Oh No… Fever Strikes! అమ్మో.. జ్వరం
ABN, Publish Date - Jul 18 , 2025 | 11:34 PM
Oh No… Fever Strikes! మన్యం జిల్లా మంచం పట్టింది.. సీజనల్ వ్యాధులతో వణుకుతోంది. వాతావరణ మార్పులు.. పారిశుధ్య లోపం తదితర కారణాలతో రోజురోజుకూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ఇంటికి ఒకరిద్దరు చొప్పున మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు. మరోవైపు జిల్లాలో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.
విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లతో ప్రజల అవస్థలు
ఆసుపత్రుల్లో రోజూ వందల సంఖ్యలో ఓపీ
పెరుగుతున్న ఇన్‌పేషెంట్లు.. చాలని పడకలు
వార్డులన్నీ కిటకిట.. వేధిస్తున్న వసతి సమస్య
మన్యం జిల్లా మంచం పట్టింది.. సీజనల్ వ్యాధులతో వణుకుతోంది. వాతావరణ మార్పులు.. పారిశుధ్య లోపం తదితర కారణాలతో రోజురోజుకూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ఇంటికి ఒకరిద్దరు చొప్పున మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు. మరోవైపు జిల్లాలో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. రోజూ వందల సంఖ్యలో ఓపీ నమోదువుతోంది. అత్యధికులు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. దీంతో వార్డులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అయితే వైద్యం కోసం వచ్చే వారికి వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పడకలు చాలక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు సర్దుకోవాల్సి వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
రోజుకు 800 నుంచి 900 వరకు ఓపీ
పార్వతీపురం టౌన్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో రోజూ 900 వరకు ఓపీ నమోదవుతోంది. వారిలో 50 శాతం మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. దీంతో ఆసుపత్రిలో అన్ని వార్డులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం ఆసుపత్రిలో 800 వరకూ ఓపీ నమోదవగా.. వారిలో మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నవారు అత్యధికంగా ఉన్నారు. వాస్తవంగా జిల్లాలోని 15 మండలాలతో పాటు గిరిజన, మైదాన ప్రాంతాలకు చెందిన రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో 150 పడకలు ఉన్నా.. రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వసతులు లేవు. దీంతో ఇన్‌పేషెంట్లు, వైద్యులు, సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు. ప్రధానంగా రోగుల బంధువులు, సహాయకులు జిల్లా కేంద్రాసుపత్రి బయట ఉన్న చిన్న చిన్న షెడ్లలో తల దాచుకోవాల్సి వస్తోంది. వర్షం కురిస్తే ఇక అంతే సంగతి. ఆ షెడ్లలో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆసుపత్రిలో రోగులకే భోజన సౌకర్యం కల్పించడం వల్ల వారి బంధువులు బయట ఆహారాన్ని కొనుక్కోలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా గిరిజనులు స్వచ్ఛంద సంస్థలు అందించే భోజనం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. రోగుల బంధువుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేక గదులను కేటాయించి తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాన్ని కల్పించాలని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలకులు, వైద్యాధికారులు భావించారు. అయితే 2019లో పాలన పగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వం రోగుల బంధువుల సౌకర్యాలకు సంబంధించి వినతులు, ప్రతిపా దనలను గాలికి వదిలేసింది. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులతోపాటు ఇన్‌పేషెంట్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. 150 పడకల ఆసుపత్రికి తగ్గట్టుగా వైద్యసేవలను మెరుగుపరిచాం. వైద్యాధికా రులతో పాటు వైద్య సిబ్బంది సంఖ్యను పెంచాం. రోగుల తాకిడి దృష్ట్యా అదనపు వార్డులను ఏర్పాటు చేశాం.’ అని జిల్లా ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ శ్యామల తెలిపారు.
