Ready for Kharif ఖరీఫ్‌నకు సన్నద్ధం
ABN, Publish Date - May 29 , 2025 | 11:36 PM
Ready for Kharif జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవసరమైన వరి విత్తనాలు, ఎరువుల సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు పక్కా ప్రణాళికలు రూపొందించారు.
విత్తనాలు, ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ సిద్ధం
పార్వతీపురం/పాలకొండ, మే 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవసరమైన వరి విత్తనాలు, ఎరువుల సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు పక్కా ప్రణాళికలు రూపొందించారు. వాస్తవంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులు 2.20 లక్షల ఎకరాల్లో వరిసాగు చేపట్టనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.ఇందులో లక్షా 79 వేల 478 ఎకరాల్లో వరకు వరి సాగు చేయనున్నట్టుఅంచనా వేస్తున్నారు.దీని కోసం 26 వేల 470 క్వింటాళ్ల వరి విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నారు. 9,092 క్వింటాళ్ల వరి విత్తనాలను 90 శాతం రాయితీపై గిరిజన రైతులకు అందించనున్నారు. ఇకపోతే జిల్లాలో ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో ఎద పద్ధతిలో వరి సాగు జరగనున్నట్టు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గతేడాది ఖరీఫ్‌లో రెండు లక్షల 20 వేల 395 ఎకరాల్లో వరి సాగు చేపట్టాల్సి ఉండగా.. రెండు లక్షల 12 వేల 319 ఎకరాల్లో వరితో పాటు ఇతర పంటలను పండించారు.
చిరుధాన్యాలసాగుకు ప్రోత్సాహం
చిరుధాన్యాలైన రాగి, కొర్ర, మినుము, పెసర, కందితో పాటు వేరుశనగ తదితర విత్తనాలను కూడా సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా18 వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు 1899 క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నారు. వరి పొలం గట్లపైకంది సాగుకు కూడా సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయనున్నారు.ఖరీఫ్ సీజన్‌లో 5 వేల పీఎండీఎస్ కిట్లు (నాలుగు కేజీల జనుము, నాలుగు కేజీల జీలుగు, రెండు కేజీల పిల్లిపెసర) సరఫరా చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో 1610 కిట్లు అందుబాటులో ఉన్నాయి.
రాయితీపై సరఫరా చేసే విత్తనాలు ...
ఎంటీయూ-1064 రకం 11,750 క్వింటాళ్లు, ఆర్‌జీఎల్ 2537 రకం 5,987 క్వింటాళ్లు, ఎంటీయూ 1121 రకం 2617 క్వింటాళ్లు, ఎంటీయూ 1061రకం 1250 క్వింటాళ్లు , బీపీటీ3291 రకం 1050 క్వింటాళ్లు, బీపీటీ 5204 రకం 980 క్వింటాళ్లు, ఎంటీయూ7029 రకం 965 క్వింటాళళ్ల, ఎంటీయూ1318రకం 880 క్వింటాళ్లు, ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం 461 క్వింటాళ్లు, ఎన్‌ఎల్ 34449 రకం 220 క్వింటాళ్లు, ఎంటీయూ1224 రకం 180 ఇ్వంటాళ్లు, ఎంటీయూ 1232 రకం 8 క్వింటాళ్లు , ఎంటీయూ1262 రకం 50 క్వింటాళ్లు రైతుల సేవా కేంద్రాల ద్వారాసరఫరా చేయనున్నారు. వాటిలో 17,378 క్వింటాళ్లు రాయితీ పద్ధతిలోను, 9,092 క్వింటాళ్లు గిరిజనులకు 90 శాతం రాయితీతోనూ విత్తనాలు సరఫరా చేయనున్నారు.
ఎరువుల పంపిణీకి సన్నద్ధం
ఖరీఫ్-2025 సీజన్ కోసం 45,276 మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరాకు ప్రతిపాదనలు చేశారు. మొదటిగా ఆరు వేల టన్నుల బఫర్ నిల్వలను మార్క్‌ఫెడ్‌లో సిద్దం చేశారు. మార్క్‌ఫెడ్ నుంచి మరో 15 వేల టన్నుల ఎరువులను సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హోల్‌సేల్ వ్యాపారులు, మార్క్‌ఫెడ్, ప్రైవేట్ డీలర్లు, పీఏసీఎస్, ఆర్‌ఎస్‌కేల వద్ద 6,039 మెట్రిక్ టన్నుల యూరియా, 1913 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1055 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో పాటు 399 మెట్రిక్ టన్నుల ఎంవోపీ , 819 మెట్రిక్ టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులు ఉన్నట్టు వ్యవసా యాధికారులు ప్రకటించారు. మొత్తంగా 10,225 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
ప్రణాళిక సిద్ధం
జిల్లాకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కోసం ఇండెంట్ పెట్టాం. ఖరీఫ్‌కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రైతులకు అవసరమైన సేవలు పూర్తిస్థాయిలో అందిస్తున్నాం.
- రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, పార్వతీపురం మన్యం
Updated Date - May 29 , 2025 | 11:36 PM