Zero Maintenance! పర్యవేక్షణ లేదు.. నిర్వహణ నిల్!
ABN, Publish Date - May 30 , 2025 | 11:32 PM
No Supervision... Zero Maintenance! జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. లస్కర్లు, ఇతర సిబ్బంది లేక వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇంజనీర్లే అన్నీ తామై చూసు కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు కాలువలపై పర్యవేక్షణ కూడా కొరవడింది.
దయనీయ స్థితిలో కాలువలు
కబ్జాలకు గురై బలహీనపడుతున్న గట్లు
లస్కర్లు, ఇతర సిబ్బంది లేక ఇబ్బందులు
గత వైసీపీ తీరుతో అటకెక్కిన పనులు
ప్రభుత్వం దృష్టి సారించాలని రైతుల వేడుకోలు
జియ్యమ్మవలస, మే 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. లస్కర్లు, ఇతర సిబ్బంది లేక వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇంజనీర్లే అన్నీ తామై చూసు కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు కాలువలపై పర్యవేక్షణ కూడా కొరవడింది. ప్రాజెక్టుల ద్వారా శివారు భూములకు నీరందడం లేదు. చాలాచోట్ల కాలువ గట్లు కూడా బలహీనమవగా.. మరికొన్నిచోట్ల కబ్జా లకు గురవుతున్నాయి.
నిధులు మంజూరైనా..
ప్రాజెక్టుల ఆధునికీకరణకు జైకా నిధులు మంజూరైనా.. వైసీపీ ప్రభుత్వ పుణ్యమా అని పనులు అటకెక్కాయి. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి సబ్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (ఎస్‌డీఎంఎఫ్) మంజూరు చేసింది. ప్రాజెక్టుల పరిధిలో హై ప్రయారిటీ వర్క్స్ చేయాలని నీటి పారుదలశాఖకు ఆదేశించింది. ఈ మేరకు గడువు ఇచ్చినా ఆ పనులు కూడా చేయని పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని ప్రాజెక్టులకు గడువు ఇంకా ఉంది. ఆధునికీకరణ పనులు, హై ప్రయారిటీ వర్క్స్ పరిస్థితి ఇలా ఉంటే పూర్తిస్థాయిలో సిబ్బంది లేక ప్రాజెక్టుల నిర్వహణ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు తోటపల్లి, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జంఝావతి, వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ, పెదంకలాం, వట్టిగెడ్డ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,46,994.47 ఎకరాలకు సాగు నీరందేలా వాటి నిర్మాణం చేపట్టారు. అయితే ప్రాజెక్టులతో పాటు కాలువలపై పర్యవేక్షణ కొరవడింది. గత వైసీపీ ప్రభుత్వం వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో శివారు భూములకు సాగునీరందడం లేదు.
ప్రాజెక్టుల నిర్వహణకు నిబంధనలు
- ప్రాజెక్టు నిర్వహణకు ప్రతి 1,500 ఎకరాలకు ఒక లస్కరు ఉండాలి.
- ప్రధాన కాలువల పర్యవేక్షణకు గాను ప్రతి 5 కిలో మీటర్లకు ఒక లస్కరు ఉండాలి.
- కచ్చితంగా ఒక ఎలక్ట్రీషియన్, ఒక ఫిట్టర్, వర్క్ ఇన్‌స్పెక్టర్, వాచ్‌మెన్, హెల్పర్లు ఉండాలి.
- కాలువ గట్టు వెడల్పు మేజర్ ప్రాజెక్టు అయితే ఆరు మీటర్లు, మైనర్ అయితే కాలువ వెడల్పు 2.5 మీటర్ల నుంచి 4 మీటర్లు ఉండాలి.
- సాగునీరు సక్రమంగా అందుతుందా లేదా, కాలువ గట్లు పరిస్థితి, చప్టాలు, మదుములు, స్లాబ్ కల్వర్టులు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలు పూర్తి పరిశీలన చేయాల్సిన బాధ్యత లస్కర్లదే..
- కాలువల ద్వారా నీరు విడుదల చేసినప్పుడు ప్రాజెక్టు పరిధిలో హెల్పర్లు కీలకం.
