ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రశాంత తీరం.. కాలుష్య కల్లోలం

ABN, Publish Date - Jun 07 , 2025 | 11:39 PM

సముద్రం.. సమస్త జీవరాశులకు మూలాధారం. ప్రధానంగా ఎన్నో జీవులకు ప్రాణవాయువును అందిస్తోంది.

వ్యర్థాలతో నిండిన ముక్కాం తీరం

- జిల్లాకు చెంతనే బంగాళాఖాతం

- మానవ తప్పిదాలతో ప్రమాదకరం

- తగ్గుతున్న మత్స్య సంపద

- కనుమరుగవుతున్న సముద్రపు జీవులు

- కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది

- నేడు ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం

భోగాపురం, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి):

సముద్రం.. సమస్త జీవరాశులకు మూలాధారం. ప్రధానంగా ఎన్నో జీవులకు ప్రాణవాయువును అందిస్తోంది. సముద్రంలోని ఆల్గేగా పిలిచే పైటోప్లవకం అనే నిమ్న వృక్షజాతి.. దాదాపు 25శాతం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు సముద్రంలో మత్స్యసంపదతోపాటు.. మాంగనీసు, కోబాల్డు, నికెల్‌ లాంటి లోహ మూలకాలతో ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. బంగాళాఖాతం తీరానికి చెంతనే మన జిల్లా ఉండడం గొప్పవరం. అయితే మానవ తప్పిదాల మూలంగా సముద్రం కాలుష్యం బారిన పడుతోంది. సముద్రం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని మరచిపోతున్నారు. తీరం వెంబడి చెత్తా, చెదారం, వ్యర్థాలను పడేస్తున్నారు. దీంతో కాలుష్య కోరల్లో చిక్కుకొని అరుదైన ఎన్నో సముద్ర జీవరాశులు అంతరించి పోతున్నాయి. సాగరాలు నీటి వనరులే కాదని, అవి మనకు జీవనాధారమని ప్రతిఒక్కరూ గుర్తించాలి. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలి. ఆదివారం ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.


జిల్లాలో 28 కిలోమీటర్ల తీరం

జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో సుమారు 28 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. 16 మత్స్యకార గ్రామాలు, 20వేల జనాభా ఉన్నారు. సుమారు 4,500 మంది చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రెండు మండలాల్లో ఏడాదికి సుమారు 3,500 టన్నుల వరకు మత్స్య సంపద ఉత్పత్తి అవుతుంది. గతంలో పెద్దపెద్ద కోనాలు, భారీ టేకు చేపలు, టైగర్‌ రొయ్యలు, అనేక రకాల పెద్ద చేపలు లభ్యమయ్యేవి. అయితే, ప్రస్తుతం సముద్రపు జలాలు కలుషితం కావడంతో మత్స్య సంపద తగ్గిపోతోంది. తీర ప్రాంతాల్లో ఉన్న వివిధ రసాయన పరిశ్రమలు వ్యర్థ నీటిని నేరుగా సముద్రంలోకి విడిచిపెడుతున్నాయి. అలాగే, అధికంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు తీరంలో పేరుకుపోతున్నాయి. కాలుష్యం కారణంగా చేపలు, తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. అరుదైన సముద్రపు జీవులు కొన్ని అంతరించిపోతున్నాయి. కొన్ని రకాల చేపలు ప్రస్తుతం మచ్చుకకు కూడా కనిపించడంలేదు. చిన్నచిన్న కవళ్లు, నెత్తళ్లు, కానా కడతలు, తోలు పారలు, వంజరాలు, రొయ్యలు, ఆకు పరిగెలు మాత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంపై రోజుల తడబడి వేట సాగిస్తున్నా కష్టానికి తగ్గ ఫలితం దక్కడంలేదు. స్థానికంగా మత్స్య సంపద లభించకపోవడంతో కుటుంబ పోషణ కోసం గుజరాత్‌, వీరావళి, చైన్నై వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. ఇలా సుమారు వెయ్యి మంది వరకు వలస వెళ్లిపోయారు.


కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే..

జిల్లాలో సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. ఏదో తూతూ మంత్రంగా కాకుండా అందరూ పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. తీరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయకుండా స్థానిక ప్రజలకు, సాగర ప్రేమికులకు, పర్యాటకులకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా పరిశ్రమల వ్యర్థ జలాలను నిబంధనలకు అనుగుణంగా శుద్ధి చేసి సముద్రంలోకి విడిచి పెట్టేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే, తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పూసపాటిరేగ మండలం చింతపల్లి సమీపంలో టూరిస్టు స్పాట్లు ఎన్నో ఉన్నాయి. కానీ, అవి అంతగా అభివృద్ధి కాలేదు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా వాటిని అభివృద్ధి చేస్తే తద్వారా ప్రభుత్వానికి, ఆయా ప్రాంతాల్లో నివసించేవారికి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. భోగాపురం మండలంలోని ముక్కాం తీరం ఆక్రమణకు గురవుతుంది. ఈ ఆక్రమణలకు అడ్డుకుని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.


యువత శ్రద్ధ తీసుకోవాలి

సముద్రం చూడడానికి చాలా అందగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి సాగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖ్యంగా యువత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాస్టిక్‌ వ్యర్థాలు పడేయకుండా, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు సముద్రంలో కలవకుండా చూడాలి. అప్పుడే సముద్ర జీవులను కాపాడుకోవచ్చు.

-మైలపల్లి ఎర్రన్న, మత్స్యకారుడు, చేపలకుంచేరు

చేపలు దొరకడం లేదు

గతంలో సముద్రంలో కొంతదూరం వెళ్లి వేట సాగిస్తే చాలు పెద్ద చేపలు దొరికేవి. తక్కువ శ్రమతోనే ఆదాయం ఎక్కువగా వచ్చేది. ప్రస్తుతం, ఖరీదైన వలలు, పడవలతో రోజుల తరబడి వేట సాగించినా ఖర్చు అధికంగా ఉంటుందే గానీ శ్రమకు తగ్గ చేపలు మాత్రం దొరకడంలేదు.

-గరికిన రాము, మత్స్యకారుడు, ముక్కాం.

అవగాహన కలిగిస్తున్నాం

సముద్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కాలుష్యం కారణంగా జీవరాసులు అంతరించి పోయే అవకాశం ఉంది. తీరంలో టూరిస్టులకు పదేపదే అవగాహన కల్పిస్తున్నాం. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తీరంలో ఎక్కడబడితే అక్కడ పడేయకుండా చర్యలు తీసుకుంటున్నాం.

సరిత, పొల్యుషన్‌ ఈఈ, విజయనగరం

Updated Date - Jun 07 , 2025 | 11:39 PM