మూడోవిడతకు సమాయత్తం
ABN, Publish Date - Jun 12 , 2025 | 11:27 PM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల రీ సర్వే అస్తవ్యస్తంగా సాగింది. రికార్డులన్నీ తప్పులు తడకలగా మారాయి.
- 33 గ్రామాల్లో రీసర్వేకు సన్నద్ధం
- పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించిన ప్రభుత్వం
- సిద్ధమైన అధికార యంత్రాంగం
జియ్యమ్మవలస, జూన్ 12(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల రీ సర్వే అస్తవ్యస్తంగా సాగింది. రికార్డులన్నీ తప్పులు తడకలగా మారాయి. దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం పక్కాగా రీ సర్వే చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో మూడో విడత రీసర్వేకు రంగం సిద్ధమైంది. పార్వతీపురం, పాలకొండ డివిజన్లలోని 33 గ్రామాల్లో మొత్తంగా 26,147.90 ఎకరాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌డీటీలు, మండల, విలేజ్ సర్వేయర్లకు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు చేయకుండా నియమ నిబంధనల మేరుకు పక్కాగా రీ సర్వే చేపట్టి నివేదికలు అందించాలని సూచించారు. ఈ మేరకు ఎంపిక చేసిన గ్రామాల్లో మరో రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో చేపట్టిన మొదటి విడతగా చేపట్టి రీ సర్వే మరో వారంలో పూర్తి కానుంది. రెండో విడత రీ సర్వే కూడా దాదాపు పూర్తయ్యింది. ఈ నెలాఖరుకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం, పాలకొండ డివిజన్ల పరిధిలో 15 మండలాలు, 965 గ్రామాలు ఉన్నాయి. వాటి పరిధిలో 5,78,016 ఎకరాల్లో రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు 235 మంది గ్రామ సర్వేయర్లు, 15 మంది మండల సర్వేయర్లు, ఆర్‌ఎస్‌డీటీలు, వీఆర్‌వోలు పూర్తిగా ఆ పనిలో నిమగ్నమయ్యారు.
- మొదటి విడతలో 15 గ్రామాల్లో రీసర్వే చేసిన అధికారులు ఈ నెలలోనే పూర్తి నివేదిక అందించనున్నారు. 36 బ్లాకుల పరిధిలో 8,910.82 ఎకరాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని రీ సర్వే చేశారు. ఇప్పటివరకు పార్వతీపురం డివిజన్‌లో గరుగుబిల్లి మండలం దళాయివలస , పాచిపెంట మండలం పూడిలో రీసర్వే పూర్తయింది. డీఎల్‌ఆర్, 13 నోటిఫికేషన్ ఇచ్చారు.
- పాలకొండ డివిజన్‌లో కురుపాం మండలం పెదవనజ, జియ్యమ్మవలస మండలం రాజయ్యపేట, గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ, సీతంపేట మండలం భూచేద్రి గ్రామాలు రీసర్వే పూర్తయింది. డీఎల్‌ఆర్ , 13 నోటిఫికేషన్ ఇచ్చారు.
- ఇక రెండో విడతకు సంబంధించి పార్వతీపురం, పాలకొండ డివిజన్లలో చెరో 15 గ్రామాలు ఎంపిక చేసి 28,967.11 ఎకరాల్లో రీసర్వే చేపట్టారు. ఈ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. కేవలం లాగిన్ వర్క్స్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎనిమిది గ్రామాలకు డీఎల్‌ఆర్ పూర్తయింది. 22 గ్రామాలకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది.
మూడో విడతలో ఎంపికైన గ్రామాలు..
- మూడో విడతలో భాగంగా పాలకొండ డివిజన్ పరిధిలో 21 గ్రామాల్లో 10,824 ఎకరాల్లో రీసర్వే చేయనున్నారు. పాలకొండ మండలం అంపిల్లి(618.55 ఎకరాలు), వడమ(662.65 ఎకరాలు), జీఎం పురం(720.21 ఎకరాలు), ఎన్ కే రాజపురం(543.02 ఎకరాలు), భామిని మండలం పాలవలస(953.52 ఎకరాలు), మనుమకొండ(802.20 ఎకరాలు), జియ్యమ్మవలస మండలం బాసంగి(696.09 ఎకరాలు), గెడ్డతిరువాడ(1296.20 ఎకరాలు)ని ఎంపిక చేశారు. కురుపాం మండలం తిత్తిరి(372.12 ఎకరాలు), తెన్నుఖర్జ(820.74 ఎకరాలు), తియ్యాలి(183.57 ఎకరాలు), గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి(277.77 ఎకరాలు), టిక్కబాయి(188.27 ఎకరాలు), పూతికవలస(111.45 ఎకరాలు), శంభుగూడ(21 ఎకరాలు), డోలుకోన(42.29 ఎకరాలు) లో రీసర్వే చేయనున్నారు. సీతంపేట మండలం కుడ్డపల్లి (260.05 ఎకరాలు), కోసంగి(650.54 ఎకరాలు), కొల్లాడ (266.60 ఎకరాలు), కోపువలస (50.03 ఎకరాలు), వీరఘట్టం మండలం తెట్టంగిలో (1282.13 ఎకరాలు)ను ఎంపిక చేశారు.
- పార్వతీపురం డివిజన్‌లో 12 గ్రామాల్లో మొత్తంగా 15,318.90 ఎకరాల్లో రీసర్వే చేయ నున్నారు. పార్వతీపురం మండలంలో సూడిగాం(1173.75 ఎకరాలు), డీకే పట్నం(1146.47 ఎకరాలు), సీతానగరం మండలం గాదెలవలస(1084.34 ఎకరాలు), చినభోగిలి(1396.97 ఎకరాలు)ని ఎంపిక చేశారు. మక్కువ మండలంలో సీబిల్లి పెద్దవలస(1891.79 ఎకరాలు), సాలూరు మండలం మరిపల్లి(2190.50 ఎకరాలు), గరుగుబిల్లి మండలం కొత్తపల్లి(1099.30 ఎకరాలు), పెద్దూరు వద్ద శివరాంపురం(226.02 ఎకరాలు), పాచిపెంట మండలం కారివలస (1206.83 ఎకరాలు), కొమరాడ మండలం గుణానుపురం(1084.49 ఎకరాలు), దేవుకోన (1190.49 ఎకరాలు), బలిజిపేట మండలం అరసాడ(2727.45 ఎకరాలు)లో రీ సర్వే చేయనున్నారు.
పకడ్బందీగా చేస్తాం
రీసర్వేను పకడ్బందీగా చేస్తాం. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూస్తాం. ఒకవేళ ఎక్కడైనా తప్పులు జరిగితే సంబంధిత గ్రామ, మండల సర్వేయర్లు, ఆర్‌ఎస్‌డీటీలు బాధ్యుల వుతారు. వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- టి.లక్ష్మణరావు, అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా సర్వే విభాగం
Updated Date - Jun 12 , 2025 | 11:27 PM