ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

No Water... Village Deserted నీరు లేక... ఊరు ఖాళీ!

ABN, Publish Date - Apr 27 , 2025 | 11:33 PM

No Water... Village Deserted ఒకప్పుడు ఎంతో కళకళలాడేది టచ్చిడి కొండ శిఖర గ్రామం. కేవలం నీటి సదుపాయం లేని కారణంతో ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. మండల కేంద్రానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ గ్రామంలో గతంలో 80 ఇళ్లు ఉండేవి. అయితే తాగునీటి వసతి లేక చాలామంది ఆ గ్రామాన్ని ఖాళీ చేశారు.

గ్రామానికి దూరంగా ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న టచ్చిడి గ్రామ గిరిజనులు

ఒకప్పుడు 80 ఇళ్లు.. నేడు మూడు కుటుంబాలే..

మౌలిక వసతులకు నోచని వైనం

విద్య , వైద్యం, నిత్యావసర సరుకులకు అవస్థలు

ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విన్నపం

కురుపాం రూరల్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఎంతో కళకళలాడేది టచ్చిడి కొండ శిఖర గ్రామం. కేవలం నీటి సదుపాయం లేని కారణంతో ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. మండల కేంద్రానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ గ్రామంలో గతంలో 80 ఇళ్లు ఉండేవి. అయితే తాగునీటి వసతి లేక చాలామంది ఆ గ్రామాన్ని ఖాళీ చేశారు. కుటుంబాలతో వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. ప్రస్తుతం టచ్చిడిలో మూడు గిరిజన కుటుంబాలే నివస్తున్నాయి. మౌలిక వసతుల కొరతతో వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామం వైపు చూసేవారే లేరని.. తమ గోడు వినేవారే కరువయ్యారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

- పొడి పంచాయతీ పరిధిలో ఉన్న టచ్చిడి గిరిజన గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో నాగర గెడ్డ ప్రవహిస్తోంది. అయినప్పటికీ ఆ గ్రామస్థులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

- సుమారు 40 ఏళ్ల కిందట ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పడానికి నీరు లేక మొత్తం 80 ఇళ్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. దీంతో నీటి బాధలు పడలేక దాదాపు 70 కుటుంబాల వారు ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.

- మిగిలిన 11 కుటుంబాలు టచ్చిడి గ్రామంలో నివసించేవారు. అయితే తాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో గత పదేళ్లలోఎనిమిది కుటుంబాలు టచ్చిడిని వీడాయి. స్వగ్రామంలో భూములను వదిలిపెట్టి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న చీడిమానుగూడ, బారామణి, నీలకంఠాపురం, టెంకిడి, కొండబారిడి , జైపురం, భారతంగి వంటి ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు.

- ప్రస్తుతం ఆరిక అన్నపూర్ణ, చిన్నమ్మి, రంగారావు కుటుంబాలు మాత్రమే ఆ గ్రామంలో నివసిస్తున్నాయి. ఆ మూడు ఇళ్లలో పదకొండు మంది మాత్రమే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కొండపొడు వ్యవసాయం చేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్నారు.

బావి ఉన్నా.. సరఫరా కాని నీరు..

టచ్చిడి రెవెన్యూ గ్రామంగా నమోదైంది. గ్రామానికి కిలోమీటరు దూరంలో పంచాయతీ పరంగా బావిని తవ్వారు. సబ్‌మెర్సిబుల్‌ మోటారు ఏర్పాటు చేశారు. గ్రామంలో చిన్నపాటి వాటర్‌ ట్యాంకు ఏర్పాటు చేశారు. అయితే నూతిలో సరైన లోతులో మోటారును అమర్చలేదు. దీంతో నూతిలో నీరు ఉన్నా గ్రామానికి సరఫరా కావడం లేదు.

విద్య, వైద్యం అందక..

స్నానాలు కోసం గ్రామస్థులు రెండు కిలోమీటర్ల దూరంలోని నాగర గెడ్డకు వెళ్లాల్సి వస్తోంది. ఆ ప్రాంతంలో చిన్నారులు ఆరిక నందిని (5), ఆరిక షర్మిల (2) సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కరెండిగూడ ప్రాఽథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లలేకపోతున్నారు. రోడ్డు సదుపాయం లేని కారణంగా టచ్చిడి గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సరైన వైద్యం అందక నాలుగేళ్ల కిందట ఆరిక రంగారావు కుమార్తె సాయి పల్లవి (6) మరణించింది. నిత్యావస సరుకుల కోసం గ్రామస్థులు ఆరు కిలోమీటర్ల దూరంలోని మొండెంఖల్‌ లేదా నాగర వెళ్లాల్సి వస్తోంది.

ఉపాధి లేక.. ఇళ్లు మంజూరు కాక..

గ్రామస్థులకు ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులు లేవు. మరోవైపు వారికి నూతన గృహాలు కూడా మంజూరు కావడం లేదు. గ్రామంలోని పదకొండు మంది అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంతవరకూ అధికారులు, ప్రజ్రాపతినిధులు తమ గ్రామాన్ని సందర్శించలేదని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. తాగునీటితో పాటు రోడ్లు, విద్య, వైద్యం, ఇళ్లు, జాబ్‌కార్డుల కోసం గ్రీవెన్స్‌లో వినతులు ఇచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

మౌలిక వసతులు కల్పించాలి..

టచ్చిడి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలి. ప్రధానంగారోడ్డు నిర్మించి.. బావికి వెళ్లే దారిని బాగు చేయాలి. బావిలో మోటారును సరైన పద్ధతిలో అమర్చాలి. గ్రామస్థులందరికీ జాబ్‌ కార్డులు ఇప్పించి.. ఇళ్లు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

- ఆరిక రంగారావు, టచ్చిడి గ్రామస్థుడు

===============================

నీటి సదుపాయం కల్పిస్తాం

గ్రామంలో నీటి ఎద్దడి నెలకొన్న మాట వాస్తవం. దీనిపై గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. తక్షణం నీటి సదుపాయం కల్పిస్తాం. పంచాయతీలో చర్చించి రోడ్డుపై తీర్మానం చేస్తాం. ఉపాధి జాబ్‌ కార్డులు, ఇళ్లు మంజూరుకు కృషి చేస్తాం.

- పి. రాము. పంచాయతీ కార్యదర్శి

Updated Date - Apr 27 , 2025 | 11:33 PM