తెలంగాణలో రోడ్డు ప్రమాదం
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:57 PM
దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం చెందారు.
కారులో ప్రయాణిస్తున్న ఐదుగురి మృతి
మృతుల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాసులు
ఆదిభట్ల, జూలై 18(ఆంధ్రజ్యోతి): దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి బొంగులూరు వద్ద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దాసరి తండాకు చెందిన గుగులోత్ జనార్దన్ (45), వరంగల్ జిల్లా పాకాలకు చెందిన మాలోత్ చందులాల్(29), ఆంధ్రప్రదే శ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా వేదులవలస గ్రామానికి దాసరి భాస్కర్‌రావు (39), విజయనగరం జిల్లా తెర్లాం మండలం కల్మరాజుపేట గ్రామానికి చెందిన జాడ కృష్ణ(25) కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రీన్‌వ్యాలీ రిసార్టులో పనిచేస్తున్నారు. పరిచయస్తు డైన ఎన్కేపల్లికి చెందిన కావలి బాల్‌రాజ్ (40) కారులో గురువారం రా త్రి 9గంటలకు యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఘట్కేసర్ వద్ద అదే రాత్రి 2.45 గంటలకు ఔటర్ రింగు రోడ్డుపైకి వచ్చారు. మూడు గంటలప్పుడు బొంగులూరు ఎగ్జిట్ 12 సమీపంలోని మైల్‌స్టోన్ 101 వద్ద వీరి కారు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న జనార్దన్, చందులాల్, భాస్క ర్‌రావు, బాల్‌రాజ్ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. కృష్ణ తీవ్రంగా గాయపడడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. రాచకొండ కమిషనరేట్ పరిధి మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Updated Date - Jul 18 , 2025 | 11:57 PM