Pension Distribution... పింఛన్ల పంపిణీ తర్వాతే...
ABN, Publish Date - Jun 29 , 2025 | 11:32 PM
Only After Pension Distribution... జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిస్తున్న సిబ్బందికి బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే జూలై నెలకు సంబంధించి పింఛన్లు పంపిణీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వారిని రిలీవ్ చేయాలని రాష్ట్ర జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఉన్నతాధికారులు
గరుగుబిల్లి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిస్తున్న సిబ్బందికి బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే జూలై నెలకు సంబంధించి పింఛన్లు పంపిణీ ప్రక్రియ పూర్తయిన తర్వాతే వారిని రిలీవ్ చేయాలని రాష్ట్ర జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జూలై 5 తర్వాత సిబ్బందికి కేటాయించిన స్థానాల్లో హాజరుకావలసి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోని 350 సచివాలయాల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత సచివాలయాల సిబ్బందికి విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది. మొదటిగా గ్రామ సచివాలయాల సర్వేయర్లు 342 మందికి స్థానచలనం కల్పించారు. ఏఎన్‌ఎంలు, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లు బదిలీల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. సోమవారం మహిళా పోలీస్ సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొత్తంగా ఈ నెల 30తో బదిలీల ప్రక్రియ పూర్తికానుంది. కాగా సొంత మండలాలకు చెందిన వారికి వేరే ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. రాజకీయ సిఫారసులకు తావులేకుండా ఉమ్మడి జిల్లాల అధికారులు నిబంధనల మేరకు బదిలీలు నిర్వహించారు.
ఆదేశాలు అందాయి
సచివాలయాల సిబ్బందిని పింఛన్లు పంపిణీ తర్వాతే రిలీవ్ చేయాలని ఆదేశాలు అందాయి. జూలై 1 నుంచి 5వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ ప్రక్రియ జరగనుంది. జిల్లాలో 1,39,111 మందికి పింఛన్లను అందించాల్సి ఉంది. పింఛన్‌దారులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై సచివాలయాల సిబ్బందికి సమాచారం అందించాం.
- ఎన్.అర్జునరావు, ఇన్‌చార్జి ఎంపీడీవో, గరుగుబిల్లి
Updated Date - Jun 29 , 2025 | 11:32 PM