Not Even 50% Completed! 50 శాతం కూడా పూర్తికాలే!
ABN, Publish Date - Jul 28 , 2025 | 11:38 PM
Not Even 50% Completed! జిల్లాలో జలజీవన్ మిషన్ పనులకు మోక్షం లభించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు కొలిక్కిరావడం లేదు. చాలాచోట్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోగా.. మరికొన్నిచోట్ల పూర్తయినా తాగునీరు సరఫరా కావడం లేదు. కుళాయిలు దిష్టిబొమ్మల్లా మారాయి. దీంతో గిరిజన , మైదాన ప్రాంతవాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొన్నిచోట్ల అర్ధాంతరంగా నిలిచిన వైనం
గత వైసీపీ ప్రభుత్వ తీరుతో చెల్లింపు కాని బిల్లులు
ఆగుతూ.. సా...గుతున్న నిర్మాణాలు
దిష్టిబొమ్మల్లా మారిన కుళాయిలు
ప్రజలకు అందని తాగునీరు
పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
పార్వతీపురం, జూలై28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలజీవన్ మిషన్ పనులకు మోక్షం లభించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు కొలిక్కిరావడం లేదు. చాలాచోట్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోగా.. మరికొన్నిచోట్ల పూర్తయినా తాగునీరు సరఫరా కావడం లేదు. కుళాయిలు దిష్టిబొమ్మల్లా మారాయి. దీంతో గిరిజన , మైదాన ప్రాంతవాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల జవన్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే జిల్లాలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. గత ఐదేళ్ల నుంచి పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. గతంలో చేపట్టిన నిర్మాణాలకు వైసీపీ సర్కారు సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడం.. కేంద్రం మంజూరు చేసిన నిధులను పక్కదారి పట్టించడం తదితర కారణాలతో మన్యంలో జేజేఎం పనులు పూర్తికావడం లేదు. కాగా వాటి నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో సుమారు రూ.288 కోట్లతో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించారు. ఇందులో 588 పనులు పూర్తి కాగా 624 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 486 టెండర్ దశలో ఉన్నాయి. 315 పనులకు టెండర్లు పూర్తయినప్పటికీ పనులు ప్రారంభించ లేదు. రూ.15 కోట్ల వరకు బిల్లులు అప్‌లోడ్ చేసినప్పటికీ చెల్లింపులు జరగలేదు. జిల్లాలో లక్షకు పైగా కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు 46,984 కుళాయిలు ఏర్పాటు చేయగా.. రూ.47 కోట్లు వెచ్చించారు. మరో రూ.50 కోట్ల పనులకు బిల్లులు అప్‌లోడ్ చేయాల్సి ఉందని ఆర్ డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ప్రభాకరరావు తెలిపారు. రూ.15 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
నత్తనడకన..
సీతంపేట రూరల్: సీతంపేట మన్యంలో సర్వే నిర్వహించి 326 గ్రామాలను గుర్తించారు. అప్పట్లో రూ.16.59కోట్ల కేటాయించారు. అయితే జేజేఎం పనులు నత్తనడకన సాగుతుండడంతో గిరిజనులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాదికి జేజేఎం పనులు పూర్తిచేయాల్సి ఉండగా.. మరో తొమ్మిది నెలలు గడువు పొడిగించారు. మొత్తంగా 169 పనులు పూర్తయినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సత్యం తెలిపారు. వచ్చే ఏడాదికి అన్ని గిరిజన గ్రామాలకు తాగునీరు అందిస్తామని చెప్పారు.
- భామిని: సింగిడి గ్రామంలోని కొనసాగుతున్న జేజేఎం పనులకు వంశధారకు వరదనీరు అడ్డంకిగా మారింది. ఈ ఏడాది జూన్ 15లోగా పూర్తి చేయాలని గడువు విధించినా.. వాతావరణం అనుకూలించికపోవడం, తాజాగా వంశధారలో నీటి ప్రవాహం పెరగడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు గత ఏడాది రూ.60 కోట్లు మంజూరు చేశారు. 54 గ్రామాలకు సంబంధించి 72 కిలోమీటర్లు ద్వారా పైపు లైన్లు వేసి తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ సందీప్‌కుమార్‌ను వివరణ కోరగా.. వచ్చేఏడాది మార్చి వరకు పనులకు గడువు పొడిగించారన్నారు. ప్రస్తుతం కొన్ని గ్రామాలకు జేజేఎం ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మరికొన్ని గ్రామాలకు పైపులైన్, వాటర్ ట్యాంక్ పనులు చేపడుతున్నామన్నారు.
సరఫరా కావట్లే..
