ocean come to near houses అలా ముంచుకొస్తోంది
ABN, Publish Date - Jul 25 , 2025 | 12:16 AM
ocean come to near houses సముద్రం ఇళ్లను తాకుతోంది.. పెద్ద పెద్ద కెరటాలతో నివాసితుల సమీపానికి వచ్చి స్థిరపడిపోతోంది. ఈ మార్పు మత్స్యకారులను కలవరపెడుతోంది. ముక్కాం గ్రామం వద్ద గురువారం ఉదయం 7గంటల సమయంలో అలలు ఎన్నడూ లేని విధంగా తీరం వెంబడి ఉన్న గృహాలను తాకాయి. తాటాకు గృహాల్లో నివాసముంటున్న మత్స్యకారులు టెన్షన్ పడ్డారు.
అలా ముంచుకొస్తోంది
గృహాలకు సమీపంగా కెరటాలు
భయాందోళన చెందుతున్న మత్స్యకారులు
సముద్రంలో ప్రమాదకర మార్పులు
కొద్దికొద్దిగా ముందుకు వచ్చి స్థిరంగా..
రక్షణగోడ నిర్మించాలని ప్రభుత్వానికి విన్నపం
సముద్రం ఇళ్లను తాకుతోంది.. పెద్ద పెద్ద కెరటాలతో నివాసితుల సమీపానికి వచ్చి స్థిరపడిపోతోంది. ఈ మార్పు మత్స్యకారులను కలవరపెడుతోంది. ముక్కాం గ్రామం వద్ద గురువారం ఉదయం 7గంటల సమయంలో అలలు ఎన్నడూ లేని విధంగా తీరం వెంబడి ఉన్న గృహాలను తాకాయి. తాటాకు గృహాల్లో నివాసముంటున్న మత్స్యకారులు టెన్షన్ పడ్డారు. గతంలో సముద్రం ముందుకొచ్చినా మళ్లీ అంతే వేగంగా వెనక్కు పోయేది. కొంతకాలంగా 30 అడుగులు ముందుకొస్తే తిరిగి 20 అడుగుల వరకే వెళ్తోంది. దీనివల్ల భవిష్యత్‌లో తమ మనుగడ కష్టమేనని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలి సమీపంలో నిర్మించినట్టు తమ గ్రామాల వద్ద కూడా రక్షణ గోడ నిర్మిస్తే కాస్త ధైర్యంగా ఉండగలుగుతామని చెబుతున్నారు.
భోగాపురం, జూలై24(ఆంధ్రజ్యోతి):
భోగాపురం మండలంలో ఎనిమిదేళ్ల కిందట 200 మీటర్లు వెనుక ఉన్న తీరం ఇప్పుడు ఇళ్లకు చేరువవుతోంది. దీంతో ఒడ్డు కొట్టుకెళ్తోంది. ఈ కారణంగా ముక్కాం, కొండ్రాజుపాలెం గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఇళ్ల ధ్వంసంతో పాటు బోట్లు, వలలు కొట్టుకుపోతున్నాయి. తుఫాన్ల సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పూసపాటిరేగ మండలంలో చింతపల్లి, తిప్పలవలస, బర్రిపేట తదితర గ్రామాల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంటోంది. తీరానికి దగ్గరంగా ఉండడంతో ఆటుపోట్ల సమయంలో ఇళ్లలోకి నీరు చేరుతోంది. హుద్‌హుద్ సమయంలో కొండ్రాజుపాలెంలో ఇళ్లలోకి సముద్రం నీరు పోటెత్తడంతో చాలా భయపడ్డారు. బయటకు పరుగులు తీశారు. బంగాశాఖాతంలో తుఫాన్లు వచ్చేటప్పుడు, అమవాస్య సమయాల్లో ఆటుపోట్లు వచ్చేటప్పుడు తీర గ్రామాల ప్రజలు భయంతోనే బతుకుతున్నారు. సముద్రం ఏకంగా 50 మీటర్ల మేర ముందుకొచ్చి ఇళ్లను తాకుతోంది. వేటకు అనుకూలంగా ఉంటుందని సముద్ర తీరంలో ఉంచిన పడవలను మత్స్యకారులు విధిలేక గృహాల వద్దకు, ఆర్‌అండ్‌బీ రహదారి సమీపానికి తరలించుకొని భద్రపరుచుకొంటున్నారు. కొంతమంది గృహాల మట్టిగోడలు తడిసిపోకుండా చెక్కలను అడ్డుపెట్టుకొంటున్నారు. సముద్రం తీరు ఇదే విధంగా ఉంటే కొంతకాలం తర్వాత ముక్కాం గ్రామం సముద్రంలో కలిసిపోయేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తీరం వెంబడి ఉన్న సీసీ రహదారి, విద్యుత్ స్తంభాలు, గృహాలు కెరటాల దాటికి కూలిపోయిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి.
రక్షణ గోడ అవసరం
నానాటికీ చెంతకు వస్తున్న తీరం నుంచి కాస్త అయినా రక్షణ పొందాలంటే తీరం అంచున బలమైన రాతి గోడ నిర్మించాలని మత్స్యకారులు కోరుతున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో తీరం వెంబడి ఉన్న గ్రామాల వద్ద రక్షణ గోడ ఉంది. అదే మాదిరి ఇక్కడా నిర్మించాలంటున్నారు. ఇది వరకు వచ్చిన తుఫాన్లకు ముక్కాంలో సీసీ రోడ్డు రెండుసార్లు కోతకు గురైంది. మూడు గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తిప్పలవలస, బర్రిపేటలో సీసీ రోడ్డు దెబ్బతింది. గతంలో తీరం వెంబడి అటవీ శాఖ సరుగుడు తోటల్ని పెంచడంతో కొంత రక్షణ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
భయం అలవాటైపోయింది
సముదం గత కొంత కాలంగా ముందుకొస్తూనే ఉంది. గతంలో సీసీ రహదారి, కరెంటు స్తంభాలు, తాటాకు గృహాలు కెరటాలకు నేలకొరిగాయి. వాతావరణంలో మార్పులు, అమావాస్య రోజుల్లో సముద్రం భీకరంగా ముందుకొచ్చి గ్రామాన్ని తాకుతోంది. ఓ పక్క భయంగా ఉన్నా గత్యంతరం లేక అలవాటు చేసుకొన్నాం.
గనగళ్ల రాంబాబు, మత్స్యకారుడు, ముక్కాం.
ఈ ఇల్లే ఆధారం
అనేకసార్లు సముద్రం ఇంటివరకు వచ్చింది. కెరటాలు పెద్దగా వచ్చి ఇంటిని తాకుతుంటాయి. మట్టి గోడ నాని పడిపోకుండా అడ్డుగా చెక్కలను పెట్టుకుంటున్నాను. ఇల్లు ఇప్పటికే పూర్తిగా పాడైపోయింది. గత్యంతర ం లేక ఇక్కడే ఉండాల్సి వస్తోంది.
గరికిన లక్ష్మి, ముక్కాం.
Updated Date - Jul 25 , 2025 | 12:16 AM