తోటపల్లి ప్రాజెక్టు
జిల్లా పరిధిలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది. దీని ద్వారా 62,921 ఎకరాలకు సాగునీరందేలా డిజైన్ చేశారు. ఎడమ ప్రధాన కాలువ పొడవు 37.6 కిలో మీటర్లు. ఇది గరుగుబిల్లి మండలం తోటపల్లి నుంచి పాలకొండ మండలం ఊనిగెడ్డ వరకు ఉంది. దీని ద్వారా 32 వేల ఎకరాకలు సాగునీరందుతుంది. పాత కుడి ప్రధాన కాలువ పొడవు 17 కిలో మీటర్లు. ఇది విజయనగరం జిల్లా వంగర మండల కేంద్రం వరకు ఉంది. దీని ద్వారా 8 వేల ఎకరాలకు సాగునీరందేలా గతంలో డిజైన్ చేశారు. అయితే ఈ రెండు ప్రధాన కాలువల నిర్వహణకు 30 మంది సిబ్బంది అవసరం. కాగా నూతనంగా నిర్మించిన మరో కుడి కాలువ పొడవు 117.89 కిలో మీటర్లు. 48 కిలో మీటర్ల వరకు మాత్రమే తోటపల్లి (నాగావళి) నీటి పారుదలశాఖ కాలువను పర్యవేక్షిస్తుంది. మిగిలిన 69.89 కిలో మీటర్ల మేర కాలువను విజయనగరం జిల్లా రాజాం నీటి పారుదలశాఖ పర్యవేక్షణ చేస్తోంది. తోటపల్లి పర్యవేక్షణలో ఉన్న 48 కిలో మీటర్ల కాలువలో 9 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. వాటి ద్వారా 20,521 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 9,200 ఎకరాలకు మాత్రమే నీరందుతుంది. పూర్తిస్థాయిలో కాలువ నిర్మాణం జరగకపోవడమే ఇందుకు కారణం. తోటపల్లి ప్రాజెక్టుకు మొత్తం 78 మంది సిబ్బంది అంటే లస్కర్లు, మజ్దూర్‌లు, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, హెల్పర్లు అవసరం. కానీ పాత రెగ్యులేటర్ పరిధిలో 30 మందికి ఆరుగురే పనిచేస్తున్నారు. ఇంకా 72 మంది అవసరం
జంఝావతి
కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉంది ఈ ప్రాజెక్టు. రాజ్యలక్ష్మీపురం నుంచి పార్వతీపురం మండలం గుచ్చిమి వరకు 26.92 కిలో మీటర్లు మేర ఎడమ కాలువ ఉంది. దీని ద్వారా 12,320 ఎకరాలకు సాగునీరందుతుంది. రాజ్యలక్ష్మీపురం నుంచి బొండపల్లి, తాళ్లబురిడి గ్రామాల వరకు 27 కిలో మీటర్ల మేర కుడి కాలువఉంది. దీని ద్వారా కూడా 12,320 ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ రెండు కాలువల ద్వారా పార్వతీపురం, కొమరాడ మండలాల్లో మొత్తం 24,640 ఎకరాలకు సాగునీరందుతుంది. వీటి నిర్వహణ, కాలువల పర్యవేక్షణకు మొత్తం 30 మంది వరకు సిబ్బంది అవసరం. అయితే ప్రస్తుతం ముగ్గురు లస్కర్లే ఉన్నారు. వారిలో వచ్చే నెలలో ఇద్దరు రిటైర్ కాబోతున్నారు.
వట్టిగెడ్డ
జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ పంచాయతీ రావాడ వద్ద వట్టిగెడ్డ రిజర్వాయర్ ఉంది. దీని కుడి ప్రధాన కాలువ పొడవు 9.756 కిలో మీటర్లు . దీని ద్వారా 13 వేల ఎకరాలకు సాగునీరందేలా డిజైన్ చేశారు. ఎడమ ప్రధాన కాలువ పొడవు 8 కిలో మీటర్లు కాగా దీని ద్వారా 3,680 ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్టుకు 23 మంది లస్కర్లు ఉండాలి. కానీ ఒక్కరే ఉన్నారు. హెల్పర్లు నలుగురు ఉండాలి కానీ ఇద్దరే ఉన్నారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వర్క్‌ఇన్‌స్పెక్టరు లేరు. వాచ్‌మెన్‌లు ముగ్గురు ఉండాలి. కానీ ఒక్కరు కూడా లేరు. ఇప్పటికే కాలువ గట్లు కబ్జాకు గురయ్యాయి. కొందరు కాలువల మధ్యలో దొంగ మదుములు ఏర్పాటు చేయడంతో శివారు భూములకు నీరందడం లేదు.