సాలూరు రూరల్: సాలూరు మండలంలో రూ. 27.53 కోట్లతో 231 జేజేఎం పనులు మంజూరు చేశారు. అయితే ఇప్పటి వరకు 57 పనులు ప్రారంభం కాలేదు. 171 పనులను పూర్తి చేశారు. మరో మూడు పనులు కొనసాగుతున్నాయి. కాగా పనులు పూర్తి చేసిన పలు గ్రామాల్లో పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కావడం లేదు. ఇందుకు వాటర్‌ట్యాంక్‌ల సామర్థ్యం పెంచాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
- బలిజిపేట: బలిజిపేటలో పలు వీధులకు జేజేఎం కుళాయిల ద్వారా తాగునీరు అందడం లేదు. మండలంలో 38 గ్రామాలుండగా.. 18 ప్రాంతాల్లో రూ.6.73 కోట్లతో పనులు మంజూరు చేశారు. కొన్ని గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. మరికొన్నిచోట్ల జేజేఎం పనులు చివరి దశకు చేరుకున్నాయి. కాగా పనులు పూర్తయిన గ్రామాల్లో తాగునీటి సరఫరా అందడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.
కొనసా...గుతున్నాయ్..
కురుపాం: మండలంలో రూ.20.80కోట్లతో 177 పనులు మంజూరు కాగా ప్రస్తుతం 51 పనులు జరుగుతున్నాయి. గిరిజన గ్రామాల్లో పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, టెండర్ల ప్రక్రియలో మరికొన్ని ఉన్నాయని ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ వేణుగోపాల్ తెలిపారు.
అరకొరగా..
గరుగుబిల్లి: మండలానికి సంబంధించి 25 పంచాయతీలకు గాను 12 పంచాయతీల్లోనే అరకొరగా జేజేఎం పనులు నిర్వహించారు. 13 పంచాయతీల్లో పనులు ప్రారంభం కాలేదు. సుమారు రూ. 40 లక్షలు మేర బిల్లుల చెల్లింపులు కాకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచాయి. కొన్ని పంచాయతీల్లో కొళాయిలు ఏర్పాటు చేసినా తాగునీరందని పరిస్థితి నెలకొంది.
ఇంకా టెండర్ దశలోనే
జియ్యమ్మవలస: మండలంలో రూ. 535.70 లక్షలతో 29 చోట్ల జేజేఎం పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే 9 చోట్ల పనులు పూర్తయినా ఇంకా ప్రజలకు తాగునీరు అందడం లేదు. మరో 20 చోట్ల ఇంకా టెండర్ దశలోనే పనులున్నాయి.
పైప్‌లైన్ వర్క్‌లు జరగక..
సీతానగరం: నిధులున్నా పెదభోగిలి పంచాయతీ బుడ్డిపేట, గుచ్చిమి గ్రామాల్లో సకాలంలో జేజేఎం పనులు చేపట్టలేదు. దీంతో గ్రామస్థులు తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. అరకొరగా నిధులు మజూరు కావడంతో చాలాచోట్ల పైప్‌లైన్ వర్క్‌లు సరిగ్గా జరగలేదు. ఈ నేపథ్యంలో లక్ష్మీపురం, జానుమనివలస, పణుకుపేట, ఏగోటివలస గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరందడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ పవన్‌కుమార్‌ను వివరణ కోరగా గుచ్చిమి, బుడ్డిపేట గ్రామాల్లో పనులు త్వరలో జరిపిస్తామని, నిధులు అరకొరగా మంజూరైన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టామని వెల్లడించారు.
40 గ్రామాల్లో పూర్తి
పాచిపెంట: మండలంలోని 52 గ్రామాలకు జేజేఎం నిధులు మంజూరు కాగా 40 గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన 12 గ్రామాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు రూ. 10 కోట్లు మంజూరైనట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రామాంజనేయులు తెలిపారు.
మధ్యలో నిలిచిపోయాయ్..
పార్వతీపురం రూరల్: లక్ష్మీనారాయణపురం తదితర గ్రామాల్లో జేజేఎం పనులు నిలిచిపోయాయి. దీనివల్ల ఇంటింటికి కొళాయి కలగా మారిందని చెప్పవచ్చు. దీంతో గ్రామస్థులు తాగునీటికి నానా అవస్థలు పడుతున్నారు.
- గుమ్మలక్ష్మీపురం: జేజేఎం కింద మండలంలో 96 గ్రామాల్లో పనులకు రూ.2కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. అయితే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. బిల్లులు చెల్లింపులు కావడం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ప్రవీణ్ స్పష్టం చేశారు.
- మక్కువ: మండల కేంద్రంలో చేపట్టిన జలజీవన్‌మిషన్ పనులు అర్ధాంతరంగా నిలిచాయి. సుమారు 450 పాయింట్ల వరకు కుళాయిలు బిగించి వదిలేశారు. ప్రస్తుతం అవి దిష్టిబొమ్మల్లా మిగిలాయి. వచ్చే ఏడాది మార్చి 31లోపు పనులు పూర్తిచేసి తాగునీరు అందజేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు.
- వీరఘట్టం: మండలంలో 33 గ్రామాల్లో జేజేఎం పనులు జరుగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు గ్రామాల్లో వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయినప్పటికీ పైపులు మాత్రం అమర్చలేదు. కొళాయిల నిర్మాణాలు కూడా పూర్తిస్థాయిలో చేపట్టలేదు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ కావ్యశ్రీని వివరణ కోరగా.. పనులు జరుగుతున్నాయన్నారు.
Updated Date - Jul 28 , 2025 | 11:39 PM