Thirst Unquenched! నీళ్లు రావట్లే.. దాహం తీరట్లే!
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:17 AM
No Water Supply… Thirst Unquenched! జిల్లా కేంద్రం గొంతెండుతోంది.. తాగునీటి సమస్య తీవ్రమైంది. తాగునీటి సరఫరా కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గత ఎనిమిది రోజులుగా మున్సిపాల్టీ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. పురపాలక సంఘం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు.
గత ఎనిమిది రోజులుగా సమ్మెలో తాగునీటి సరఫరా విభాగం కార్మికులు
నిలిచిన సరఫరా.. బిందెడు నీటి కోసం అవస్థలు
ఎవరికీ పట్టని ప్ర‘జల’ ఇక్కట్లు
మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై మున్సిపల్ వాసుల మండిపాటు
పార్వతీపురం టౌన్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం గొంతెండుతోంది.. తాగునీటి సమస్య తీవ్రమైంది. తాగునీటి సరఫరా కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గత ఎనిమిది రోజులుగా మున్సిపాల్టీ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. పురపాలక సంఘం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు బిందెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. వార్డులు, శివారు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రెండు, మూడు రోజుల కిందట వరకు ఏదోలా తాగునీటి సరఫరా చేసిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. తోటపల్లి ప్రధాన పంప్ వద్ద నైపుణ్యం కలిగిన కార్మికులు లేరు. నీటిని తోడే మోటార్లు మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో 30 వార్డులకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రజలు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం మున్సిపాల్టీ ఏర్పడి సుమారు 60 ఏళ్లు దాటిపోయింది. గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలోని నాగావళి నది నుంచి పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా అయ్యేలా సుమారు 50 ఏళ్ల కిందటే పనులు చేపట్టారు. అయితే 2002లో పార్వతీపురం మున్సిపాల్టీ గ్రేడ్ -1 గా రూపాంతరం చెందింది. మూడేళ్ల కిందట జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినా.. తాగునీటి సరఫరా గాడిన పడలేదు. వేసవిలోనే కాదు అన్ని కాలాల్లోనూ ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బిందెడు నీటి కోసం పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.
2019 తర్వాత మారిన సీన్..
పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2018లో రూ.33.33 కోట్లతో బృహత్తర తాగునీటి సరఫరా పథకానికి అడుగులు పడ్డాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గరుగుబిల్లి మండలం గొర్లి సీతారాంపురం వద్ద తాగునీటి సరఫరా పథకానికి స్థల సేకరణ కూడా పూర్తిచేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపేసింది. 2020లో రూ.66.60 కోట్లతో తాగునీటి పథకానికి నాటి వైసీపీ పాలకులు శిలాఫలకం ఆవిష్కరించినా పనులు మాత్రం పూర్తిచేయించలేక పోయారు.
జనాభాకు తగ్గట్టుగా సరఫరా ఏదీ..?
2012 గణాంకాల ప్రకారం పార్వతీపురం మున్సిపాల్టీ జనాభా 55వేల మంది. ప్రస్తుతం 30 వార్డుల్లో అనధికారికంగా చూసుకుంటే 80 వేలమందికి మించి ఉంటారు. అయితే తాగునీటి కార్మికుల సమ్మె వల్ల సరఫరా పూర్తిగా స్తంభించింది. దీంతో పట్టణంలో దాహం కేకలు తీవ్రమయ్యాయి. మున్సిపాల్టీ వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతవాసులైతే గత వారం రోజులుగా తాగునీటికి కటకటలాడుతున్నారు. ట్యాంకర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా పట్టణవాసులకు రోజుకు కనీసం 5 లక్షల లీటర్ల తాగునీటిని అందించాల్సి ఉంది. కానీ అందులో సగం కూడా అందించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జనాభాతో పాటు నీటి వినియోగం పెరుగుతుందన్న వాస్తవాన్ని ఇంజనీరింగ్ అధికారులు గుర్తించడం లేదు. సరైన అంచనాలతో పాటు పటిష్ఠ చర్యలు చేపట్టకపోవడంతో పట్టణవాసులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.
ప్రణాళికలు లేక...పైప్‌లైన్ లీకులతో ...
వేసవిలో నీటి ఎద్దడితో పాటు పైప్‌లైన్లు, ప్రధాన, బూస్టర్ పంప్‌హౌస్, నాగావళి నదిలోని ఇన్‌ఫ్టిల్టర్ బావుల్లో నీటిని తోడే మోటర్ల నిర్వహణ, మరమ్మతులకు రూ.20 లక్షల నుంచి రూ.25 ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎక్కడ లోపాలు ఉన్నాయన్నది పరిశీలించడం లేదు. ఏం చేస్తే పట్టణ ప్రజలందరికీ పూర్తిస్థాయిలో తాగునీటిని సరఫరా చేయగలమనే దానిపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించడం లేదు. మరోపైపు పైప్‌లైన్ లీకుల సమస్య వేధిస్తున్నా.. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టడం లేదు. ప్రస్తుతం తాగునీటి సరఫరా కార్మికులు సమ్మెలో ఉన్నారు. ఇప్పటికే ఐదు రోజులకొకసారి పట్టణంలో తాగునీటి సరఫరా జరుగుతోంది. ఆయా వీధుల మహిళలు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మరోవైపు ప్రధాన, బూస్టర్ పంప్‌హౌస్‌ల వద్ద తాత్కాలిక కార్మికులను నియమించారు. అయితే భవిష్యత్‌లో తాగునీటి సరఫరా సమస్యలు మరింత జటిలమయ్యే అవకాశం ఉందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరితగతిన స్పందించి సమ్మెలో ఉన్న కార్మికులతో చర్చలు జరిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ప్రజాగ్రహానికి గురి కాకతప్పదు.
సమ్మెను విరమింపజేయాలి..
ఇప్పటికే ఐదు రోజులకొకసారి పట్టణంలో తాగునీటి సరఫరా జరుగుతోంది. మరోవైపు కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. పాలకులు, అధికారులు స్పందించి సమ్మెను విరమించేలా చర్యలు తీసుకోకపోతే ప్రజాగ్రహాన్ని చూడక తప్పదు. తాగునీటి సరఫరాపై తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది.
ఎస్.ఉమా, కొత్తవీధి, పార్వతీపురం
====================================
మాకు న్యాయం చేయాలి
తాగునీటి సరఫరా విభాగంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం. పాలకులు, అధికారులు మాపై అశ్రద్ధ చూపడం వల్లే సమ్మెకు దిగాం. సమాన పనికి వేతనం చెల్లించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.
- బాలు, మున్సిపల్ తాగునీటి సరఫరా కార్మికుడు
====================================
పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం..
పట్టణంలోని 30 వార్డులకు తాగునీటిని సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేశాం. సమ్మె కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యచరణను రూపొందించాం. ఇప్పటికే తోటపల్లి పరిధిలోని నాగావళి నదిలో నీటిని ఇన్‌ఫిల్టర్ బావులకు మళ్లించాం. సమ్మె విరమించాలని తాగునీటి సరఫరా కార్మికులను కోరుతున్నాం.
- శ్రీనివాసరాజు, డీఈ, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం
Updated Date - Jun 17 , 2025 | 12:17 AM