Progress ప్రతీవారం పురోగతి కనిపించాలి
ABN, Publish Date - May 12 , 2025 | 11:24 PM
Progress should be visible every week ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో చేపట్టే పనుల్లో ప్రతీ వారం పురోగతి కనిపించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ ఈఈలు, డీఈఈలు, ఏఈఈలతో సమీక్షించారు.
పార్వతీపురం, మే 12 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో చేపట్టే పనుల్లో ప్రతీ వారం పురోగతి కనిపించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ ఈఈలు, డీఈఈలు, ఏఈఈలతో సమీక్షించారు. చెరువులు, చెక్‌డ్యామ్‌లకు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. 122 క్యాస్కెడింగ్‌తో పాటు చెక్ డ్యామ్‌ల పనులను ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. సర్పంచ్‌ల తీర్మానంతో స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి నులు ప్రారంభించాలని సూచించారు. ఏఈఈల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, ఈఈలు, డీఈఈలు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఇకపై ప్రతి సోమవారం సమీక్షిస్తానని, ఈ లోగా ప్రగతి కనిపించాలని చెప్పారు. ఇచ్చిన లక్ష్యాలను నాలుగు వారాల్లో పూర్తి చేసిన వారికి బహుమతులు అందిస్తామన్నారు. అందుబాటులో ఉన్న నిధులతో తక్షణమే తాగునీటి పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశించారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. కిందిస్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. తాగునీటి పర్యవేక్షణ సెల్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నమోదు చేయాలన్నారు. పాలకొండ పరిధిలో జన్‌మన్ కింద 108 పనుల్లో 13 పనులు ప్రారంభమయ్యా యని గ్రామీణ నీటి సరఫరా డీఈ తెలిపారు.
- ‘ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో ఫాం పాండ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. బ్లాక్ ప్లాంటేషన్ కింద కొబ్బరి మొక్కల పెంపకం చేపట్టాలి. ఈ ఏడాది ఐదు వేల ఎకరాల్లో పెంపకమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నీటి సౌలభ్యం ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి. ఉపాధి వేతనదారులు వడ దెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేయాలి.’ అని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
- ‘భామిని మండలం మనుమకొండ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ప్రతి రంగంలో కనీసం 15 శాతం సుస్థిర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి. అధునాతన యంత్ర పరికరాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు, వంట గ్యాస్, గృహం, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు ఉండాలి. గ్రామంలో ఫోన్, బ్రాడ్ బ్యాండ్ , విద్య, వైద్య సేవలు అందుబాటులో ఉండాలి. వన్‌దన్ వికాస్, నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. స్థానికంగా లభించే పసుపు, చింతపండు, అడ్డాకులు తదితర ఉత్పత్తులకు విలువ ఆధారిత కల్పించాలి. స్వయం ఉపాధి వైపు యువత అడుగులు వేసేలా చర్యలు తీసుకోవాలి.’ అని కలెక్టర్ తెలిపారు.
Updated Date - May 12 , 2025 | 11:24 PM