మా మంచి గురువులు
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:55 PM
మండలంలోని కాపుసోంపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మంచి మనసును చాటుకున్నారు.
- గిరిజన విద్యార్థుల కోసం ఆటో ఏర్పాటు
- నెలకు సొంతంగా రూ.12వేలు అద్దె చెల్లింపు
- ఆనందం వ్యక్తం చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు
- కాపుసోంపురం ఉపాధ్యాయులపై ప్రశంసలు
శృంగవరపుకోట రూరల్ జూన్ 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాపుసోంపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మంచి మనసును చాటుకున్నారు. రవాణా సదుపాయం లేక చదువుకు దూరమైన గిరిజన విద్యార్థుల కోసం వారు ఓ ఆటోను ఏర్పాటు చేశారు. ఆటోకు నెలకు సొంతంగా రూ.12వేలు చెల్లించి విద్యార్థులను పాఠశాలకు తీసుకువస్తున్నారు. దీంతో ఆ నలుగురు ఉపాధ్యాయులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొండపై ఉన్న మునపరాయి, రాయివలస గ్రామాల్లో ఒకటి నుంచి మూడో తరగతి వరకు చదువుతున్న 12 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు గతేడాది దారపర్తి పంచాయతీ పల్లపు దుంగాడ పాఠశాలలో చదివేవారు. వీరు పాఠశాలకు చేరుకోవాలంటే ఏడు కిలోమీటర్లు కొండపైకి ఎక్కాల్సి వచ్చేది. దీంతో ఈ ఏడాది పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో కొండ దిగువన ఉన్న కాపుసోంపురం ప్రభుత్వ పాఠశాలకు చెందిన హెచ్‌ఎం వన్నెపూరి సన్యాసిదేముడు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎంవీవీఎస్ నారాయణ, ఎం.కొండలరావు, టీసీహెచ్ నాయుడు బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మునపరాయి, రాయివలస గ్రామాలకు వెళ్లారు. అక్కడ చిన్నారులు చదువుకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. వారిని తమ పాఠశాలకు పంపించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. కొండ దిగువ ఉన్న పాఠశాలకు పంపించాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేదని, తమ పిల్లలు ఇబ్బందులు పడతారని వారు చెప్పారు. ఆటోలో పంపే స్థోమత కూడా లేదని అన్నారు. దీంతో తామే ఆటోను ఏర్పాటు చేస్తామని, పిల్లలను పాఠశాలకు పంపించాలని ఉపాధ్యాయులు అనడంతో తల్లిదండ్రులు అంగీకరించారు. చిన్నారులను ప్రతిరోజూ కొండపై నుంచి పాఠశాలకు తీసుకొచ్చేందుకు ఒక ఆటోను నెలకు రూ.12వేలకు ఏర్పాటు చేశారు. ఆటో అద్దెను ఉపాధ్యాయులే చెల్లిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి మునపరాయి, రాయివలస గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆటోలో కాపుసోంపురం ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. పాఠశాల విడిచిపెట్టిన తరువాత అదే ఆటోలో ఇళ్లకు చేరుతున్నారు. అదేవిధంగా ఈ పిల్లల్లో కొందరికి ఆధార్‌కార్డులు లేనట్లు ఉపాధ్యాయులు గుర్తించి వారికి ఆ కార్డులు చేయిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Updated Date - Jun 20 , 2025 | 11:55 PM