Plant coconut trees: 5వేల ఎకరాల్లో కొబ్బరి మొక్కలు నాటండి
ABN, Publish Date - Apr 10 , 2025 | 11:30 PM
Plant coconut trees: జిల్లాలో మూడు వేల నుంచి 5 వేల ఎకరాల్లో కొబ్బరి మొక్కలు నాటి, వాటి పర్యవేక్షణ బాధ్యతను స్థానిక గ్రామ మహిళా సంఘాలకు అప్పగించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు.
- వెంటనే ప్రణాళికలు తయారు చేయండి
- కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు వేల నుంచి 5 వేల ఎకరాల్లో కొబ్బరి మొక్కలు నాటి, వాటి పర్యవేక్షణ బాధ్యతను స్థానిక గ్రామ మహిళా సంఘాలకు అప్పగించాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టర్ తన కార్యాలయంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ రామచంద్రరావు, జిల్లా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారి అప్పలనాయుడు, తోటపల్లి డీఈ రఘుతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం ద్వారా వీఆర్‌ఎస్, తోటపల్లి, పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డ తదితర సాగునీటి ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో కొబ్బరి మొక్కలు పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు వెంటనే తయారు చేయాలని ఆదేశించారు. ఐదు ఎకరాలను ఒక బ్లాక్‌గా ఏర్పాటు చేసి అందులో 300 కొబ్బరి మొక్కలు నాటాలని సూచించారు. 3వేల ఎకరాల్లో కొబ్బరి మొక్కలు నాటితే దిగుబడి ప్రారంభమై ఒక్కొక్క చెట్టు ద్వారా రూ.1500 ఆదాయం లభిస్తుందన్నారు. మొత్తంగా సుమారు రూ.45 కోట్లు వరకు ఆదాయం విలేజ్ ఆర్గనైజేషన్స్‌కు అదే అవకాశం ఉంటుందన్నారు. కొబ్బరిమొక్కల పెంపకంపై అవసరమైన సూచనలు, సలహాలను ఉద్యానశాఖ అధికారులు, సిబ్బంది అందించాలని ఆదేశించారు.
ప్రతి కుటుంబం లక్ష ఆదాయం పొందాలి
ప్రతి కుటుంబం కనీసం లక్ష రూపాయల ఆదాయం పొందాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి జీవనోపాధి కల్పనలో భాగంగా గురువారం కలెక్టర్ తన కార్యాలయంలో సంబంధిత ఽఅదికారులతో సమీక్షించారు. ఉద్యాన, వ్యవసాయ పంటలు, ఆవులు, మేకలు, గొర్రెలు, మేకలు పెంపకం తదితర యూనిట్ల ఏర్పాటుతో పొందే ఆదాయ మార్గాలపై చర్చించారు. వీటికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. జిల్లాలో 110 ఎకరాల్లో పనస పంట వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి డీఎస్ దినేష్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి ఎం.సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 10 , 2025 | 11:30 PM