పెద్దగెడ్డ
పెద్దగెడ్డ ద్వారా మన్యం జిల్లాలో పాచిపెంట, సాలూరు మండలాలతో పాటు విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో 12 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ ప్రాజెక్టులో వేగావతి లెఫ్ట్ మెయిన్ కాలువ (వీఎల్‌ఎంసీ) పొడవు 7.34 కిలో మీటర్లు. దీని ద్వారా 3,600 ఎకరాలకు సాగునీరందుతుంది. వేగావతి కుడి ప్రధాన కాలువ (వీఆర్‌ఎంసీ) పొడవు 10.4 కిలో మీటర్లు. దీని ద్వారా 800 ఎకరాలకు సాగునీరందుతుంది. ఆ రెండే కాకుండా పెద్దగెడ్డ కుడి ప్రధాన కాలువ 18 కిలో మీటర్ల మేర ఉండగా.. దాని ద్వారా 7,600 ఎకరాలకు సాగు నీరందుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 16 మంది లస్కర్లతో పాటు మొత్తం 30 మంది వరకు సిబ్బంది అవసరం. కానీ ఎవరూ లేక అంతా ఇంజనీరే చూస్తున్నారు.
పెదంకలాం
ఇది కేవలం ఆనకట్ట. దీని కాలువ పొడవు 25 కిలో మీటర్లు. దీని ద్వారా మన్యం జిల్లాలో బలిజిపేట మండలానికి 6,617.16 ఎకరాలు, విజయనగరం జిల్లా వంగర మండలంలో 1,636.31 ఎకరాలకు సాగునీరందుతుంది. ఇక్కడ కూడా 11 మంది లస్కర్లతో పాటు ఇతర సిబ్బంది అవసరం. కానీ ఇక్కడ ఎవరూ లేరు. ఇంకొక దయనీయ విషయం ఏమిటంటే పెద్దగెడ్డ ప్రాజెక్టు, పెదంకలాం ఆనకట్టకు ఒక్కరే ఏఈ ఉండడం గమనార్హం.
వెంగళరాయసాగర్
ఈ ప్రాజెక్టు ద్వారా మన్యం జిల్లాలోని మక్కువ మండలంలో 14,550 ఎకరాలకు, సీతానగరం మండలంలో 3,723 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో 6,427 ఎకరాలు సాగునీరందుతుంది. దీని ఎడమ కాలువ పొడవు 0.2 కిలో మీటర్లు. అయితే దాని పరిధిలో రెండు కాలువలు ఉన్నాయి. అందులో ఒక దాని పొడవు పది కిలో మీటర్లు. దీని ద్వారా 880 ఎకరాలకు సాగునీరందుతుంది. ఇంకొక కాలువ పొడవు 8.8 కిలో మీటర్లు. దాని ద్వారా 7,640 ఎకరాలకు సాగునీరందుతుంది. ఇక కుడి ప్రధాన కాలువ పొడవు 18.7 కిలో మీటర్లు కాగా దీని ద్వారా 16,180 ఎకరాలకు సాగునీరందుతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు 45 మంది వరకు సిబ్బంది అవసరం. కానీ ఇద్దరు మెన్ మజ్దూర్‌లు మాత్రమే ఉన్నారు. ప్రాజెక్టుల పరిధిలో కావల్సిన సిబ్బంది కోసం ప్రభుత్వానికి నివేదించామని మరోవైపు ఇంజనీర్లు చెబుతున్నారు.
తోటపల్లి నిర్వహణకు రూ.36 లక్షలు
పార్వతీపురం, మే 30 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత రెగ్యులేటర్ ఎడమ కాలువల పర్యవేక్షణ, నిర్వహణ, పాలకొండ, వీరఘట్టం, గరుగుబిల్లి మండలాల పరిధిలో ఎస్‌డీఎంఎఫ్ పనుల కోసం రూ.36.70 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని నీటిపారుదలశాఖ సహాయ ఇంజనీర్ డి.వెంకటరమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌డీ ఎంఎఫ్ పనులను ఈ-ప్రోక్యూర్మెంట్ ప్లాట్ ఫార్మ్‌లో ఆన్‌లైన్ టెండరు విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు. పదింటిలో ఆరు పనులు క్వాలిటీ కంట్రోల్ అధికారుల పరిశీలనలో పూర్తయినట్లు వెల్లడించారు. వాటి అగ్రిమెంట్ విలువ రూ.9.42 లక్షలని తెలిపారు. బిల్లులను చెల్లించాల్సి ఉందన్నారు.
Updated Date - May 30 , 2025 | 11:32 PM