భోగాపురం ఎయిర్ పోర్టులో చక్కర్లు కొట్టిన విమానం
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:56 PM
భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంలో రెండురోజుల కిందట ఓ విమానం చక్కర్లు కొట్టింది.
భోగాపురం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంలో రెండురోజుల కిందట ఓ విమానం చక్కర్లు కొట్టింది. కొందరు వ్యక్తులు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రన్‌వే, సిగ్నల్ వ్యవస్థ, తదితర వాటికి సంబంధించి పనులు చకచక జరుగుతున్నాయి. అయితే, రెండు రోజుల కిందట ఓ విమానం రన్‌వేకు అతి దగ్గరగా వచ్చి ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించి మళ్లీ పైకి ఎగిరింది. అలాగే ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ సముద్రం వైపు వెళ్లిపోయింది. ఈ విమానాన్ని అక్కడ పని చేస్తున్న నిర్మాణ కార్మికులు, రెడ్డికంచేరు, చేపలకంచేరు, గూడేపువలస, కవులవాడ, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. సిగ్నల్, రన్‌వే టెస్టుకు సంబంధించి విమానం వచ్చి వెళ్లిందంటూ స్థానికులు పలు రకాలుగా అనుకుంటున్నారు. దీనిపై ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపడుతున్న జీఎంఆర్ సంస్థకు చెందిన ఉద్యోగులను వివరణ కోరగా.. ‘నిర్మాణంలో ఉన్న విమానాశ్రయ పరిస్థితి, చేయాల్సిన పనులు, చిన్నచిన్న మార్పులు, అడ్డంకులు, తదితర వాటిని పరిశీలించేందుకు అప్పుడప్పుడు నిర్వాహకులు విమానంలో వస్తుంటారు. అందులో భాగంగానే ఇటీవల భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో విమానం గాల్లో చక్కర్లు కొట్టి వెళ్లింది.’ అని తెలిపారు.
Updated Date - Jun 22 , 2025 | 11:56 PM