Residents of Vizianagaram on TV బుల్లితెరపై విజయనగరం వాసులు
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:16 AM
Residents of Vizianagaram on TV ‘సింపురు జుట్టుదాన్ని.. సెవులెరుకన చుట్టదాన్ని..చేతులగ్గి పెట్టెదాన్ని.. ఉంగరాల మెట్టదాన్ని.. నేనట్టాంటి ఇట్టాంటాడదాన్ని కాదు బావో..పల్సరు బైక్ మీద రారాబావ’.. అని పాడే ఈ పాటకు ప్రేరణ జిల్లాకు చెందిన ఇద్దరు రేలారే రేలా కళాకారులు. అందులో ఒకరు రమణ, మరొకరు జానకిరావు. వీరి గొంతును, ప్రతిభను సోషల్ మీడియానే ప్రపంచానికి చాటిచెప్పింది.
బుల్లితెరపై విజయనగరం వాసులు
విజయనగరం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి):
‘సింపురు జుట్టుదాన్ని.. సెవులెరుకన చుట్టదాన్ని..చేతులగ్గి పెట్టెదాన్ని.. ఉంగరాల మెట్టదాన్ని.. నేనట్టాంటి ఇట్టాంటాడదాన్ని కాదు బావో..పల్సరు బైక్ మీద రారాబావ’.. అని పాడే ఈ పాటకు ప్రేరణ జిల్లాకు చెందిన ఇద్దరు రేలారే రేలా కళాకారులు. అందులో ఒకరు రమణ, మరొకరు జానకిరావు. వీరి గొంతును, ప్రతిభను సోషల్ మీడియానే ప్రపంచానికి చాటిచెప్పింది. వారిలో ఉన్న కళా నైపుణ్యాన్ని బయటకు తీసింది. సెలబ్రిటీల జాబితాలో చేర్చింది.
జానపదాల జానకిరావు
ఉత్తరాంధ్రలో జానపదాలకు ఒక ఊపు తెచ్చింది రేలారేలా కళాకారుడు కోరాడ జానకిరావు అని చెప్పుకుంటారు. చిన్నప్పటి నుంచే జానపదాలపై ఆసక్తి పెంచుకున్న జానకిరావు పాఠశాల స్థాయిలోనే సత్తాచాటాడు. చదువు కొనసాగిస్తూనే గజ్జె కట్టి పల్లె పదాన్ని అలవోకగా పాడాడు. సోషల్ మీడియా ద్వారా విశేష ఆదరణ పొందాడు. ప్రస్తుతం సినీ రచయితగా, జానపదాల కళాకారుడిగా రాణిస్తున్నారు. మెంటాడ మండలం వేమలికి చెందిన జానకిరావుది సామాన్య కుటుంబం. తల్లిదండ్రులు అప్పన్న, పైడితల్లి. ఇద్దరూ వ్యవసాయ కూలీలే. వ్యవసాయ పనుల సమయంలో తల్లితో పాటు పెద్దమ్మ పాడే పాటలను జానకిరావు గ్రహించాడు. అది మొదలు పల్లె పదాలు వినిపిస్తే చాలు పాటగా మలచి పాడేవాడు. అదే ఆయనలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పింది. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా 2008లో మాటీవీ నిర్వహించిన రేలారేరేలాలో పాడి బహుమతులు సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఉత్తరాంధ్ర జానపదాలంటే జానకిరావు పేరు మార్మోగిపోతోంది. తన ప్రతిభను వెలుగులోకి తెచ్చింది సోషల్ మీడియా అని ఆయనే చెబుతుంటారు.
పల్సర్ బైక్ పాటతో రమణ ప్రకంపనలు
పల్సర్ బైక్ రమణ సొంతూరు మెరకముడిదాం మండలంలోని కొర్లాం. ఎనిమిదో తరగతి చదువుతుండగా రమణ తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ ఆర్థిక కారణాల రీత్యా రమణ చదువుకు దూరమయ్యాడు. ఓ కంపెనీలో పనిచేస్తూ జానపదాలంటే ఆసక్తి పెంచుకున్నాడు. నిత్యం యూట్యూబ్‌లో జానపదాలు వినేవాడు. ఈ రంగంలో గాయకుడిగా రాణించాలనుకునేవాడు. ఈ క్రమంలోనే కోరాడ జానకిరావు వద్దకు వెళ్లాడు. అప్పటికే రేలారేరేలాతో పాపులర్ అయ్యారు జానకిరావు. ఆయన శిష్యరికంలో స్టేజీ ప్రోగ్రాంలో రమణకు అవకాశం దక్కింది. అయితే పల్సర్ బైక్ పాటతో సోషల్ మీడియాలో రమణ ఎనలేని క్రేజ్ దక్కించుకున్నాడు. ధమాకా సినిమాలో పల్సర్ బైక్ పాటతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు. ఎన్నో జానపదాలు పాడినా రాని క్రేజ్ ఆ ఒక్క సినిమాతో వచ్చింది. కానీ అందులో రమణ పాడలేదు. కానీ అంతకంటే ముందే రమణ పాడిన పాటను ఆ సినిమాలో వాడుకోవడంతో పాపులర్ అయ్యాడు. అటు తరువాత చాలా స్టేజీ ప్రోగ్రాంతో పాటు బుల్లితెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తనను ఇంత స్థాయిలో పెట్టింది ప్రజలు, పెరిగిన సోషల్ మీడియా అని సగర్వంగా చెబుతుంటాడు రమణ.
Updated Date - Jun 30 , 2025 | 12:16 AM