problems by Under bridges అం‘డర్’ బ్రిడ్జిలు
ABN, Publish Date - Jul 23 , 2025 | 11:58 PM
problems by Under bridges
అం‘డర్’ బ్రిడ్జిలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
భారీ వర్షాల సమయంలో నరకయాతన
ఇరువైపులా నిలిచిపోతున్న రాకపోకలు
రైల్వే గేట్‌లే నయం అంటున్న వైనం
మంగళపాలెం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జికి మంత్రి హామీ
రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్‌ల కారణంగా గంటల తరబడి పడిగాపులు కాసే ప్రజలకు ఉపశమనం కలిగించాలని భావించిన ప్రభుత్వం రైల్వే అండర్ బ్రిడ్జిలను తెరపైకి తీసుకొచ్చింది. కానీ వాటితో మరిన్ని అవస్థలు మొదలయ్యాయి. కొన్నిచోట్ల నరకయాతన పడుతున్న ప్రయాణికులు, స్థానికులు అండర్ బ్రిడ్జిల కన్నా రైల్వే గేట్‌లే నయం అంటున్నారు. వర్షం కురిసినప్పుడు బ్రిడ్జిల కిందకు భారీగా నీరు చేరి ఇరువైపులా రాకపోకలు నిలిచిపోతున్నాయి.
కొత్తవలస, జూలై 23(ఆంధ్రజ్యోతి):
కొత్తవలస మండలంలో ఎనిమిది చోట్ల రైల్వేక్రాసింగ్‌లు ఉండేవి. వీటికి సంబంధించి రెండు చోట్ల ఫ్లైఓవర్లు, నాలుగు చోట్ల అండర్ బ్రిడ్జిలు నిర్మించారు. మరో రెండు చోట్ల ఇంకా లెవిల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. రాష్ట్రంలోని ఏ మండలంలో లేనన్ని రైల్వే క్రాసింగ్‌లు కొత్తవలస మండలంలో ఉన్నాయి. వీటిలో కొన్ని కాపలాదారునిగా ఉన్నవి కాగా మరికొన్ని ఎటువంటి కాపలా లేనివి. కేంద్రం ప్రభుత్వం ప్రతి రైల్వే క్రాసింగ్ వద్ద అండర్ బ్రిడ్జి కాని, ఫ్లైఓవర్ కాని నిర్మించాలని నిర్ణయించింది. కొత్తవలస రైల్వే గేట్ వద్ద రైల్వే ఫ్లైఓవర్ కాకుండా అండర్ బ్రిడ్జి నిర్మించారు. అలాగే మంగళపాలెం, నిమ్మలపాలెం, దేశపాత్రునిపాలెం, కొత్తూరు కంటకాపల్లి వద్ద కూడా అండర్ బ్రిడ్జిలు నిర్మించారు. అప్పటి నుంచే ప్రజలకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఒక్కో చోట ఒక్కో తరహా సమస్యలు తెరమీదకు వచ్చాయి.
- కొత్తవలస అండర్ బ్రిడ్జికి సంబంధించి చిన్న వర్షం కురిసినా అండర్ బ్రిడ్జిలోకి నీరు చేరిపోవడంతో రెండువైపుల నుంచి రాకపోకలు నిలిచిపోతున్నాయి. గతంలో నాలుగో ఐదో రైళ్లు వెళ్లిన తరువాతైనా గేట్ తీసేవారు. రాకపోకలు సాగేవి. ఇప్పుడు వర్షం పడితే ఎప్పుడు వెళతామో ఎప్పుడు వస్తామో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు. ఈ అండర్‌బ్రిడ్జికి సంబంధించి ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలంటే కనీసం అరకిలోమీటరు నడవాల్సి ఉంది. దీంతో వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ అండర్ బ్రిడ్జి ఉంటునే రైల్వే లైన్‌లపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు స్థానికులు ఆందోళనలు చేశారు.
మంగళపాలెం అండర్ బ్రిడ్జి మరీ దారుణం
మంగళపాలెం గ్రామంలోకి జంక్షన్ నుంచి వెళ్లాలంటే 100 అడుగులు నడిస్తే చాలు. గతంలో ఇక్కడ రైల్వేగేట్ ఉండేది. గేట్ తీయగానే నేరుగా ఊర్లోకి వెళ్లి పోయేవారు. అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేసిన తరువాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. 100 అడుగుల దూరంలో ఉన్న ఊర్లోకి ఇప్పుడు వెళ్లాలంటే కనీసం ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఊరు ఒకదగ్గరుంటే అండర్ బ్రిడ్జి ఒక దగ్గర ఉంది. దీంతో తమకు నడచి వెళ్లడానికి కనీసం ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇటీవల సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడుకు ఇదే సమస్య చెప్పడంతో ఆయన ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే కేంద్రమంత్రి రామ్మోనాయుడు దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇక నిమ్మలపాలెం అండర్ బ్రిడ్జికి సంబంధించి ఏవైపు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశపాత్రునిపాలెం, కొత్తూరు కంటకాపల్లి అండర్ బ్రిడ్జిల వద్ద కూడా ఇవే సమస్యలున్నాయి. రాయపురాజుపేట, అడ్డూరువానిపాలెం గ్రామాల వద్ద ఇంకా రైల్వేక్రాసింగ్‌లు కొనసాగుతున్నాయి.
కొత్తవలస మాటేంటి?
మంగళపాలెం గ్రామస్థులకు మంత్రి అచ్చెన్నాయుడు మాటిచ్చారు. మరి కొత్తవలస ప్రజలు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. వీరి పరిస్థితేంటని జిల్లా సీపీఎం కార్యవర్గ సభ్యుడు గాడి అప్పారావు, శృంగవరపుకోట నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి డేగల అప్పలరాజు ప్రశ్నించారు. కొత్తవలసలో కూడా రైల్వేలైను దాటుకుని వెళ్లేందుకు పాదచారులకోసం ఫుట్‌ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jul 23 , 2025 | 11:58 PM