ఒకే బెడ్‌పై ముగ్గురికి వైద్యం
సీతంపేట రూరల్: సీతంపేట ఏరియా ఆసుపత్రిలో రోజుకు 300 వరకు ఓపీ రాగా సోమవారం అయితే 440 వరకు నమోదైంది. శుక్రవారం మాత్రం ఓపీ 303గా నమోదైంది. మలేరియా ఆర్‌డీటీ రక్తపరీక్షలో 21, స్లైడ్ టెస్ట్‌లో 2(ఇద్దరి)కి పాజిటివ్ వచ్చింది. ఇక టైఫాయిడ్, విష జ్వరాలతో మరో 83మంది బాధపడుతున్నారు. వీరిలో ఇన్‌పేషెంట్లుగా 31మంది ఆసుపత్రిలో చేరి వైద్యసేవలు పొందుతున్నారు. అయితే వారికి సరిపడా వార్డులు, బెడ్‌లు అందుబాటులో లేవు. దీంతో చేసేది లేక వైద్య సిబ్బంది ఒకే మంచంపై ఇద్దరు లేక ముగ్గురికి వైద్యసేవలు అందిస్తున్నారు. 100పడకలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. పై అంతస్థులో అదనపు వార్డుల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. దీంతో రెండు వార్డుల్లో చిన్నారులు, మహిళలకు వేరుగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇంకా కింద అంతస్థులో మరో 40బెడ్లు రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. మొత్తంగా ఏరియా ఆసుపత్రిలో 4 వార్డుల్లో 80బెడ్‌లు సిద్ధం చేసి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్లతో అత్యధికులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ‘జ్వరపీడితుల తాకిడి ఎక్కువగా ఉంది. దానికి తగ్గట్టుగా రోగులకు వైద్యసేవలందిస్తుం.ఒక్కో వార్డులో 20చొప్పున బెడ్లు వేయించాం. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నాం. ఆసుపత్రి పై అంతస్థులో నిర్మాణ పనులకు ప్రతిపాదనలు పంపించాం.’ అని ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు.
నిత్యం అవస్థలే...
సాలూరు: పట్టణ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం 400 వరకూ ఓపీ నమోదైంది. సుమారు 200 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. కాగా వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో రోగులకు వసతి సమస్య వేధిస్తోంది. ఒక మంచంపై ఇద్దరు నుంచి ముగ్గురు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సీహెచ్‌సీ నుంచి ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత డాక్టర్లు, వైద్య సిబ్బంది సంఖ్య పెరిగింది. సాలూరు, పరిసర గ్రామాలతో పాటు పక్కనే ఉన్న ఒడిశా నుంచి కూడా రోగులు ఇక్కడకు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. అయితే వసతి సమస్య పరిష్కారం కాకపోవడం, వివిధ పరీక్షలకు చెందిన యంత్ర సామగ్రిని ఇంకా అమర్చక పోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక రోజూ ఆసుపత్రిలో 150 నుంచి 200 మందికి అందించే భోజనం బాగోడం లేదని రోగులు చెబుతున్నారు. కేవలం రూ.70తో రోగులకు మూడు పూటలా ఆహారం అందజేయడం కష్టంగా మారిందని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని భోజన నిర్వాహకులు చెబుతున్నారు. వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని సూపరింటెండెంట్ మీనాక్షి తెలిపారు.
రోగులతో కిటకిట
పాలకొండ: పాలకొండ ఏరియా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో రోజూ సరాసరి 400 వరకు ఓపీ నమోదవుతుంది. మలేరియా, టైఫాయిడ్, డయేరియా, వైరల్ జ్వరాలతో అత్యధికులు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. దీంతోఆసుపత్రిలో ఉన్న వంద పడకలు రోగులతో నిండిపోయాయి. కాగా గత వారం వరకు అందుబాటులో ఉన్న జనరల్ మెడిసిన్ వైద్యుడు సుధీర్ ఉన్నత చదువులకు వెళ్లిపోయారు. రెగ్యులర్ రేడియాలజిస్ట్ లేకపోవడంతో వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే స్కానింగ్‌లు చేపడుతున్నారు. ఆక్సిజన్ లేక ఐసీయూ వైద్య సేవలు అందడం లేదు. కాగా రోగులకు అన్ని రకాల వైద్యసేవలను అందిస్తున్నామని ఏరియా ఆసుప్రతి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ చిరంజీవి తెలిపారు.
Updated Date - Jul 18 , 2025 | 11:34 PM