్లో) కూడా ఎంపిక య్యాడు. ముంబైలోని ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేయాలనే తన లక్ష్యమని భరత్‌చంద్ర తెలిపాడు. కాగా సోమవారం హైదరాబాద్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను భారీగా ఊరేగించి ఆ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇందులో భరత్‌చంద్ర కూడా ఉండడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతిభ కనబర్చిన చాణక్య
గరుగుబిల్లి: గొట్టివలసకు చెందిన బోను చాణక్య జేఈఈ అడ్వాన్స్‌డ్ ఓపెన్ కేటగిరీలో 550, ఓబీసీ విభాగంలో 78వ ర్యాంకు సాధించాడు. మొత్తంగా 360 మార్కులకు గాను 232 మార్కులు సాధించాడు. గుడివాడలో టెన్త్ పూర్తి చేసిన చాణక్య 587 మార్కులు దక్కించుకున్నాడు. హైదరాబాద్‌లో ఇంటర్ చదివిన ఆ విద్యార్థి 976 మార్కులు సాధించాడు. చాణక్య తండ్రి శంకరరావు బలిజిపేట మండలం పెదపెంకిలో ఎస్‌జీటీ టీచర్‌గా పని చేస్తున్నారు. తల్లి ప్రియాంక గృహిణి. ఐఐటీలో సీటు సాధించడం ఆనందంగా ఉందని, ఇంజనీరింగ్ చేయడమే తన లక్ష్యమని ఆ విద్యార్థి తెలిపాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధించగలిగానని వెల్లడించాడు.
సత్తాచాటిన బలరాంనాయుడు
పార్వతీపురం టౌన్: పట్టణానికి చెందిన ద్వారపురెడ్డి బలరాంనాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 633వ ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కర్షకమహర్షి ఆసుపత్రి వీధికి చెందిన బలరాం నాయుడు గుడివాడలో టెన్త్ పూర్తి చేశాడు. విజయవాడలో ఇంటర్ విద్యనభ్యసించాడు. బలరాంనాయుడు ఉత్తమ ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు డాక్టర్ ద్వారపురెడ్డి శంకుతల, తిరుపతిరావు ఆనందం వ్యక్తం చేశారు.
ఫలితాల్లో మెరిసిన రసజ్ఞ
పాలకొండ: పట్టణంలోని వడమ కాలనీలో నివాసం ఉంటున్న కొరికాన రసజ్ఞ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 78 ర్యాంకు సాధించింది. ఓబీసీ కేటగిరీ నుంచి 8వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. పదో తరగతి వరకు గుడివాడలోచదివి 585 సాధించింది. ఇంటర్ విజయవాడలోని చదివి 983 మార్లు సాధించింది. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా 422వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 60వ ర్యాంకును పొందింది. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్‌ను చదవడమే తన లక్ష్యమని రసజ్ఞ తెలిపింది. విద్యార్థిని ఉత్తమ ర్యాంకు సాధించడంపై తల్లిదం డ్రులు శ్రీనివాసరావు, రమణమ్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి చిరు వ్యాపారి కాగా, తల్లి రమణమ్మ స్టాఫ్‌నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు.
Updated Date - Jun 03 , 2025 | 12:06 AM