Parents' Day is celebrated ప్రతిష్టాత్మకంగా పేరెంట్స్ డే
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:58 PM
Parents' Day is celebrated పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు చర్యలు తీసుకుంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలను మరింత బలపరచడానికి శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగానే ఈ నెల10న మెగా పేరెంట్స్ డే నిర్వహించడానికి నిర్ణయించింది.
ప్రతిష్టాత్మకంగా పేరెంట్స్ డే
పిల్లల సమగ్ర ప్రగతిని వివరించనున్న ఉపాధ్యాయులు
ఏర్పాట్లలో జిల్లా విద్యాశాఖ తలమునకలు
చీపురుపల్లి, జులై 7(ఆంధ్రజ్యోతి): పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు చర్యలు తీసుకుంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలను మరింత బలపరచడానికి శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగానే ఈ నెల10న మెగా పేరెంట్స్ డే నిర్వహించడానికి నిర్ణయించింది. జిల్లాలోని 2229 పాఠశాలల్లోనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరపడానికి పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆయా పాఠశాలల కాంపోజిట్ గ్రాంట్ల నుంచి 20 శాతం నిధుల్ని వెచ్చించాలని ఆదేశించింది. పది మంది పిల్లలున్న బడులకు వెయ్యి రూపాయలు, 300 నుంచి 400 మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఐదు వేలు, ఇలా పిల్లల సంఖ్యను బట్టి నిధులను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వారం రోజుల ముందే ఉత్తర్వులు వెలువడడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఏర్పాట్లు జోరందుకున్నాయి. తల్లిదండ్రుల సమావేశాలు కొత్త కానప్పటికీ, ఈ సారి పలు ప్రత్యేకతలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు, ఎవరి స్థాయిలో వారు నిధులు సేకరించి కార్యక్రమం విజయవంతం చేసే ప్రణాళికతో ఉన్నారు. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ పేరెంట్స్ డే నిర్వహణకు కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్వాన కమిటీ, బడ్జెట్ కమిటీ, బడి సుందరీకరణ కమిటీ, పర్యావరణ పరిరక్షణ, రిసెప్సన్, సీటింగ్ ఏర్పాట్లు, విద్యార్థుల ప్రగతి నివేదికల తయారీ, స్టేజీ నిర్వహణ వంటి పనులకు వేర్వేరు కమిటీలను నియమిస్తున్నారు.
పిల్లల ప్రగతిపై సమగ్ర నివేదికలు
ప్రత్యేకంగా నిర్వహించే ఈ సమావేశంలో పిల్లల ప్రగతికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికల్ని తల్లిదండ్రులకు అందజేయనున్నారు. సమగ్ర శిక్ష అధికారులు తయారు చేస్తున్న ఈ నివేదికల్లో అకడమిక్ వివరాలతో పాటు హాజరు, ఆటపాటలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో కనబరచిన ప్రతిభ, ఇతర రంగాల్లో పురోగతి, ఆరోగ్య సమాచారం, ఎత్తు, బరువు తదితర వివరాలను కూడా పొందుపరచనున్నారు.
పిల్లలు, పేరెంట్స్‌కు వేర్వేరుగా ఆటల పోటీలు
ఈ మెగా డేలో పిల్లలకు, వారి తలిదండ్రులకు వేర్వేరుగా పలు క్రీడల్లో పోటీలు నిర్వహించి బహుమతులందజేయనున్నారు. సెల్ ఫోన్లు, ట్యాబ్‌లు అధికంగా వినియోగించే పిల్లల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై పెద్దలకు అవగాహన కల్పించనున్నారు. పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించి కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా కుటుంబ ఫొటో డ్రీమ్ వాల్స్, పాజిటివ్ పేరెంటింగ్ సెషన్లు, అమ్మ పేరుతో మొక్క నాటడం, గ్రీన్ పాస్‌పోర్టు కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే, మానసిక ఆరోగ్యం, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాలు, పిల్లల పుగోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లు జరుగనున్నాయి.
---------------------
Updated Date - Jul 07 , 2025 | 11:58 PM